breaking news
Oggu Katha Artist
-
ఒగ్గు కథ పితామహుడు కన్నుమూత
సాక్షి, జనగామ: ఒగ్గుకథ పితామహుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత చుక్క సత్తయ్య కన్నుమూశారు. జానపద కళారూపమైన ఒగ్గు కథ చెప్పడంలో చుక్క సత్తయ్య ప్రవీణుడు. జిల్లాలోని లింగాల ఘణపురం మండలం మాణిక్యపురం గ్రామాంలో ఓ సామాన్య కుటుంబానికి చెందిన ఆయన ఒగ్గు కథకు వన్నె తెచ్చారు. దేశవ్యాప్తంగా ఒగ్గు కథకు పేరు తెచ్చిన ఆయన రాష్ట్రపతి అవార్డుతో పాటు ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్తయ్య గురువారం తన ఇంట్లో తుది శ్వాసవిడిచారు. ఒగ్గు కథా గాన శైలిలో అనేక సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపైన కూడా ఆయన పోరాటం చేశారు. ఉన్నత విద్య, ఫ్యామిలీ ప్లానింగ్, కట్న వ్యవస్థ, మూఢనమ్మకాలు, చెడు అలవాట్ల లాంటిపైన కూడా ఆయన ఒగ్గు కథతో ప్రదర్శనలు చేశారు. జనగామ కేంద్రంగా జ్యోతిర్మయి లలిత కళా సమితిని ఏర్పాటు చేశారు. ఒగ్గుకథ, ఒగ్గు డొళ్లు శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. కాగా చుక్కా సత్తయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సత్తయ్య తెలంగాణతో పాటు దేశం గర్వించదగ్గ కళాకారుడని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటు అని పేర్కొన్నారు. సత్తయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ఒగ్గు కళాకారుడు మల్లయ్య కన్నుమూత
హైదరాబాద్: ఒగ్గు కళకు జీవం పోసి, పాటే ప్రాణంగా బతికిన దేవుని మల్లయ్య(62) (అచ్చన మల్లయ్య) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ముకునూర్లో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. చిన్నప్పటి నుంచి ఒగ్గు కళతో అచ్చన మల్లయ్య గుర్తింపు పొందారు. తెలంగాణ ఒగ్గు కళాకారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఒగ్గు కళాకారుడుగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒగ్గు కళాకారుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు చేశారు. ప్రభుత్వంతో పోరాడి దాదాపు 3,000 మందికి పింఛన్ అందేలా కృషి చేశారు. కాగా, మల్లయ్య అంత్యక్రియలు గురువారం సాయంత్రం నిర్వహించారు. మల్లయ్య మరణం తీరని లోటని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, జెడ్పీటీసీ సభ్యుడు పొట్టి అయిలయ్య, కళాకారులు, ప్రజలు నివాళులు అర్పించారు.