breaking news
not democratize
-
ప్రమాదం వారసత్వ రాజకీయాలకే.. ప్రజాస్వామ్యానికి కాదు!: అమిత్ షా
కౌశాంబి: వారసత్వ రాజకీయాలు, కులవాదానికే ప్రమాదం తప్ప దేశ ప్రజాస్వామ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కులతత్వం, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు అనే మూడు అల్సర్లతో కాంగ్రెస్ పార్టీ భారత ప్రజాస్వామ్యాన్ని చుట్టుముట్టిందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ ఈ మూడింటినీ తొలగించి వేసినందుకే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భయపడుతోందని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ యూకేలో ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు బదులిచ్చారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ‘కౌశాంబి మహోత్సవ్’ను ప్రారంభించి, అనంతరం జరిగిన సభలో అమిత్ షా ప్రసంగించారు. తమ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుపడిందనే ఒకే ఒక్క కారణంతో పార్లమెంట్ సమావేశాలను సవ్యంగా సాగనీయని కాంగ్రెస్‌ను దేశం క్షమించదని అమిత్ షా ఆరోపించారు. ఎటువంటి కార్యకలాపాలు, చర్చ లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగియడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. గతంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంలోని నిబంధనల ప్రకారమే రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయిందని ఆయన చెప్పారు. ఒక్క రాహుల్ గాంధీయే కాదు, ఈ చట్టం కింద ఇప్పటి వరకు 17 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యత్వాలు రద్దయ్యాయన్నారు. చట్టానికి లోబడి నడుచుకుని, హైకోర్టులో అనర్హత వేటు నుంచి బయటపడాలని రాహుల్‌కు సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రధాని మోదీని 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. -
ఎమ్మెల్యేల అరెస్టు అప్రజాస్వామికం
చిలకలూరిపేట, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న లక్ష్యంతో సమైక్య తీర్మానం చేయాలని కోరుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఖండించారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా గురువారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అసెంబ్లీలో చర్చకు ముందే సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని, ఆ తర్వాతే చర్చ జరగాలని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా, సభ నుంచి సస్పెండ్ చేయడమే కాక అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. చర్చ జరిగితే రాష్ట్ర విభజన అనివార్యమవుతుందని, ఓటింగ్ కూడా జరుగకుండానే పార్లమెంట్‌కు వెళుతుందని తెలిసి కూడా టీడీపీ, కాంగ్రెస్ కొత్త రాజకీయం మొదలుపెట్టాయని విమర్శించారు. రెండు పార్టీలు అసెంబ్లీలో చర్చలో పాల్గొని రెండు విభాగాలుగా విడిపోయి విభజనకు మద్దతు పలుకుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వల్లే విభజన సాధ్యమైందని హర్షం వ్యక్తం చేస్తే, సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజన తదుపరి సవరణలను ప్రతిపాదించడం, కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఇదే ధోరణి ప్రదర్శించడం విభజనకు జరుగుతున్న తంతు అని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలని, నేరుగా ఓటింగ్‌కు నిర్వహించాలని వైఎస్సార్సీపీ కోరుతున్నా పట్టించుకోకుండా వారిని మార్షల్చే బయటకు పంపడం అమానుషమన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ కన్వీనర్ ఏవీఎం సుభానీ, మున్సిపల్ వైస్‌చైర్మన్ అబ్దుల్లా, జిల్లా ఎస్సీ సెల్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు కొమ్ము రాజేష్, మైనార్టీ నాయకులు మటన్‌బాషు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అల్లడి భాస్కరసురేష్, మండల మైనార్టీ విభాగ కన్వీనర్ మస్తాన్‌వలి, మాజీ కౌన్సిలర్లు, యార్డు డెరైక్టర్లు పాల్గొన్నారు.