breaking news
nilakanta reddy
-
మీ పని తీరులో ‘మార్పు’ రావాలి
అనంతపురం మెడికల్: ‘ఒక మంచి ప్రయోజనాన్ని ఆశించి చేపట్టే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి సత్ఫలితాన్ని సాధించాలంటే అందుకు తగ్గట్టుగా మన పనితీరు ఉండాలి. మాతా శిశు మరణాల శాతం తగ్గించేందుకు చేపట్టిన ‘మార్పు’ కార్యక్రమం విషయంలో ఇది కనిపిం చడం లేదు. ముందుగా మన పనితీరు మారితేనే ‘మార్పు’ ఉద్దేశం ఫలిస్తుంది.’ అని అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ ఉద్బోధ చేశారు. ‘మార్పు’ కార్యక్రమంపై రెవెన్యూ భవన్లో ఆదివారం ఐకేపీ పీడీ నీలకంఠారెడ్డి, అదనపు జిల్లా ఆరోగ్య వైద్యాధికారి వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి, డీసీహెచ్ఎస్ రామకృష్ణారావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మాతా శిశు మరణాల వివరాల సేకరణలో విఫలం చెందారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాతాశిశు మరణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నది ‘మార్పు’ ప్రధాన ఉద్దేశమన్నారు. దీనిని ప్రజల్లో తీసుకెళ్లడంలో విఫలమయ్యారన్నారు. గత ఏడాది జిల్లా వ్యా ప్తంగా 72 వేల జననాలు జరిగితే.. తల్లులు 117 మంది, శిశువులు 552 మంది చనిపోయినట్లు ఇచ్చిన సంఖ్య వాస్తవం కాదనేది స్పష్టమవుతోందన్నారు. ఏదో ఒక సంఖ్య ఇస్తే సరిపోతుందనే విధంగా మీ నివేదిక కనిపిస్తోందన్నారు. ఎంత మంది చనిపోయారనే వివరాలు మీ వద్ద ఉన్నాయా..? మీరిచ్చిన గణాంకాలు కరెక్టేనని ఎవరైనా చెప్పగలరా? అని కలెక్టర్ అడిగిన ప్రశ్నకు ఎవ్వరి నుంచి సమాధానం రాలేదు. ఇకపై అలా జరగకూడదని చెప్పారు. అంకిత భావంతో పనిచే సి మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించాలని, నిర్దేశించుకున్న లక్ష్యం సాధించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జననాలు సంఖ్య తక్కువగా ఉంది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు 30 శాతం మించి లేదనేది స్పష్టమవుతోందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ కాన్పునకు కూడా సిజేరియన్ చేసి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఫీజు వసూలు చేసే పరిస్థితి ఉందన్నారు. దీనివల్ల పేదవారు ఆర్థిక ఇబ్బందులకు గురవుతారన్నారు. ఇకపై అందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా కృషి చేయాలన్నారు. ప్రతి కేంద్రంలో ప్రతి నెలా 20 కాన్పులు తప్పకుండా జరిగేలా చూడాలన్నారు. నెలలో 3వ శుక్రవారం సమావేశం నిర్వహించుకోండి మార్పు కార్యక్రమంపై ప్రతి నెలా 3వ శనివారం ‘మార్పు’ కార్యక్రమంపై సమావేశం నిర్వహించుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. మీ సమావేశం తరువాత ఒకటి రెండు రోజుల్లో జిల్లా స్థాయిలో తాను సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఈ దఫా సమావేశానికి వచ్చేప్పుడు కచ్చితమైన వివరాలతో రావాలన్నారు. ఒక తల్లి లేదా బిడ్డ చనిపోతే అందుకుగల కారణాలు తప్పక నమోదు చేయాలన్నారు. ‘మార్పు’ కింద సేకరించాల్సిన సమాచారానికి సంబంధించి ఒక ఫార్మెట్‌ను డీఆర్డీఏ అధికారులు ఇస్తారని, ఆ ప్రకారం పూర్తి సమాచారం సేకరించాలని చెప్పారు. నివేదికలు తప్పుగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ప్రభుత్వ వైద్యులు, డీఆర్డీఏ, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
తడబడుతున్న బంగారు తల్లి
సాక్షి, అనంతపురం : జిల్లాలోని పురపాలికలు, నగర పంచాయతీల్లో బంగారుతల్లి పథకం కింద ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. లబ్ధిదారులు నిత్యం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ‘బంగారుతల్లి’ పథకం ప్రారంభంలోనే తడబడుతోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మానస పుత్రికగా ప్రచారం పొందిన ఈ పథకం ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వచ్చినా, ఇప్పటి వరకు జిల్లాలోని 11 మునిసిపాలిటీలు, ఒక కార్పొరేషన్ పరిధిలో ఒక్క తల్లికి కూడా పారితోషికం అందించలేకపోయారు. ఈ ఏడాది మే ఒకటి తరువాత పుట్టిన ప్రతి ఆడపిల్లను ఈ పథకంలో చేర్చుతామని అధికారులు చెబుతున్నా.. లబ్ధి మాత్రం చేకూర్చడంలేదు. అర్భాటపు ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం.. అమలులో మాత్రం చతికిలపడుతోంది. జిల్లాలోని అనంతపురం కార్పొరేషన్, ధర్మవరం, రాయదుర్గం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, హిందూపురం మునిసిపాలిటీలతో పాటు పుట్టపర్తి, మడకశిర, పామిడి నగర పంచాయతీలలో ఇప్పటి వరకు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి 647 మంది దరఖాస్తు చేశారు. వారిలో 482 మంది అర్హులని అధికారులు తేల్చారు. మిగతా వారి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. అర్హమైన వాటిలో బ్యాంకు ఖాతా నెంబర్ సరిగా ఉందా? లేదా? అన్ని పత్రాలు సరిగా ఉన్నాయా లేదా అని చూసి 191 తేల్చగా తొలివిడత ప్రోత్సాహకం రూ.2,500 వంతున ఈ పాటికే జమ చేయాలి. అయితే ఈ ప్రక్రియ నేటీకి జరగకపోవడంతో ప్రభుత్వ తీరుపై నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఏం.. జరుగుతోందంటే.. 2012 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి 100 మంది బాలురకు 74 మంది బాలికలు ఉన్నట్లు సర్వేలు తేల్చాయి. దీంతో ఆడపిల్లల సంఖ్య పడిపోకూడదని, వీరి శాతం పెరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బాలికాభ్యుదయ సాధికారిక చట్టాన్ని 2013 జులై 2వ తేదీ నుంచి అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే బంగారు తల్లి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఐకే పీ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా పర్యవేక్షిస్తున్నాయి. 2013 మే ఒకటో తేదీ తర్వాత పుట్టిన ఆడపిల్లకు దీనిని వర్తింపజేస్తారు. ఇద్దరు ఆడపిల్లల వరకే ఇది వర్తిస్తుంది. రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా అర్హులే. ఈ పథకం కింద శిశువు పుట్టిన నాటి నుంచి డిగ్రీ పూర్తి చేసే వరకు రూ.2 లక్షలు పైచిలుకు డబ్బు అందుతుంది. నిర్ధేశిత లక్ష్యం పూర్తి చేస్తూ పోతేనే లబ్ధి పొందుతారని నిబంధన విధించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగు.. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి కాస్త బాగానే కనిపిస్తోంది. 63 మండలాల్లో మొత్తం 6,826 మంది దరఖాస్తు చేసుకోగా 4,831 మంది అర్హులని తేల్చారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. వీటిలో అన్ని పత్రాలు సరిగా ఉన్నాయా లేదా? బ్యాంకు ఖాతా నెంబర్ సరిగా ఉందా లేదా అని చూసి 3,178 మంది తల్లుల ఖాతాలకు తొలివిడత ప్రోత్సాహకం రూ.2,500 జమ చేశారు. మంజూరు పత్రాలు అందజేశాం జిల్లాలోని మునిసిపాలిటీలలోని ‘బంగారుతల్లి’ పథకం కింద అర్హులైన 191 మంది రచ్చబండలో మంజూరు పత్రాలు అందజేశాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కాలేదు. హైదరాబాద్ స్థాయిలో ప్రాసెసింగ్‌లో ఉంది. వారం పది రోజుల్లో వారి ఖాతాల్లో ప్రోత్సాహకం జమ అవుతుంది. -నీలకంఠారెడ్డి, మెప్మా ఇన్చార్జ్ పీడీ, అనంతపురం