breaking news
Nutritional experts
-
దేహానికి సమ్మర్ గార్డ్స్
మండే ఎండల్ని ఇచ్చే ప్రకృతే వాటి నుంచి కాపు ‘కాచే’ కాయల్నీ మనకు ఇచ్చింది. అందుకేనేమో... వాటికి తమ పేరుకు (ఆంగ్లంలో) ‘గార్డ్స్’ను జత చేసుకున్నాయి. నగరంలో మండుతున్న వేసవి నుంచి సిటీజనుల్ని రక్షించేందుకు అందుబాటులోనే ఉన్న కొన్ని కూరగాయలు తీసుకుంటే చాలంటున్నారు వైద్యులు. కూల్ డ్రింక్స్నో, మరో కృత్రిమ పానియాలనో ఆశ్రయిస్తూ ఎండ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం. వాటికి బదులు కొన్ని రకాల కూరగాయల్ని ఆహారంలో భాగం చేయడం ద్వారా మండే ఎండల్నీ చల్లగా సాగనంపవచ్చని నగరానికి చెందిన పలువురు పోషకాహార నిపుణులు చెబుతున్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి బిట్టర్ గార్డ్ ఇది సమ్మర్ నుంచి రక్షించే ‘బెటర్ గార్డ్’. కాకర కాయగా మనకు అత్యంత చిరపరిచితమైన ఈ కూరగాయ వేసవికి తోడు పని ఒత్తిడి కారణంగా తలెత్తే హైపర్ టెన్షన్‌ను నివారిస్తుంది. సీజనల్‌గా ఏర్పడే పుండ్లు, దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్, రింగ్ వార్మ్ వంటి వాటిని అదుపు చేయడంలో సహకరిస్తుంది. డయాబెటిస్ నియంత్రణకు ఇది చక్కని ఆహారం. స్నేక్ గార్డ్ పేరులో పామున్నా.. స్నేక్ గార్డ్.. తెలుగులో పొట్లకాయగా మనకు చిరపరిచితమే. ఇది దేహానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. వేడిమి కారణంగా పేరుకుంటున్న పొడి తత్వాన్ని దూరం చేసి శరీరంలో ఫ్లూయిడ్స్ ఉత్పత్తిని పెంచుతుంది. శరీర విధి నిర్వహణ సాధారణంగా జరిగేలా దోహదపడుతుంది. యాష్ గార్డ్ పేరులో బూడిద ఉన్నా తీరులో బంగారం అనిపిస్తుంది యాష్గార్డ్.. అదే బూడిద గుమ్మడికాయ. దేహాన్ని చల్లగా ఉంచి వడదెబ్బ నుంచి కాపాడుతుంది. ఇది దాదాపు 96 శాతం నీటిని కలిగి ఉంటుంది. విటమిన్- బి,ఎ (థయామిన్), బి3 (నియాసిన్)ను పుష్కలంగా అందిస్తుంది. దీనిలోని హై పొటాషియం రక్తపోటు సరైన క్రమంలో ఉండేలా చూస్తుంది. కిడ్నీలో రాళ్లు వంటి సమస్యల నివారణకు మంచి మందు. రిడ్జెడ్ గార్డ్ బీరకాయనే ఆంగ్లంలో రిడ్జెడ్ గార్డ్ అంటారు. ఇది రక్తాన్ని శుద్ధి చేసి రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. వేసవి కారణంగా తలెత్తే జీర్ణకోశ వ్యాధులకు చక్కని పరిష్కారం చూపుతుంది. బాటిల్ గార్డ్ అత్యధికంగా నీటి శాతాన్ని కలిగి ఉన్న బాటిల్ గార్డ్.. సొరకాయగా తెలుసు. ఇది మినరల్ వాటర్ బాటిల్స్‌ను మించిన పోషకాలను అందిస్తూ దేహానికి రక్షణగా నిలుస్తుంది. ఎండ కారణంగా కడుపులో తలెత్తే ఎసిడిటీ సమస్యకు సొరకాయ మేలైన పరిష్కారం చూపుతుంది. విపరీతమైన చెమట కారణంగా కోల్పోయే సోడియంను శరవేగంగా భర్తీ చేస్తుంది. అతి దాహాన్ని, అలసటను దూరం చేస్తుంది. -
పరీక్షల ఫలహారం
పిల్లల పరీక్షలొస్తుంటే చదువుల మాట ఏమో కాని, వారి ఆహారం పూర్తిగా నిర్లక్ష్యమవుతుంది. జంక్ ఫుడ్, కప్పుల కొద్దీ కాఫీ, టీ వంటివి నిరంతరం తీసుకునేవారు సైతం పరీక్షల సమయంలో ఆహారాన్ని దూరం పెట్టేస్తారు. అందుకే పిల్లల పరీక్షలు వస్తున్నాయంటే ముందు నుంచే వారి ఆహారం గురించి ఒక ప్రణాళిక వేసుకోవాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.ముందుగానే పిల్లలతో చర్చించి, వారు ఏ ఆహారానికి ఎక్కువ... ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకుని వాటితోనే వారికి కావలసిన పోషకాలను అందిస్తే మంచిదని కూడా సూచిస్తున్నారు. ఇడ్లీ, ఉప్మా ఓట్స్, ముసిలి, ఉప్మా, ఖిచిడీ, ఇడ్లీ... వంటివాటిని బ్రేక్‌ఫాస్ట్‌గా ఎంచుకోవడం మంచిది. ఈ పదార్థాలన్నీ శరీరానికి కావలసిన గ్లూకోజ్‌ను సక్రమంగా అందిస్తాయి. స్మూతీస్, డ్రై ఫ్రూట్స్ రోజులో నాలుగుసార్లు పెద్ద మొత్తంలో ఆహారం అందించడం వల్ల పిల్లలు వెంటనే నిద్రపోయే అవకాశం ఉంటుంది. రక్తప్రసరణ మెదడు కంటే ఎక్కువగా ఉదరానికి చేరడం వల్ల వారు త్వరగా నిద్రపోతారు. అందువల్ల తరచుగా కొద్దికొద్దిగా పోషకాహారం అందేలా ప్రణాళిక వేసుకోవాలి. ఫలితంగా వారు నిద్రపోకుండా మెలకువగా ఉండగలుగుతారు. తాజా పళ్లు, స్మూతీలు, తేనె కలిపిన డ్రై ఫ్రూట్స్, పిల్లలు ఇష్టపడే సలాడ్లు... ఇవి మంచిది. మజ్జిగ, గ్రీన్ టీ పిల్లలు వారికి సౌకర్యంగా ఉండే చోట కూర్చుని, మరీ ముఖ్యంగా ఏసీల ముందు కూర్చుని, దాహం వేయకపోవడంతో, మంచినీళ్లు తాగడం మర్చిపోతారు. దాంతో వారిలో నీటి శాతం తగ్గిపోతుంది. శరీరం, మెదడు సక్రమంగా పనిచేయడం మానేస్తాయి. కళ్లు తిరిగినట్లవుతుంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టలేక పోతారు. పిల్లలు ఎక్కువ నీళ్లు తాగేలా జాగ్రత్తపడాలి. ఒకవేళ వాళ్లు ఎక్కువ నీళ్లు తాగడానికి సుముఖత చూపకపోతే, తాజా పండ్ల రసాలు, పల్చటి మజ్జిగ, గ్రీన్ టీ వంటివి తరచుగా అందిస్తూండాలి. అల్లం, చెక్క ఎక్కువ మోతాదులో కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, టీ, కోలాల... వంటివి పరీక్షల సమయంలో తాగడం మంచిది కాదు. వాటిని తీసుకోవడం వల్ల పిల్లలు సక్రమంగా నిద్రపోలేకపోతారు. అందువల్ల పిల్లలను అలాంటి వాటి నుంచి దూరంగా ఉంచాలి. వాటి స్థానంలో పల్చటి మజ్జిగలో అల్లం, దాల్చినచెక్క పొడి వంటివి జత చేసి ఆరోగ్యకరంగా, రుచికరంగా తయారుచేసి పిల్లలకు తరచు అందచేయాలి. గుడ్లు, పండ్లు ఒత్తిడి తీవ్రంగా ఎదుర్కొనే పరీక్షల సమయంలో, శరీరానికి నీటిలో బాగా కలిసిపోయే విటమిన్ బి కాంప్లెక్స్, సి, మినరల్స్, జింక్... వీటి మోతాదు పెరిగిపోతుంది. దాంతో అడ్రెనల్ హార్మోన్ల పని తీరు తగ్గిపోతుంది. ఇవి ఉంటేనే మనిషిలో ఒత్తిడి ఏర్పడినప్పుడు వాటితో తీవ్రంగా పోరాడి, ఒత్తిడి పోగొడతాయి. దంపుడు బియ్యం, నట్స్, కోడిగుడ్లు, తాజా కూరలు, పండ్లు వంటివి ఒత్తిడిని నిరోధిస్తాయి. చేపలు, ఆకుకూరలు విటమిన్ ఎ, సి, ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు ఒత్తిడికి గురవకుండా కాపాడతాయి. కోడిగుడ్లు, చేప, క్యారట్లు, గుమ్మడికాయ, తాజా ఆకు కూరలు, తాజా పండ్లు... వంటివి వాడటం వల్ల మెదడు చురుకుగా పనిచేయడం మొదలుపెడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అందువల్ల పిల్లలు పరీక్షల సమయంలో అనారోగ్యం పాలు కాకుండా ఉండగలుగుతారు. ఇన్పుట్స్: డా. వైజయంతి