ఆవు ప్రాణం విలువైందా? మొసలి ప్రాణమా?
మనిషి ప్రాణం విలువైనదా? పులి ప్రాణమా? కేసు విచారణ పులుల కోర్టులో జరిగితే తీర్పు మరోలా ఉంటుందికానీ ఇటీవల సుప్రీంకోర్టు ఈ విషయంలో క్రిస్టల్ క్లియర్ స్పష్టతనిచ్చింది. పులి ప్రాణం కన్నా మనిషి ప్రాణమే గొప్పదని, మనిషి ప్రాణం పోయే స్థితిలో పులిలాంటి క్రూర జంతువును చంపటం నేరంకాబోదని తేల్చిచెప్పింది. అలాగని ఈ తీర్పు స్మగ్లర్లను సమర్థించినట్లుకాదని, ఉద్దేశపూర్వకంగా జంతువులన్ని చంపేవారికి కఠినమైన శిక్షలు వేస్తామని పేర్కొంది. మన దగ్గర పులికి ఎదురైన పరిస్థితే అమెరికాలో ఓ భారీ ముసలికి ఎదురైంది.
15 అడుగుల పొడవు, దాదాపు 400 కేజీల బరువున్న భారీ మొసలి ఒకదానిని ఓ మోతుబరి, వేటగాడు కలిసి చంపేశారు. తుపాకి గుండ్లతో మొసలి ప్రాణాలు తీసి, దాని మెడకు చైన్ కట్టి ట్రాక్టర్ కు వేలాడదీశారు. ఫ్లోరిడా రాష్ట్రం, ఒకిచోబీ ప్రాంతంలో వ్యవసాయం చేసే ఓ భూస్వామికి లెక్కకుమిక్కిలి ఆవులు, గేదెలు కూడా ఉన్నాయట. గడిచిన కొద్ది రోజులుగా ఒక్కో ఆవు దారుణ హత్యకు గురవుతోందట. నిఘావేసి తెలుసుకున్నదేమంటే.. ఫొటోలో కినిపిస్తోన్న భారీ మొసలి ఆవుల్ని తినేస్తున్నదట. దాన్ని ఎలాగైనా చంపేయాలనుకున్న భూస్వామి, మొసళ్ల వేటగాణ్ని పిలిపించి దాని పనిపట్టాడు.
మొసలిని వేలాడదీసిన తర్వాత భూస్వామి కొడుకు దాని పక్కన నిల్చొని దర్జాగా పోజులిచ్చాడు. ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టి చివరికి జంతుసంరక్షకుల కంటబడ్డాయి. కేసు దాఖలై, కోర్టుకు వెళితే మొసలి ప్రాణం గొప్పదా, ఆవు ప్రాణం గొప్పదా అనే ఆసక్తికరమైన వాదన మనమూ వినొచ్చు!