breaking news
Nituprasad
-
20 మందిపై కేసులు
బడగువానిలంక (ఆలమూరు), న్యూస్‌లైన్ : బడుగువానిలంక సంఘటన నేపథ్యంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కొట్లాట ఘటనలో ఇద్దరు మృతిచెందగా, కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. రామచంద్రపురం డీఎస్పీ బి.రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, 150 మంది పోలీసు సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి.. కలెక్టర్ నీతూ ప్రసాద్‌ను కలిసి బడుగువానిలంక సంఘటనను వివరించారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసు అధికారులు ఆరాతీస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. మరియమ్మ మృతదేహాన్ని పోలీసులు నేరుగా బడుగువానిలంకకు తీసుకువచ్చి ఆమె బంధువులకు అప్పగించారు. చెముడులంకలో నివసిస్తున్న నర్శిపూడికి చెందిన వ్యక్తి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చెముడులంకలో అరటి తోటలో దాడికి ఉపయోగించినట్టుగా అనుమానిస్తున్న సుమారు 60 కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బడుగువానిలంకలో ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లడిల్లుతున్న గ్రామస్తులు బడగువానిలంకలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఏటిగట్టుపై మాటు వేసి గుంపులుగా కాకుండా ఇద్దరు లేదా ముగ్గురిని మాత్రమే గ్రామంలోకి అనుమతిస్తున్నారు. రైతులు వినియోగించే పనిముట్లను కూడా అనుమతించడం లేదు. ఏ సమయంలో ఏ కబురు వినాల్సి వస్తుందోనని క్షతగాత్రుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. అనుమానితులపై కేసులు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు బడగువానిలంక దాడి ఘటనకు కారణమైనట్టుగా అనుమానిస్తున్న 20 మందిని గుర్తించి హత్య, హత్యాయత్నం, దాడి తదితర సెక్షన్ల కింద ఆలమూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో నర్శిపూడికి చెందిన దుళ్ల చిన్న, ఎన్.ప్రకాశరావు, కె.పెదసత్యం, కె.భాస్కరరావు, పందిరి పట్టాభి, డెకపాటి రవి, డెకపాటి నాని, కసే చంద్రరావు, బి.బీముడు, కావూరి సత్యనారాయణ, పి.భాస్కరరావు, కొండేటి వెంకన్న, పందిరి వెంకటరత్నం, కసే సుందరరావు, కె.ఏసు, వేళంగి ఆనందరావు, వేళంగి శ్రీను, వేళంగి వెంకన్న, కసే చిన్న, వేళంగి ఏసు తదితరులపై కేసు నమోదైంది. భూ వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించాలి బడుగువానిలంకలో సుదీర్ఘ కాలంగా సాగుతున్న భూ వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోరారు. కాకినాడలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నీతూ ప్రసాద్‌ను కలుసుకుని సంఘటనపై మాట్లాడారు. సంఘటనలో మృతి చెందిన దాసం విజయ్, టి.మరియమ్మ కుటుంబాలకు ఆర్థికసాయం అందించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించాలన్నారు. బాధితులకు పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. -
జిల్లాకు త్వరలో అదనపు బలగాలు
సాక్షి, కాకినాడ: ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు ఇరవై నాలుగు కంపెనీల పారా మిలటరీ దళాలు వస్తాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్లోని కోర్టుహాల్లో పోలీసు సూపరింటెండెంట్లు, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారు (ఆర్వో)లతోను, రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ వేర్వేరుగా సమావేశమయ్యారు. కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి నిర్వహించిన అధికారులసమావేశంలో భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం అందించిన హ్యాండ్ బుక్‌ను అధికారులు అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. వ్యయ పరిశీలన తదితర మార్గదర్శకాలతో కూడిన హ్యాండు బుక్‌లను కూడా త్వరలో పంపుతామన్నారు. జిల్లాలో 37 లక్షల మంది ఓటర్లుండగా ఇంకా 30 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయన్నారు.ఓటరు జాబితాలో పేరు లేకపోతే 92462 80027 సెల్ నంబర్‌కు ఓట్ అని టైపు చేసి ఐడీ కార్డునెంబర్ టైపు చేసి ఎస్ఎంఎస్ పంపితే ఓటరుగా ఎక్కడ నమోదయిందీ సమాధానం లభిస్తుందన్నారు. లేకుంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.