breaking news
Palikavalasa
-
భూవివాదం: భార్యభర్తల దారుణ హత్య
సాక్షి, విజయనగరం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూవివాదం కారణంగా భార్యభర్తలిద్దరిని గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన మక్కువ మండలం చెముడు పంచాయతీ పాలకవలసలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలికవలస గ్రామానికి చెందిన దంపతులు ఒమ్మి సోములు, నారాయణమ్మలను అదే గ్రామానికి చెందిన సింహాద్రి అనే వ్యక్తి గొడ్డలితో దారుణంగా నరికి చంపారు. పొలంలో పడివున్న మృతదేహాలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. భూ వివాదం కారణంగానే సింహాద్రి ఈ హత్య చేసినట్లు ప్రాథమికంగా అంచానా వేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. -
అడవి బిడ్డలపై అక్కసు!
అడుగడుగునా గిరిజనులకు అవమానం పచ్చచొక్కాల పాలనలో వివక్ష ఆస్పత్రి కమిటీ చైర్మన్‌గా డీవీజీ నియామకం రద్దు 100శాతం గిరిజనులున్న గ్రామంలో పాఠశాల ఎత్తివేత సాక్షి ప్రతినిధి, విజయనగరం : మాజీ ఎంపీ, గిరిజన నేత, వైద్య వృత్తిలో ప్రొఫెసర్‌గా అపార అనుభవం ఉన్న డాక్టర్ డి.వి.జి.శంకరరావుకు మరోసారి అవమానం జరిగింది. గతంలో టీడీపీ టిక్కెట్ ఇస్తామని ఆఖరి వరకు పార్టీ కోసం పనిచేయించుకుని చివరి నిమిషంలో మొండి చేయి చూపింది. ఇప్పుడేమో కోరకుండానే పార్వతీపురం ఏరియా అస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా నియమిస్తే, టీడీపీ నేతల అభ్యంతరంతో ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఆ స్థానంలో రియల్ వ్యాపారి, పార్వతీపురం మండల టీడీపీ అధ్యక్షుడు దొగ్గ మోహనరావును నియమించారు. ఇదంతా ఇన్చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రమేయంతోనే జరిగింది. – సాలూరు మండలంలో 100శాతం గిరిజనులున్న గ్రామం పాలికవలస. గిరిజనులు తప్ప ఇతరులెవ్వరూ ఉండరు. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉండేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ పాఠశాలను ఎత్తివేసింది. ఇక్కడున్న చిన్నారులను పక్కనున్న గ్రామానికి పంపించాలని ఉచిత సలహా ఇచ్చి చేతులేత్తేసింది. దీంతో అక్కడున్న చిన్నారులు కిలోమీటర్ల దూరం నడిచి చదువుకోవల్సి వస్తోంది. కొందరు డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారు. – ఏజెన్సీలో మలేరియాతో ఏటా గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. వ్యాధిని గుర్తించేలోపే పిట్టల్లా రాలిపోతున్నారు. కానీ, మలేరియా మరణాలు బయటికి రాకుండా సమాధి చేసేస్తున్నారు. గిరిజనులు మలేరియా బారిన పడకుండా ఉండేందుకు దోమ తెరలు పంపిణీ చేయాల్సి ఉంది. సుమారు 2.50లక్షల కుటుంబాలకు దోమ తెరలు పంపిణీ చేయాల్సి ఉన్నా... టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క దోమ తెరనూ అందజేయలేదు. గిరిజనులపై టీడీపీ ప్రభుత్వం, పాలకులు ఎంత చిన్న చూపు చూస్తున్నారో, ఎంతగా అవమానిస్తున్నారో ఈ ఉదాహరణలు చాలు. తమకు అనుకూలంగా గిరిజనులు ఉండటం లేదనో, తమ పార్టీకి ఓటేయడం లేదనో తెలియదు గాని పాలకులు వారిపట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల దగ్గరినుంచి గిరిజనులకు అన్యాయం జరుగుతూనే ఉంది. అంతెందుకు టీడీపీలో సీనియర్ నేతైన నిమ్మక జయరాజ్‌కు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థులపై కుల వివాద కేసులు వేయించేందుకు, ఏజెన్సీలో పార్టీ పటిష్టత కోసం ఎంతో వాడుకుని చివరికి టీడీపీ అన్యాయం చేసింది. చివరి నిమిషంలో నిమ్మక జయరాజ్‌ను కాదని పార్టీ మారిన వి.టి.జనార్థన్ థాట్రాజ్‌కు టిక్కెట్ ఇచ్చి తమ బుద్ధిని చూపించుకుంది. పదవినిచ్చి... అవమానించి... పార్వతీపురం మాజీ ఎంపీగా పనిచేసిన డి.వి.జి.శంకరరావుకూ అదే పరిస్థితి ఎదురైంది. గత రెండు ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామని పార్టీ కోసం పనిచేయించుకుని చివరి నిమిషంలో మొండి చేయి చూపింది. కరివేపాకులా వాడుకుని తీసి పారేసింది. ప్రస్తుతం మిమ్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన స్వతహాగా గిరిజనుడు కావడంతో గిరిజన ప్రాంతానికి ముఖద్వారమైన పార్వతీపురం ఏరియా ఆస్పత్రుల్లో గిరిజనుల కోసం మెరుగైన వైద్య సేవలందించేందుకు దోహద పడతారని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా గత కలెక్టర్ ఎం.ఎం.నాయక్ నియమించారు. వాస్తవానికి డీవీజీ ఆ పోస్టును కోరుకోలేదు. ఆయనపై ఉన్న నమ్మకంతో కలెక్టర్ నియమించారు. దానిని అక్కడి నేతలు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ నేతలను కాకుండా డీవీజీని ఎలా నియమిస్తారని అడ్డు తగిలారు. ఏకంగా ఇన్చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇంకేముంది అధికారులకు ఒత్తిళ్లు వచ్చాయి. డీవీజీ నియామక ఉత్తర్వులను రద్దు చేసి ఆ స్థానంలో రియల్ వ్యాపారైన మండల టీడీపీ అధ్యక్షుడు దొగ్గ మోహనరావును నియమించారు. వాస్తవానికి ఎన్జీఓగా ఉన్న వ్యక్తినే చైర్మన్‌గా నియమించాల్సి ఉన్నా... ఇక్కడ మండల టీడీపీ అధ్యక్షుడు హోదానే పరిగణనలోకి తీసుకోవడం విశేషం. గాలికి వదిలేశారు ఇక 100శాతం గిరిజనులున్న గ్రామాల్లో రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలను మూసివేశారు. వసతి గృహాలను, ఆశ్రమ పాఠశాలలను మూసివేశారు. మలేరియా బారి నుంచి దోమ తెరలిచ్చి కాపాడాల్సింది పోయి వాటిని పంపిణీ చేయకుండా గిరిజనులను వ్యాధులకు వదిలేశారు. గిరిజనులకు వైద్యం ఎలా అందుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇటీవల గజపతినగరం నడిరోడ్డుపై ప్రసవించిన గిరిజన గర్బిణీ ఉదంతాన్నే తీసుకోవచ్చు. ఇదంతా చూస్తుంటే గిరిజనులపై ఈ ప్రభుత్వం కక్షసాధింపునకు దిగుతున్నట్టు స్పష్టమవుతోంది.