breaking news
North Brook jute mill
-
'సీఈవో హత్యపై ఉన్నతస్థాయి విచారణ'
కోల్కతా: నార్త్బ్రూక్ జూట్ మిల్లు సీఈవో హత్య కేసుపై ఉన్నతస్థాయిలో నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ కేసులో నిజానిజాలు వెల్లడికావాలంటే ఉన్నతస్థాయిలో నిష్పక్షపాత విచారణ జరపాలని పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే మనాస్ భునియా డిమాండ్ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆయన సూచించారు. ఇటువంటి ఘటనలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. హుగ్లీ జిల్లాలో భద్రేశ్వర్ వద్దనున్న నార్త్బ్రూక్ జూట్ మిల్లు సీఈవో హెచ్ కే మహేశ్వరిని కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా కొట్టడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
హింసకు పాల్పడితే సహించం: మమత
కోల్కతా: కార్మిక సంఘాల పేరుతో హింసకు పాల్పడితే సహించబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. హుగ్లీ జిల్లాలో నార్త్బ్రూక్ జూట్ మిల్లు సీఈవో హతమార్చిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని శాసనసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కేసులో న్యాయం జరిగేలా చూస్తామని హామీయిచ్చారు. హత్య వెనుక ఎంతటి పెద్దవారున్నా వెనుకాడబోమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. సీఐటీయు, బీఎంఎస్ కార్మిక సంఘాల్లోని కొన్ని శక్తులు ఈ దురదృష్టకర సంఘటనకు కారణమని మమత బెనర్జీ ఆరోపించారు. ఈ రెండు కార్మిక సంఘాల్లో ఒకటి సీపీఎం, మరోటి బీజేపీకి చెందనవి కావడం గమనార్హం. భద్రేశ్వర్ వద్దనున్న నార్త్బ్రూక్ జూట్ మిల్లు సీఈవో హెచ్ కే మహేశ్వరిని కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా కొట్టడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ చక్రవర్తి డిమాండ్ ను మమతా బెనర్జీ తిరస్కరించారు.