breaking news
Nick clegg
-
అంబానీపై ఫేస్బుక్ ఫైర్
న్యూఢిల్లీ: డేటా విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటనకు కౌంటర్‌గా అన్నట్టు ఫేస్బుక్ భిన్నంగా స్పందించింది. డేటా అన్నది కొత్త చమురు కాదని, దీన్ని ఒక దేశం పరిధిలోనే నిల్వ చేయరాదని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ నిక్‌క్లెగ్ వ్యాఖ్యానించారు. భారత్ వంటి దేశాలు డేటాను ఓ పరిమిత వస్తువుగా నిలిపివేయకుండా, సాఫీగా దేశ సరిహద్దులు దాటి వెళ్లేందుకు అనుమతించాలని అభిప్రాయపడ్డారు. ‘‘జాతి భద్రత దృష్ట్యా భారత్ వంటి దేశాలకు డేటాను పంచుకోవడం ఇప్పుడు కీలకం. ఎందుకంటే తీవ్ర నేరాలు, ఉగ్రవాదాన్ని తుదముట్టించే లక్ష్యంతో అంతర్జాతీయ డేటాను పంచుకునేందుకు భారత్ గొప్ప చర్యలనే చేపట్టింది’’ అని క్లెగ్ గుర్తు చేశారు. డేటాను దేశీయంగానే నిల్వ చేయాలని, ఇందుకు అన్ని కంపెనీలు చేర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. హక్కులను గౌరవించాలి.. ‘‘తమ డేటాకు ఏం జరుగుతుందో తెలుసుకునే వ్యక్తుల హక్కులను గౌరవించాలి. పోటీని, ఆవిష్కరణను ప్రోత్సహించాలి. ప్రతీ ఒక్కరు డేటాను పొందే దిశగా దాన్ని అందుబాటులో ఉంచాలి. ఈ దిశగా ఇంటర్నెట్కు భారత్ కొత్త నిర్వచనం చెప్పాలి’’ అని నిక్‌క్లెగ్ అన్నారు. డేటాను ‘న్యూ ఆయిల్’ (కొత్త ఇంధనం) అని, సామాజిక మాధ్యమ వేదికలు, ఇంటర్న్‌పై భారత యూజర్ల డేటాను కాపాడాల్సి ఉందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇటీవలే వ్యాఖ్యానించారు. ‘‘దేశ డేటాను భారత వ్యక్తులే కలిగి ఉండడం, నియంత్రించడం చేయాలి. అది దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్లు కాదు’’ అని అంబానీ పేర్కొన్నారు. ‘‘భారత్‌లో చాలా మంది, అలాగే ప్రపంచ వ్యాప్తంగా డేటాను కొందరు కొత్త ఆయిల్గా భావిస్తున్నారు. దేశం పరిధిలోనే భారీ చమురు నిల్వలను కలిగి ఉండొచ్చు. ఇది కచ్చితంగా సంపదను పెంచుతుంది. కానీ, ఈ విధమైన పోలిక పొరపాటే అవుతుంది’’ అని క్లెగ్ గురువారం ఓ మీడియా సంస్థకు తెలిపారు. ‘‘నిలిపి ఉంచడం వల్ల డేటాకు విలువ రాదు. దాన్ని స్వేచ్ఛగా ప్రయాణించేందుకు అనుమతించడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించాలి’’ అని ఆయన సూచించారు. -
భారత నేతలు అనవసరంగా పాక్‌ను నిందిస్తున్నారు
బ్రిటిష్ ఉప ప్రధానితో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇస్లామాబాద్: భారత నేతలు ఇప్పటికీ పాకిస్థాన్‌ను అనవసరంగా నిందిస్తున్నారని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. ఒకవైపు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద తరచు జరుగుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న సమయంలో బ్రిటిష్ ఉపప్రధాని నిక్ క్లెగ్ వద్ద నవాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. లండన్‌లో ఇటీవల పర్యటించిన నవాజ్, తన పర్యటనలో భాగంగా క్లెగ్‌తో భేటీ అయ్యారు. భారత్‌ను నిందించడం తాము మానేసినా, భారత రాజకీయ నాయకులు మాత్రం ఇప్పటికీ పాక్‌ను నిందించడం కొనసాగిస్తున్నారని అన్నారు. భారత్‌తో గల అన్ని సమస్యలనూ పరిష్కరించుకునేందుకు పాక్ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, మరోవైపు తాలిబన్లతో కూడా చర్చలు ప్రారంభించామని క్లెగ్‌తో చెప్పారు.