అన్నలొచ్చారా?
                  
	 కామారెడ్డి: నిజామాబాద్-కరీంనగర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో నక్సల్స్ కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మాచారెడ్డి మండ లం సోమారంపేట, బంజెపల్లి, సిరికొండ మండలం కొండాపూర్, పందిమడుగు, పాకాల ప్రాంతంలో ఇటీవల ఏడుగురు సభ్యులు గల నక్సల్స్ సంచరిస్తున్నారన్న ప్రచారం జరిగింది.
	
	 ఈ విషయం పోలీసులకు చేరింది. దీంతో ప్రత్యేక పార్టీ పోలీసులు 60 మంది వరకు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. నాలుగు రోజులుగా అక్కడే మకాం వేసి గతంలో నక్సల్స్ షెల్టర్‌గా ఉపయోగించుకు న్న ప్రాంతాలలో గాలిస్తున్నారు.
	
	 మావోయిస్టులేనా!
	 ఇటీవలి కాలంలో మావోయిస్టు పార్టీకి చెందిన పలువురు జిల్లాలో ప్రవేశించారని ప్రచారం జరిగింది. వారి కదలికల కు సంబంధించి అటవీ ప్రాంత గ్రామాల ప్రజలనడిగితే అలాంటిదేమి లేదని చెబుతున్నారు. ఏడుగురు సభ్యులు గల సాయుధ నక్సల్స్ మాత్రం సరిహద్దు ప్రాంతంలో సంచరించి వెళ్లారనే సమాచారం బయటకు పొ క్కింది. జిల్లాకు చెందిన వారు అందులో లేరని అంటున్నారు.
	
	ఇతర ప్రాంతాలకు చెందిన కొత్త వ్యక్తులే ఉన్నారని తెలుస్తోంది. వారు ఆహారం కోసం ఎవరిపై ఆధారప డకుండా స్వయంగా తయారు చేసుకుంటున్నట్టు సమాచారం. అప్పుడే గ్రామాలకు వెళ్లి ఆహారం సమకూర్చుకుంటే పెరిగిన సెల్‌ఫోన్ నెట్వర్క్ ద్వారా పోలీసులకు వెం టనే లీకవుతుందని గ్రహించి ఎవరిపై ఆధారపడడం లేదని తెలుస్తోంది. వచ్చినవారిలో ఎవరున్నారు, వారి స్థాయి ఏమిటి, ఏ పార్టీకి చెందినవారన్న విషయాలు మాత్రం వెల్లడి కావడం లేదు. పోలీ    సులు మాత్రం పక్కా సమాచారంతోనే గాలింపులు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇందులో పాల్గొంటున్న పో లీసులు నిజామాబాద్ జిల్లాకు చెందినవారా, కరీంనగర్ జిల్లాకు చెందినవారా అన్నది కూడా తెలియడం లేదు.
	
	 గిరిజనులలో ఆందోళన
	 మొత్తం మీద నక్సల్స్ కదలికలు మాత్రం పెరిగాయనేది స్పష్టంగా తెలుస్తోంది. మాచారెడ్డి పోలీసులు ఘన్పూర్(ఎం) గ్రామం వద్ద రాత్రింబవళ్లు రోడ్డుపై వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నాలుగు రో జులుగా పోలీసులు గాలింపులు జరుపుతుండడంతో అటవీ ప్రాంతానికి వెళ్లే గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు. అన్నల అలికిడి తమకు కనిపించలేదని చెబుతున్నారు. చాలా రోజుల తరువాత నక్సల్స్ కదలికలు బయటపడుతుండడంతో పల్లెలు ఉలిక్కిపడుతున్నాయి.
	
	 నిజంగా నక్సల్స్ సంచారం పెరిగితే పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని సరిహద్దు గ్రామాల ప్రజలు కంగారు పడుతున్నారు. సానుభూతిపరులు, మాజీల ప్రవర్తనపై నక్సల్స్ ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామాలలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పనితీరు, పెచ్చరిల్లుతున్న గ్రూపు తగాదాల గురించి కూడా నక్సల్స్ సమాచారం సేకరిస్తున్నారని తెలిసింది.