రిక్రియేషన్ క్లబ్
రిక్రియేషన్ క్లబ్లో ప్రజల వినోదం కోసం క్యారమ్స్, షటిల్, బ్యాడ్మింటన్, చెస్ వంటి ఆటలు ఆడించాలి.. పేకాట, క్రికెట్ బెట్టింగుల వంటివి ఉండకూడదు. అక్కడ వచ్చే డబ్బు క్లబ్ మెయింటెన్స్‌కు మాత్రమే వాడుకోవాలి. మేనేజరుకు ముందే డబ్బు చెల్లించి కాయిన్స్ తీసుకుని 13 కార్డుల రమ్మీ ఆడుకోవచ్చు. ఎలాంటి డబ్బు లావాదేవీలు ఉండకూడదు.
మదనవల్లెలో ఏం జరుగుతోందంటే....
రిక్రియేషన్ క్లబ్లో నియమ నిబంధనలకు విరుద్ధంగా జూదం నిర్వహిస్తున్నారు. వినోదం పేరుతో కర్ణాటక రాష్ర్టం నుంచి జూదరులను పిలిపించి, వారికి కావలసిన వసతులు కల్పించి పేకాట జోరుగా నడుపుతున్నారు. ప్రతి రోజు రూ.లక్షల్లో చేతులు మారుతోంది. ఈ వ్యాపారం తెలుగుదేశం పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పోలీసులను సైతం బెదిరిస్తూ ఉండటంతో నామ మాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం జరిపిన పోలీసు దాడుల్లో భారీ నగదు, పలువురు జూదరులను అదుపులోకి తీసుకొన్న విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.
- కర్ణాటక నుంచి వస్తున్న పేకాట రాయుళ్లు
- పట్టణ నడిబొడ్డునే జోరుగా జూదం
- అడ్డాగా మారిన మూతబడిన థియేటర్
- టీడీపీ నాయకులకు కాసుల వర్షం
మదనపల్లె : రెండు నెలల క్రితం టీడీపీ నాయకులు మదనపల్లె పట్టణ నడిబొడ్డున ఓ మూత పడిన సినిమా థియేటర్లో రిక్రియేషన్ క్లబ్‌ను ప్రారంభించారు. మొదట ఎవరికి అనుమానం రాకుండా క్రీడా పరికరాలను సమకూర్చారు. మరిన్ని హంగులతో జూదరులను ఆకర్షించే విధంగా తయారు చేశారు. విషయం బయటకు పొక్కడంతో జూదరులు ఆటలు ఆడేందుకు అక్కడికి రావడం మొదలు పెట్టారు. ఈ వ్యవహారం నెలరోజులపాటు జోరుగా సాగింది. అక్కడికి వచ్చిపోయో వారి నుంచి నిర్వాహకులు ముందుగా వేలల్లో సభ్యత్వం తీసుకుని వారినే లోనికి అనుమతిస్తూ వచ్చారు. మెల్లమెల్లగా నిర్వాహకులు కాయిన్స్ బూచిగా చూపి పేకాటను ఆడించటం మొదలు పెట్టారు.
రోజూ అధిక సంఖ్యలో క్లబ్‌కు జూదరులు క్యూ కట్టారు. క్లబ్ నిర్వాకులు రూ.లక్షల్లో దండుకోవటం ప్రారంభించారు. జూదం జోరుగా సాగుతోందని ప్రచారం పట్టణంలో చర్చనీయాంశం కావడంతో పోలీసులు ఇటీవల రిక్రియేషన్ క్లబ్‌పై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో నిర్వాహకులు తమకు హైకోర్టు నుంచి అనుమతి ఉందని పోలీసులకు ఆధారాలు చూపించి పక్కదారి పట్టించి మేనేజ్ చేసినట్లు సమాచారం. సభ్యత్వం ఉన్న వారిని లోనికి అనుమతించి కాయిన్స్ పెట్టి రమ్మి ఆడిస్తున్నామని బుకాయించే ప్రయత్నం చేశారు. పోలీసు దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
- క్లబ్ వ్యవహారంపై నిర్వాహకులను వివరణ కోరగా తాము అక్రమంగా క్లబ్ నిర్వహించడం లేదన్నారు. సొసైటీకి అనుమతి ఉందని, ఆ మేరకే నిర్వహిస్తున్నామన్నారు.
కేసు నమోదు చేశాం
క్లబ్ వ్యవహారంపై టూ టౌన్ ఎస్ఐ గంగిరెడ్డిని వివరణ కోరగా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి కొంత నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశామన్నారు.