Okuhara
-
క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్
కౌలాలంపూర్ (మలేసియా): భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్ భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో సైనా నెహ్వాల్ 21-14, 21-16 తేడాతో యిప్ పుయ్ యిన్ (హాంకాంగ్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు. కేవలం 39 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సైనా ఆద్యంతం పైచేయి సాధించారు. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సైనా, రెండో గేమ్‌లో మాత్రం కాస్త పోరాడి గెలిచారు. శుక్రవారం జరుగనున్న క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఒకుహారా(జపాన్)తో సైనా తలపడతారు. ఇరువురి మధ్య ముఖాముఖి రికార్డులో సైనా 8-4తోముందంజలో ఉన్నారు. గతేడాది జరిగిన రెండు వరుస టోర్నమెంట్లలో(డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఒకుహారాపై సైనా విజయం సాధించారు. -
వారెవ్వా సింధు
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో తెలుగు తేజం పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మహిళల క్వార్టర్ ఫైనల్ పోరులో సింధు 20-22, 21-18, 21-18 తేడాతో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. 84 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు శభాష్ అనిపించింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌ను సింధు చేజార్చుకుంది. ప్రతీ పాయింట్ కోసం ఇరువురి క్రీడాకారిణల మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగిన మొదటి గేమ్‌ను సింధు స్వల్ప తేడాతో కోల్పోయింది. ఇక రెండో గేమ్‌లో తొలి అర్థం భాగం వరకూ ఇరువురి మధ్య ఆసక్తికర పోరు సాగింది. కాగా, చక్కటి ప్లేస్‌మెంట్స్‌తో ఆకట్టుకున్న సింధు.. ఒకుహరాను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ క్రమంలోనే రెండో గేమ్‌ను 21-18తో గెలిచి స్కోరును సమం చేసింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం ఒకుహరా నుంచి సింధుకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒకుహరా సుదీర్ఘ ర్యాలీలతో సింధును ఇబ్బంది పెట్టే యత్నం చేసింది. అయితే దాన్ని తన అనుభవంతో అధిగమించిన సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో తొలిసారి సింధు సెమీస్‌లోకి ప్రవేశించి కొత్త చరిత్రను లిఖించింది. -
కొరియా సూపర్ సిరీస్ విజేత సింధునే
-
సింధు ప్రతీకార విజయం
సియోల్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో పివి సింధు 22-20, 11-21, 21-18 తేడాతో జపాన్ క్రీడాకారిణి ఒకుహారాపై విజయం సాధించి కొరియా సూపర్ సిరీస్ ను కైవసం చేసుకున్నారు. తద్వారా ఈ టోర్నమెంట్ లో తొలిసారి సింధు విజేతగా అవతరించారు. ఇరువురి క్రీడాకారిణులు మధ్య హోరాహోరీగా సాగిన తుది పోరులో సింధు విజయం సాధించి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఒకుహురా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. తొలి గేమ్ లో ఒకుహారా 12-9 తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో సింధు వరుసగా పాయింట్ల సాధించి స్కోరును సమం చేశారు. ఆ తరువాత అదే ఊపును కొనసాగించి మరింత ఆధిక్యాన్ని సింధు సాధించారు. కాగా, ఆ దశలో పుంజుకున్న ఒకుహారా 19-18 తో ముందుకు దూసుకెళ్లారు. అయితే ఓ చక్కటి బ్రేక్ పాయింట్ ద్వారా ఒకుహారా ఆధిక్యాన్ని తగ్గించిన సింధు.. దాన్ని కాపాడుకుని తొలి గేమ్ ను 22-20తేడాతో సొంతం చేసుకున్నారు. రెండో గేమ్ లో మాత్రం ఒకుహారా ఆది నుంచి పైచేయి సాధిస్తూ సింధును వెనక్కునెట్టింది. ఏ దశలోనూ సింధుకు అవకాశం ఇవ్వని ఒకుహారా అదే జోరును కొనసాగించి రెండో గేమ్ ను సాధించారు. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది. మూడో గేమ్ లో ఒకుహారా-సింధుల మధ్య ఆసక్తికర పోరు సాగింది. నువ్వు-నేనా అన్న రీతిలో సాగిన ఫైనల్ గేమ్ లో సింధు పెద్దగా పొరపాట్లకు తావివ్వలేదు. కాగా, సింధు 19-16 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న దశలో ఒకుహోరా మరోసారి పుంజుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య 56 సెకెండ్ల సుదీర్ఘమైన ర్యాలీ జరిగింది. ఇక్కడ ఒకుహారా పాయింట్ సాధించనప్పటికీ, సింధు మాత్రం ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా మూడు పాయింట్ల తేడాతో గేమ్ తో పాటు మ్యాచ్ ను కూడా సాధించారు. దాంతో కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను సింధు కైవసం చేసుకున్నారు. తొలిసారి కొరియా ఓపెన్ ను అందుకున్న సింధును వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని టైటిల్ సాధించాలని ఆకాంక్షించారు. మరొకవైపు సింధును బిగ్ బి అమితాబచ్చన్ కొనియాడారు. ఇదొక స్వీట్ రివేంజ్ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. -
ప్రపంచ చాంపియన్‌పై సింధు ప్రతీకార విజయం
-
సమయం వచ్చింది సింధు
-
సమయం వచ్చింది సింధు
► కొరియా ఓపెన్ ఫైనల్లో ఒకుహారాతో అమీతుమీ ► సెమీస్‌లో హి బింగ్జియావోపై తెలుగు తేజం గెలుపు ► నేటి ఫైనల్స్ ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం మూడు వారాల క్రితం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో 110 నిమిషాల చిరస్మరణీయ పోరులో నొజోమి ఒకుహారా చేతిలో సింధు ఓడిపోయింది. ఆ ఓటమి తర్వాత ‘నా సమయం కూడా వస్తుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. అయితే ఒకుహారా చేతిలో ఎదురైన ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం 21 రోజుల్లోనే వస్తుందని భారత స్టార్ పీవీ సింధు కూడా ఊహించ లేదేమో! సియోల్‌లో జరుగుతున్న కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సింధు, ఒకుహారా టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. గత ఓటమికి ఈసారి విజయం సాధించి లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఈ తెలుగు తేజం ఉంది. అటు సింధు, ఇటు ఒకుహారా అద్వితీయమైన ఫామ్‌లో ఉండటంతో మరో హోరాహోరీ పోరు జరిగే అవకాశముంది. సియోల్: తన కెరీర్లో మూడో సూపర్ సిరీస్ టైటిల్ సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో విజయం దూరంలో నిలిచింది. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో సింధు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సింధు 21–10, 17–21, 21–16తో గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖి పోరులో 3–5తో వెనుకబడిన సింధు 66 నిమిషాల్లో హి బింగ్ జియావోను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, తొమ్మిదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడుతుంది. ఫైనల్స్ షెడ్యూల్ ప్రకారం సింధు, ఒకుహారా ఫైనల్ నాలుగో మ్యాచ్‌గా జరగనుంది. భారత కాలమానం ప్రకారం వీరిద్దరి మ్యాచ్ ఉదయం 10 గంటల ప్రాంతంలో మొదలయ్యే అవకాశముంది. ఒకుహారాతో ముఖాముఖి రికార్డులో సింధు 3–4తో వెనుకబడి ఉంది. మూడు వారాల క్రితం స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో సింధును ఓడించి జపాన్ తరఫున తొలి విశ్వవిజేతగా ఒకుహారా అవతరించింది. హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్‌లో సింధు ఆరంభం నుంచే దూకుడు కనబరిచింది. తొలి గేమ్ ఆరంభంలోనే 9–1తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె అదే జోరులో గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు ఆధిక్యం ప్రదర్శించినా స్కోరు 16–16 వద్ద బింగ్జియావో వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 20–16తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం సింధు ఒక పాయింట్ నెగ్గిన తర్వాత బింగ్జియావో మరో పాయింట్ సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. అయితే స్కోరు 13–12 వద్ద సింధు వరుసగా మూడు పాయింట్లు గెలిచి 16–12తో ముందంజ వేసింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. -
110 నిమిషాల విషాదం
► చిరస్మరణీయ ఫైనల్లో పోరాడి ఓడిన సింధు ► ఓడినా హృదయాలు గెల్చుకున్న తెలుగు తేజం ► రజత పతకంతో సంతృప్తి ► మహిళల సింగిల్స్ విజేత ఒకుహారా ►ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలి... ప్రత్యర్థులు కసితీరా కొదమ సింహాల్లా తలపడాలి. ఒక్కో పాయింట్ సాధించాలంటే శక్తియుక్తులు మొత్తం పణంగా పెట్టాలి... ప్రాణాలొడ్డినట్లు పోరాడాలి... కోర్టు అంటే కదనరంగంగా మారిపోవాలి... ఒంట్లో సత్తువ మొత్తం క్షీణిస్తున్నా...సమరంలో ఆఖరి క్షణం వరకు పట్టుదల ప్రదర్శించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పీవీ సింధు, నొజోమి ఒకుహరా మధ్య జరిగిన మ్యాచ్‌లా ఉండాలి. గంటా 50 నిమిషాలు... మొత్తం 124 పాయింట్లు... 73 షాట్ల ర్యాలీ... కాళ్లు నొప్పి పెడుతున్నాయి, కండరాలు పట్టేస్తున్నాయి... అలసట ఆటపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది... స్మాష్ కొట్టడంకంటే తాము స్మాష్ కాకుండా ఉండిపోవడమే ముఖ్యంగా మారిపోతోంది. ఎనర్జీ డ్రింక్‌లు పని చేయడం లేదు. మధ్యలో స్కూల్ హెడ్మాస్టర్లా రిఫరీ మందలింపులు... ఇక చాలు నా వల్ల కాదంటూ అనిపిస్తున్న క్షణాన్నే ఎదురుగా ప్రపంచ చాంపియన్ హోదా ఆగిపోవద్దంటూ హెచ్చరిక. ఎప్పటికీ మరచిపోలేని, బ్యాడ్మింటన్ చరిత్రలో అరుదైన మ్యాచ్ చివరకు జపాన్ అమ్మాయి వశమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత బిడ్డ, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధుకు పరాజయం ఎదురైంది. పాయింట్లు చూస్తే పోరు హోరాహోరీగా సాగినట్లు అనిపిస్తున్నా... ఈ మ్యాచ్ గొప్పతనం గురించి స్కోరు బోర్డు చెప్పలేదనేది మాత్రం సత్యం. ఏ మ్యాచ్‌లోనైనా చివరకు విజేత ఒకరే. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం గెలుపు ఇద్దరిదీ. నిజంగా అవకాశం ఉంటే స్వర్ణం, వెండి మిశమ్రమైన ‘పచ్చ బంగారపు’ పతకాన్ని వీరిద్దరికి పంచేయడమే న్యాయంగా ఉండేదేమో! గ్లాస్గో (స్కాట్లాండ్): భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు కల చెదిరింది. ప్రపంచ చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా శ్రమించిన ఆమెను తుది మెట్టుపై దురదృష్టం వెంటాడింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ సింధు 19–21, 22–20, 20–22 తేడాతో జపాన్‌కు చెందిన ఏడో సీడ్ నొజోమి ఒకుహారా చేతిలో పరాజయంపాలైంది. ఫలితంగా ఈ మెగా ఈవెంట్లో ఆమె రజత పతకానికే పరిమితమైంది. ఒకరితో మరొకరు పోటీ పడుతూ అసాధారణంగా సాగిన ఈ పోరులో ఆఖరి క్షణాల్లో జపాన్ అమ్మాయి ఒత్తిడిని అధిగమించడంలో సఫలమైంది. మూడు గేమ్‌లలోనూ అర్ధ భాగం ముగిసే సరికి ఆధిక్యంలో నిలిచిన సింధు... చివరి వరకు దానిని నిలబెట్టుకోలేకపోయింది. తొలి గేమ్‌ను కోల్పోయినా... ఈ మ్యాచ్‌కు ముందు ఇద్దరి మధ్య 3–3తో రికార్డు సమంగా ఉంది. అయితే టాప్ ఫామ్‌లో ఉన్న సింధుకు మెరుగైన అవకాశాలు కనిపించాయి. పైగా ప్రత్యర్థితో పోలిస్తే గత మ్యాచ్‌లు సునాయాసంగా గెలవడం వల్ల పెద్దగా అలసిపోకపోవడం కూడా ఆమెకు అనుకూలాంశంగా కనిపించింది. తొలి గేమ్‌ను తడబడుతూ ప్రారంభించిన సింధు ఆరంభంలో 3–5తో వెనుకబడింది. అయితే కోలుకొని చక్కటి రిటర్న్ షాట్లతో 11–5తో దూసుకుపోయింది. ఈ ఆధిక్యం 13–8కి పెరిగింది. అయితే ఒకుహారా పోరాడి స్కోరును 14–14తో సమం చేసింది. ఆ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన ఆమె 18–14తో ముందంజ వేసింది. అయితే జపాన్ అమ్మాయి తప్పులతో స్కోరు 19–19 వద్ద సమమైంది. ఈ దశలో తడబడి షటిల్‌ను నెట్లోకి కొట్టిన సింధు, తొలి గేమ్‌ను ప్రత్యర్థికి సమర్పించుకుంది. అయితే రెండో గేమ్‌లో మాత్రం సింధు అద్భుతమైన ఆటను ప్రదర్శించింది. ఒక్కసారిగా ఆమె 5–1తో ఆధిక్యంలో నిలిచి, ఆ తర్వాత 9–3కు చేరింది. మరోసారి సింధు 11–8 గేమ్‌లో ముందుకు వెళ్లింది. ఈ సమయంలో వరుస ర్యాలీలతో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. అయితే సింధు నియంత్రణ కోల్పోకుండా ఆడి ఆధిక్యం కోల్పోకుండా జాగ్రత్త పడింది. 18–16తో దానిని ఆమె కొనసాగించింది. స్కోరు 21–20 వద్ద ఉన్నప్పుడు గెలుపు పాయింట్ కోసం సాగిన ర్యాలీ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఏకంగా 73 షాట్ల ర్యాలీ తర్వాత సింధు పైచేయి చూపించి గేమ్‌ను సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక గేమ్‌లో... అయితే అప్పటికే తీవ్రంగా పోరాడిన వీరిద్దరు బాగా అలసిపోయారు. మూడో గేమ్‌లో స్మాష్‌లలో వేగం తగ్గింది. ఇద్దరూ డ్రాప్ షాట్లు, ప్లేసింగ్ ద్వారానే పాయింట్లు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ ఒక్కో పాయింట్ సాధించారు. విరామం సమయంలో 11–9తో సింధు ముందంజ వేయడం మినహా...మిగతా గేమ్ మొత్తం దాదాపు సమంగా సాగింది. 17–17 వద్ద సింధు రెండు పాయింట్లు సాధించి 19–17తో నిలిచింది. అయితే ఒకుహారా వరుసగా మూడు పాయింట్లు రాబట్టి 20–19తో ముందంజ వేసింది. మరో రెండు సార్లు సింధు మ్యాచ్ పాయింట్లు కాపాడుకోవడంలో సఫలమైనా...చివరకు జపాన్ అమ్మాయి స్మాష్‌ను అందుకోలేక భారత క్రీడాకారిణి కూలిపోయింది. 3 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు గెలిచిన పతకాల సంఖ్య. 2013, 2014లలో సింధు సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. భారత్ తరఫున అత్యధికంగా మూడు పతకాలు నెగ్గిన క్రీడాకారిణి కూడా సింధునే కావడం విశేషం. 1 ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఏకకాలంలో భారత్‌కు రజతం, కాంస్యం లభించడం ఇదే తొలిసారి. 7 నాలుగు దశాబ్దాల ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ ఖాతాలో చేరిన పతకాలు. 1983లో ప్రకాశ్ పదుకొనే పురుషుల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గగా... 2011లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప జంట కాంస్యం దక్కించుకుంది. 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా రజతం, ఈ ఏడాది కాంస్యం సాధించింది. ఫలితంతో నేను తీవ్ర నిరాశ చెందాను. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 20–20 వద్ద ఇద్దరికీ విజయావకాశాలు సమానంగా ఉన్నాయి. ఫైనల్ బరిలో ఉన్న వారెవరైనా స్వర్ణం కోసమే పోరాడతారు. నేను విజయానికి చేరువైనట్టే చేరువై దూరమైపోయాను. చివరి క్షణాల్లోనే అంతా తారుమారు అయింది. ఒకుహారా అసాధారణ క్రీడాకారిణి. గతంలో ఆమెతో ఆడినపుడల్లా మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. ఆమెను నేను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేదు. సుదీర్ఘ మ్యాచ్‌కు సిద్ధమయ్యే వచ్చాను. ఈ రోజు నాది కాదంతే. దేశం కోసం రజతం గెలిచినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ పతకం నాలో మరింత విశ్వాసాన్ని పెంచింది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తాను. –పీవీ సింధు