breaking news
oc welfare society
-
ఓసీల సమస్యలను పార్లమెంటులో చర్చించాలి
సాక్షి, హైదరాబాద్: నిరుపేద ఓసీల సమస్యలను ప్రస్తుత పార్ల మెంటు సమావేశాల్లో చర్చించి పరిష్కరించాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుపేద ఓసీల సమస్యలను పార్లమెంటులో చర్చించాలని కోరుతూ వచ్చే వారం ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులను కలసి వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు. దేశంలో ఉన్న నిరుపేద ఓసీల అభివృద్ధికి రూ.50 వేల కోట్లతో జాతీయ ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మందికి పైగా ఉన్న నిరుపేద ఓసీలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న మేజర్ జనరల్ సిన్హా నివేదికను తక్షణమే పార్లమెంటులో చర్చించి ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించి ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన అగ్రవర్ణపేదలకు విద్య, ఉద్యోగ, రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఆర్థిక ప్యాకేజీ అంశాన్ని దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రధాన ఎజెండాగా పరిగణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
రిజర్వేషన్లు ఏ ఒక్కరి సొత్తూ కాదు
తూర్పుగోదావరి(రాజమండ్రి సిటీ) : రిజర్వేషన్లు ఏ ఒక్క వర్గం సొత్తూ కాదని, అందరికీ సమన్యాయం జరగాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రవర్ణాలుగా పిలుస్తున్న ఓసీలను అన్ని రంగాల్లో అణచివేతకు గురిచేస్తున్నాయని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకరరెడ్డి విమర్శించారు. తక్షణమే రాజ్యాంగసవరణ ద్వారా ఓసీలకు అవకాశాలు కల్పించాలని, ఓసీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకపోతే గుజ్జర్లు, పటేళ్ల తరహాలో పోరాటానికి సిద్ధమౌతామని హెచ్చరించారు. పదేళ్లుగా అగ్రవర్ణ పేదలకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది అగ్రవర్ణపేదలను ఓబీసీ జాబితాలో చేర్చాలని అనేక కమిటీలు చెప్పినా ప్రభుత్వాలు ఆమోదించడం లేదన్నారు. తక్షణమే దాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. సామాజిక వివక్ష అంతరించిందని, అదే సమయంలో ఆర్థిక వివక్ష పెరిగి అగ్రవర్ణాల వారనే నెపంతో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్లు కొనసాగించేందుకు రాజకీయనాయకులు అగ్రవర్ణాల వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా గుర్తించడం బాధాకరమన్నారు. ఓసీల సంక్షేమం కోసం జాతీయస్థాయిలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తే ఆర్థిక అసమానతలు తొలగి రిజర్వేషన్లపై ఉద్యమాలు తగ్గుతాయన్నారు.