‘విశేష’నామ వత్సరం.. 2015
                  
	 ఎల్.ఎన్.పేట:పండుగలు, సెలవులు వస్తున్నాయంటే సంబరపడని వారెవరు?.. అంబరాన్నంటే సంబరాలతో మన ముంగిటికి అరుదెంచిన 2015 సంవత్సరం ప్రతి యేడు కంటే ఎక్కువ సెలవులు, ఎన్నో వింతలు, విశేషాలను తీసుకొచ్చింది. ఈ ఏడాది పండుగల్లో చాలా వాటిని గురువారం ఆక్రమించగా నాలుగు నెలల్లో ఐదు ఆదివారాలు రావడం విశేషం. ఒకే రోజు రెండు పండుగలు వచ్చే సందర్భాలూ ఉన్నాయి. శని, సోమవారాల్లో కొన్ని పండగలు వచ్చి ఆదివారంతో కలిపి జంట సెలవులు ఇప్పిస్తున్నాయి. ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఈ ఏడాదిలో రెండుసార్లు రావడం విస్మయపరుస్తోంది.
	 
	 అక్టోబర్లో 11 సెలవులు
	 2015 అక్టోబర్ నెలలో ఆదివారాలతో కలిపి ఎనిమిది సెలవులు రాగా, ఐచ్ఛిక సెలవులతో కలిపితే 11 సెలవులు రావడం విశేషం. వీటికి తోడు దసరా సెలవులు.. వెరసి ఈ నెలంతా సెలవులే సెలవులు.
	 4 నెలల్లో 5 ఆదివారాలు
	 మార్చి, నవంబర్ నెలలు ఆదివారంతో ప్రారంభం అవుతుండగా మార్చి, మే, ఆగస్టు, నవంబర్ నెలల్లో ఐదేసి ఆదివారాలు వస్తున్నాయి.
	 రంజాన్, మొహర్రం శనివారమే
	 ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం శుక్రవారంతో ప్రారంభమవుతుంది. వీరు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్, మొహ్రం పండగలు మాత్రం శనివారం వచ్చాయి.
	 ఒకేరోజు రెండు పండుగలు
	  ఈ ఏడాది ఒకేరోజు రెండు పండుగలు.. అది కూడా ఐదు సందర్భాల్లో వస్తున్నాయి.
	  జనవరి ఒకటి: నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి
	  జనవరి 26: రథసప్తమి, గణతంత్ర దినోత్సవం
	  మే2: అన్నమయ్య జయంతి, బుద్ధ జయంతి
	  సెప్టెంబర్24: బక్రీద్, ఓనమ్
	  నవంబరు 25: కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి
	 ఎనిమిది జంట సెలవులు
	  జనవరి 25 ఆదివారం, 26 సోమవారం గణతంత్ర దినోత్సవం
	  మార్చి 28 శనివారం, 29 ఆదివారం శ్రీరామ నవమి
	  జూలై 18 శనివారం రంజాన్, 19 ఆదివారం
	  ఆగస్టు 15 శనివారం స్వాతంత్య్ర దినోత్సవం, 16 ఆదివారం
	  సెప్టెంబర్ 5 శనివారం కృష్ణాష్టమి, 6 ఆదివారం
	  అక్టోబర్ 24 శనివారం మొహర్రం, 25 ఆదివారం
	  డిసెంబర్ 24 మిలాద్ ఉన్ నబీ, 25 క్రిస్మస్, 26 బాక్సింగ్ డే (ఐచ్ఛిక సెలవు), 27 ఆదివారం
	 గురువారానిదే ఆధిపత్యం
	 నూతన సంవత్సరం గురువారంతో ప్రారంభమై, గురువారంతోనే(డిసెంబర్ 31) ముగుస్తుంది. అందుకేనేమో ఈ ఏడాది గురువారం ఆధిపత్యం కొనసాగనుంది. రెండు సంప్రదాయ పండుగలతో పాటు చిన్నాపెద్దా కలిపి మొత్తం 14 పండుగలు గురువారంనాడే వస్తున్నాయి. సంక్రాంతి, దసరా గురువారమే వచ్చాయి. 10 పండుగలతో శుక్రవారం రెండో స్థానంలో ఉంది. శనివారం 9 పండుగలు, బుధవారం 7, ఆది, సోమవారాల్లో 5, మంగళవారం 4 పండుగలు రానున్నాయి.
	 
	 ఒకే పండుగ రెండుసార్లు
	 సాధారణంగా ఏ పండుగైనా ఏడాదిలో ఒకసారే వస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం రెండు పండుగలు రెండేసిసార్లు రావడం అరుదైన విశేషం.
	  వైకుంఠ ఏకాదశి: జనవరి 1, డిసెంబర్ 21
	  మిలాద్ ఉన్ నబీ: జనవరి 4, డిసెంబర్ 24