breaking news
Nedunuri Krishnamurthy
-
నాన్నకు ప్రేమతో..
నేదునూరికి కుటుంబ సభ్యుల నివాళి విశాఖపట్నం: కర్నాటక సంగీతంలో ఆకాశమంత ఎత్తుకెదిగారు. సాగరమంత ఖ్యాతిని గడించారు. అర్థ శతాబ్దానికి పైగా తమిళనాట వేల కచేరీలిచ్చి సంగీత ప్రియులను ఓలలాడించారు. రాష్ట్రానికి, దేశానికి కీర్తిని తెచ్చిపెట్టారు. ఆ సంగీత కళానిధి పేరు నేదునూరి కృష్ణమూర్తి. ఏడాది క్రితం కన్నుమూశారు. మంగళవారం ఆ మహనీయుని పేరిట విశాఖ సాగరతీరంలో కర్ణాటక సంగీత భాండాగారాన్ని ప్రముఖులు ప్రారంభించారు. ఆయన కాంస్య విగ్రహాన్నీ ఆవిష్కరించారు. ఆ మహత్కార్యంలో పాలుపంచుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో కుటుంబ సభ్యులు వచ్చారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కుమారుడు పినాకపాణి, కోడలు, విశాఖ ఎంవీపీ కాలనీలో ఉంటున్న కుమార్తె విజయశ్రీ, వారి బంధుగణం వచ్చి వాలారు. తొలుత తండ్రి నేదునూరి విగ్రహావిష్కరణలో, తర్వాత సంగీత భాండాగారం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అతిరథ మహారథులు, అమాత్యులు, ప్రజాప్రతినిధులు అక్కడ నుంచి నిష్ర్కమించాక భాండాగారానికి ఎదురుగా ఉన్న నేదునూరి విగ్రహం వద్దకు వెళ్లారు. నాన్నకు ప్రేమతో పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెమర్చిన కళ్లతో కాసేపు అక్కడే గడిపారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా తన తండ్రికి దక్కిన అరుదైన గౌరవాన్ని చూసి ఉప్పొంగిన ఆనందంతో వెనుదిరిగారు. మా అదృష్టం నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. మా తండ్రి నేదునూరి పేరిట విశాఖలో కర్ణాటక సంగీత భాండాగారాన్ని ఏర్పాటు చేయడం మా అదృష్టం. సాగరతీరంలో ఆయన సంగీతం అంద రూ విని ఆస్వాదించే అవకాశం కల్పించడం సంతోషకరం. మాకు ఇంతకన్నా ఆనందకరమైనది ఇంకొకటి ఉండదు. నేదునూరి మ్యూజిక్ మ్యూజియం ఏర్పాటుకు సహకరించిన వారందరికీ మా ధన్యవాదాలు. -పినాకపాణి, నేదునూరి కుమారుడు, అమెరికా కలకాలం నాన్నగారి సంగీతం నాన్నగారి సంగీతం కలకాలం నిలవాలని సంగీత ప్రియులు కోరుకుంటారు. ఈ సంగీత భాండాగారం ద్వారా ఆ కోరిక తీరుతుంది. మా మనసులోని భావాలు కార్యరూపం దాల్చడం మా అదృష్టం. ఈ మ్యూజియం ద్వారా మా తండ్రి నేదునూరి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. తక్కువ వ్యవధిలోనే ఈ మ్యూజియం ఏర్పాటు చే సినందుకు కృత జ్ఞతలు తెలుపుకుంటున్నాం. -విజయశ్రీ, నేదునూరి కుమార్తె, ఎంవీపీ కాలనీ -
ఓరుగల్లులో ‘నేదునూరి’ కీర్తనలు
హన్మకొండ కల్చరల్ : తన గానంతో సంగీత ప్రియుల ను మైమరిపించి ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందిన నాదబ్రహ్మ, సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తికి జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. శాస్త్రీయ సం గీతంలో ప్రతిభాశాలిగా పేరొందిన సంగీత విద్వాం సుడు కృష్ణమూర్తి మరణంతో జిల్లాకు చెందిన సంగీత ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వరంగల్ గడ్డపై నేదునూరి అందించిన కచేరీలు ఇక్కడి ప్రజలను మంత్ర ముగ్ధులను చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణమూర్తి ఓరుగల్లులో చేసిన కచేరీలను ఒకసారి జ్థాపకం చేసుకుందాం. జిల్లాకు చెందిన ప్రముఖ నృత్య సంగీత సంస్థ జనప్రియ గానసభ ప్రారంభ వేదికపై తన 53వ యేట నేదునూరి సంగీత కచేరీ నిర్వహించారు. వరంగల్‌లోని కేఎంసీ ఆడిటోరియంలో 1981 మార్చి 1న జరిగిన జనప్రియ గానసభను అప్పటి విదేశాంగ వ్యవహారాలశాఖ మంత్రి పీవీ నర్సింహారావు ప్రారంభిం చారు. కాగా, అప్పటి రాష్ట్ర మంత్రి టి.హయగ్రీవాచారి, పీవీ నర్సింహారావు సమక్షంలో నేదునూరి కృష్ణమూర్తి సంగీత కచేరి చేయడంతోపాటు వాగ్గేయకారుల కీర్తనలను ఆలపించి సంగీత ప్రియులను, పండితుల ను ఓలలాడించారు. ఆ సమయంలో ప్రముఖ సంగీత వేత్తలు పేరి శ్రీరామ్మూర్తి వయోలిన్ సహకారం అందించగా.. దండమూడి రామ్మోహన్ మృదంగం వాయించారు. రెండో సారి.. 1984 మార్చిలో జనప్రియ గానసభ ఆధ్వర్యంలో జిల్లాలో మొదటిసారిగా ‘త్యాగరాయ ఆరాధనోత్సవా లు’ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత వీణా విద్వాంసులు చిట్టిబాబు కచేరి జరి గింది. అయితే నేదునూరి కృష్ణమూర్తి ఆ సమయంలో కచేరి చేయలేదు కానీ.. చిట్టిబాబు స్వయంగా మేనల్లుడు కావడంతో తాను కూడా కచేరీలో పాల్గొని ఓరుగల్లు సం గీత ప్రియులతో సమావేశమయ్యారు. కాగా, 1988లో జనప్రియ గానసభ ఆధ్వర్యంలో రెండోసారి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేదునూరి కృష్ణమూర్తి సంగీత కచేరీ చేసి సంగీత ప్రియులను అలరించారు. పలువురి సంతాపం.. కృష్ణమూర్తి మరణవార్తను తెలుసుకున్న జిల్లాకు చెంది న సంగీత ప్రియులు, ఆయన అభిమానులు దిగ్భాం తికి లోనయ్యారు. నేదునూరి మరణం యావత్ సంగీత ప్రపంచానికి తీరనిలోటని జనప్రియ గానసభ అధ్యక్ష, కార్యదర్శులు పర్చా కోదండరామారావు,వీఎల్. నర్సిం హారావు పేర్కొన్నారు. తన ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని సంతకం చేసి రిజిస్టర్ పోస్టు చేసి పంపించారని వీఎల్ నర్సింహారావు గుర్తు చేసుకున్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత విదుషిమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి కంటే ముందుగానే నేదునూరి కృష్ణమూర్తి అన్నమయ్య పాటలను స్వర పర్చారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, నేదునూరి మృతికి మన సంస్కృతి సాహిత్య సాంస్కృతిక ప్రధాన కార్యదర్శి మిద్దెల రంగనాథ్, రమాదేవి, విద్యారణ్య సంగీత నృత్య కళాశాల ఉపన్యాసకులు రామకృష్ణశర్మ, జనస్వామి శ్రీనివాసమూర్తి, ఉల్లి జయకాంత్, జియావుద్దీన్, భద్రకాళి దేవాలయ ప్రధానార్చకుడు భద్రకాళిశేషు సంతాపం తెలిపారు. -
నింగికేగిన గళ యశస్వి
నేదునూరి మృతితో విషాదంలో మునిగిన సంగీతాభిమానులు సర్కారు లాంఛనాలతో అంత్యక్రియలు తరలివచ్చిన ప్రముఖులు విశాఖపట్నం-కల్చరల్: గాత్ర సంగీత నిధి నింగికెగసింది. కర్ణాటక సంగీతానికి వన్నెలద్దిన ఆ గళం శాశ్వతంగా మూగబోయింది. అన్నమయ్య, రామదాసు కీర్తనలు ఆలపించి జనం హృదయాంతరాళల్లోకి చొచ్చుకుపోయిన నేదునూరి కృష్ణమూర్తి మృతి సంగీతాభిమానులను విషాదంలో ముంచెత్తింది. శాస్త్రీయ సంగీత రంగంలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన ఈ స్వరబ్రహ్మది గాత్ర సంగీతంలో విశిష్ట స్థానం. కర్ణాటక సంగీతం ఆంధ్రకు వెళ్లిపోయిందా అనేంత భావన కలిగిం చిన నేదునూరి నగరంలోని ఎంవీపీకాలనీలో స్వగృహంలో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కట్టూ, బొట్టేకాదు..సంగీత పాండిత్యం,వ్యవహారం, భాషలో నమ్రతా అంతా సంప్రదాయాన్ని ప్రతిబిం బించిన ఈ స్వర మాంత్రికుడు మరణించారని తెలియగానే సంగీతప్రియులు దుఖసాగరంలో మునగిపోయారు. ప్రభుత్వలాంఛనాలతో నేదునూరికి అంత్యక్రియులు నేదునూరి భౌతికకాయానికి ప్రభుత్వం తరుపున అధికారిక లాంఛనాలతో అంత్యక్రియులు సోమవారం సాయంత్రం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ తరుపున మంత్రి అయ్యన్నపాత్రుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, నేదునూరి ఇంటికి చేరి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. నేదునూరికి తనకున్న అనుబంధాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గుర్తు చేసుకున్నారు. చావుల మదుం వద్ద ఉన్న శ్మశనావాటికలో నేదునూరి అంతక్రియులు జరిగాయి. శాసనమండలి చైర్మన్ డాక్టర్.ఎ. చక్రపాణి, వైస్‌చైర్మన్ సతీష్ కుమార్‌రెడ్డి, శాసనసభ్యులు పి.వి.జి.ఆర్.నాయుడు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్,మాజీఎంపీ సబ్బం హరి, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, జిల్లా కలెక్టర డాక్టర్.ఎస్. యువరాజ్,జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఆర్టీసీ ఎండీ పి. పూర్ణచంద్రరావు, మద్రాసు సంగీత అకాడెమీ కార్యదర్శి (చెన్నాయ్)పప్పుల వేణుగోపాల్, సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణమూర్తి, డాక్టర్ పి.వి.రావు, ఏయూ విశ్రాంతి రెక్టార్ డాక్టర్. ఎ.ప్రసన్నకుమార్, విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడెమీ కార్యదర్శి జిఆర్కె రాంబాబు,పేరాల బాలమురళీకృష్ణ తదితరులు నేదునూరి భౌతికకాయాన్ని సందర్శించి సంతపాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో సంగీతప్రియులు, అభిమానులు తరలి వచ్చారు. -
నాదలోలుడికి వీడ్కోలు
కర్ణాటక సంగీతంలో తూర్పుకనుమలు బాగా విస్తరించినా మేరు పర్వతాలు తక్కువ. సంఖ్యలో తక్కువయితేనేమి, నిజంగా ఉత్తుంగ శిఖరాలే. ఇప్పుడు మరో సంగీత శిఖరం కనుమరుగైపోయింది. నేదునూరి కృష్ణమూర్తిగారు కూడా వెళ్ళిపోయారు. సంగీత రాగజలధిలో ఎన్నో నావలుంటాయి. రసికులు వాటిలో ఎన్నో ప్రయాణాలు చేస్తారు. నేదునూరిగారి సంగీత నావలో శ్రోతల ప్రయాణం ఒక అపూర్వ అనుభవం. ఎంతమంది తెలుగు సంగీతజ్ఞుల పాటవిన్నా, ఎంతమంది దక్షిణాది విద్వాంసుల పాట విన్నా శ్రోతలకు ఆయన అందించిన సంగీత రక్తి, పరిమళ గంధం మెదడుకి, నోటికీ కూడా అంటుకుంటుంది. శ్రోతలనే కాదు పరిణతి చెందిన సంగీత గాయకుల బుర్రని మేధోలేపనం చేస్తుంది. సాక్షాత్తూ ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి ఆ పూత పూసుకుని మురిసిపోయింది. ఆయన రాగప్రస్తారం అందరి రాగ ప్రసరణంలాంటిది కాదు. ఆయన కీర్తన పాఠం కాదు. రేసింగు బాటలో ఎత్తుపల్లాల పరీక్షా పథం. ఆయన నెరవుల కల్పన అమేయ చక్రబంధం. అంతటా ఆ రాగపు బిగి కౌగిలి దీర్ఘ విరహానంతరం ప్రియుని పరిష్వంగంలా ఉంటుంది. ఎత్తుగడ రాగఛాయ చూపుడు వేలుతో మొదలయి ఆకర్ణాంతర ధమ్మిలముచేతబట్టి అన్నట్లు నిడివైన బాణాలు - రాగ లక్షణ శరాలు - తెంపు లేకుండా విడిచి వదిలిపెట్టేవారు. రాగం పూర్తయ్యేసరికి పూల సజ్జను బోర్లించినట్లు మీ చుట్టూ ఏదో కలవరం, పరవశం, ఒక తృప్తి. కడుపునిండినట్లుంటుంది. ఇక చాలు ఎంత గొప్పగా వినిపించారో అన్న ఆనందం కలుగుతుంది. ఆ రాగపు పట్టువస్త్రంలో ఆయన నేసిన పడుగుపేకలు రంగులనీడల డోలన కేళీమోదాలు ఇన్ని అన్నీ కావు. రాగాల ఆ చీరకి ఒక్కొక్కసారి పెద్ద అంచు, కొన్ని రాగ ధర్మాల సరిగంచులు, ఊపిరి సల్పనీయని మెలికలు, ఫ్రేజుల జలతారు బిగింపులు, మరికొన్ని రాగపుటాలోచనల తీర్మానాల సవరింపులు, రాగ జరీ బుటానేతలు, రాగలోకపు నాటకీయ స్వరాల లతలు, విహ్వలతలు, వీటికి తోడు చిట్టలు. అదో చెప్పలేని ప్రయాణం. పరిసరాలను మరపించే జ్ఞానయాత్రగా నడుస్తుంది. అతి చిన్న రాగ దర్శక పదంలో కూడా ప్రతిబింబ పతకంగా తోచే ఆ చిట్టల కూర్పు పేరుపొందిన కర్ణాటక సంగీత విద్వాంసుడికి సహితం అసాధ్యంగానో అనవసరంగానో రక్తిభంగంగానో తోచి వస్త్రాన్ని పిడి చేసినట్లుగా తోచవచ్చుగాని కచేరీ కళాప్రదర్శనలో అది నర్సాపురం లేసు అల్లికల తానుగా విశ్వరూపం చూపుతుంది. అయిదు దశాబ్దాలకు మించిన నేదునూరి ప్రతిభకి ఇది ఆధారశిల. ఆయన మాటల్లో పాణిగారి భిక్ష అది. శ్రీపాద పినాకపాణి గారు ఆయన గురువు. పాణిగారి వద్దకు వెళ్ళేముందున్న ఆయన పాటకి, వెళ్ళిన తర్వాత ఆయన గ్రహించిన విద్యసారానికి ఆయనే ఒకసారి తేడా చెప్పారు. ‘‘అతి సాధారణంగా ఇది విను అంటూ రాగం అలా కూర్చుకుంటూ పాడుకుంటూ అతి సూక్ష్మరాగ ధర్మం కూడా వినిపిస్తూ తెంపు లేకుండా పాడుకుంటూ పాణి గారి పాట సాగేది. అయ్యబాబోయ్, ఇంత ఉందా! మనం ఇంత తక్కువే పాడుతున్నామా అనిపించింది. ఆయనంత రాగవిస్తారం చేసి ప్రతిచోట చిట్టలతో చాంతాడు చందాన కచేరీలు పాడడం అవసరం లేదనుకుని నేనే కచేరీ ధర్మంగా కుదించుకుంటూ పాడసాగాను’’ అని పాడి నేదునూరి వివరిస్తూ చెప్పారు.కర్ణాటక సంగీతంలో రాగప్రస్తారం ఉక్కు తీగ కాదు, పూల తీగ కాదు, తెంపు లేని పాకం గల మధుర సూత్రం అని పాడిన ప్రతి కచేరీలోనూ ప్రతి రాగంలోనూ నిరూపిస్తూ సాగిన విశిష్ట గాయకుడు నేదునూరి. మన కీర్తనల్లో ఉన్న భక్తి, రక్తి భావనలతో పాటు సాహిత్యంలోని నాటకీయ నివేదనను అనేకమంది విద్వాంసులు అనేక రకాలుగా వెలువరించారు. తాత్త్విక, వర్ణనాత్మక ఇంగితాన్ని వినసొంపుగా సంధించిన మేటి గాయకులూ ఉన్నారు. కాని నేదునూరి గారిలా సమపాళ్ళల్లో వాగ్గేయకారుని మనసెరిగి పాడిన వారు తక్కువ. పెంచిన చిలక ‘రామ రామ రామాయనుచు’ పాడుతుంది అనే కీర్తనలో పెద్ద గాయనీ మణులు సహితం హెచ్చులు పోతారు. ‘మానస భజరే గోపాలం’ అంటే ఈ ‘మానస’ నునడిపే రాగపేటిక చటుక్కున తెరచుకుంటుంది మరో గాయకుని గొంతులో. కాని ఈయన పద్ధతి, కపోలాన్ని మధ్య వ్రేలితో తాకినంత భావస్ఫురణతో సాగుతుంది. ‘ఏమయ్య రామా’ అనే కీర్తనలో సుతుడనుచు దశరథుడు, అంటూ వివరణ సాగుతుంది. సీతమ్మ వారు రాముడ్ని ఏమనుకున్నదో, లక్ష్మణుడు, యోగీంద్రులు ఇలా వివిధ జనులు రాముడ్ని ఏమనుకున్నారో! సరే? నీ మహిమ తెలియవశమా? అని ఆ కీర్తన. విపులంగా ఎందుకు చెప్పుకోవాలంటే ‘ఏమయ్యా! రామా!’ అన్న పరిపరివిధాల నాటకీయ సంబోధన ఆ రాగ పరిధిలోని పారమ్యాన్ని సందర్శిస్తూ పాడడం నేదునూరికే చెల్లింది. అలాగే ‘అన్నపూర్ణే విశాలాక్షీ’ అనే కీర్తన ఉంది. ఎన్ని వందల సార్లు కచేరీలలో పాడి ఉంటారో! దాన్లోని వాగ్గేయకారుని మనసంతా దోచి ఈయన పాడారా అన్నట్లు రాగనివేదన ప్రకటన ఉంటుంది. ఇక కాంభోజి, షణ్ముఖప్రియ, బేగడ, ఖరహరప్రియ, తోడి, నాదనామక్రియ - పాడని రాగం, సిరులు పండించనిరాగం - ఏదీ లేదు ఆయన గొంతులో. అయితే ఆయన కచేరీ యాత్ర వడ్డించిన విస్తరికాదు. ఊహించని కష్టాలు పడిన తండ్రీ తల్లి నేదునూరిని ఉద్యోగం చేయమనలేదు. ఉచితంగా విజయనగరంలో సంగీతం చెప్తారు కనుక అటువైపు పంపారు. ద్వారం నరసింగరావుగారు ఈయనకు వయెలిన్ నేర్పినా తర్వాత పాణిగారితో ఓ మాట అన్నారు. ‘‘మంచి కుర్రాడు, మీరు చెప్పండి’’ అని. అంతే నేదునూరి సముద్రంలో ఈత మొదలెట్టారు. ఆయన పుట్టిన ఊరు దగ్గరే సముద్రం. ఉప్పాడ సముద్రం. తుఫాను వస్తే తప్ప ఆ సముద్రం తీరం దాటదు. అలాగే నేదునూరి కర్ణాటక సాంప్రదాయ తీరం దాటలేదు. ఒక ఉరుకు లేదు. పరుగులేదు. అక్కడంతా నిదానమే. పిఠాపురం పాదగయలో కుక్కుటేశ్వరుని దర్శించుకోవడం, వచ్చిన కచేరీలు చేసుకోవడం. 52 సంవత్సరాల క్రితం కూడా 150 రూపాయలకు ఒక వివాహంలో ఆయన కచేరీ చేయడం నాకు తెలుసు. ఈ మధ్య జబ్బు చేశాక కూడా ఒక సారి పిఠాపురం వెళ్ళి రాజరాజేశ్వరీ దేవిని దర్శించుకుని వచ్చారు. ఆయన పిఠాపురంలో ఆ దేవతా విగ్రహాల ముందు ఆర్భాటాలు లేకుండా పాడడం విన్నవారికి అదో ఆత్మీయ అర్చనలా ఉంటేది. సొంతవూరు మీద అంత మమకారం ఆయనది. గురువుగారు పాణి గారికి ఎంత పేరున్నా గుర్తింపు రాలేదని ఆయన చాలా కాలం కలతచెందారు. ఆయనకి సంగీత కళానిధి రావడానికీ, పద్మభూషణ సత్కారం లభించడానికి నేదునూరి తెరవెనుక ఎంతమందికి చెప్పారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పాణిగార్కి సంగీత కళానిధి బిరుదు లభించిన తర్వాతనే నేదునూరి ఆ బిరుదును తను స్వీకరించారు. కచేరీ చేస్తున్నప్పుడు, కీర్తన పాడుతున్నప్పుడు ప్రతి అంశంలోనూ పాడే ప్రతి విద్యా విషయక, ఆకర్షక శాస్త్రీయ సంప్రదాయ కట్టుబడులను ఎంత నిష్ఠతో నేదునూరి నిర్వహించే వారో, ఆయనకు పక్క వాద్యాలు వాయించిన వారే చెప్పగలరు. వయొలిన్‌పై ఆయనకు సహకరించిన రామస్వామి గారు తరువాత సహకరించిన లాల్గుడి, చంద్రశేఖరన్ మాత్రమే చెప్పగలరు. అంతటి విస్తారమైన ప్రతిభను ఆరుదశాబ్దాలు కొనసాగించాలంటే వాగ్గేయకారుల కీర్తనలనే కాదు, వారు కూర్చిన రాగరత్న మాలికల వెలుగు జిలుగులన్నీ గుండె నిండా నింపుకోవాలి. తన మనసు నిండా నింపుకోవాలి. గొంతునిండా దట్టించుకోవాలి. అలా సంపూర్ణ స్నానమాచరించిన భద్రగజంలా నేదునూరి జీవించారు. ‘ఎంత ముద్దూ, ఎంత సొగసూ’ అని బిందు మాలిని రాగంలో టూకీగా పాడుకోవచ్చు. ‘లేనినాద సుధారసంబు ఇలను’ అంటూ నేదునూరి తనదే అయిన చిక్కటి అమృతం ఈ నేలపై కురిపించి వెళ్ళిపోయారు. ఆ ధారని పదే పదే కంటూ వింటూ ఆనందించమని తరలిపోయారు. కొన్ని దశాబ్దాల పాటు కొన్ని తరాల పాటు ఆ ఆనందామృత వర్షిణి కురుస్తూనే ఉంటుంది. రసజ్ఞులని సేద తీరుస్తూనే ఉంటుంది. - పన్నాల సుబ్రహ్మణ్యభట్టు ప్రముఖ సంగీత, సాహిత్య, కళా విమర్శకులు సంగీత నిధికి సన్నిహితుల నివాళి నేదునూరి కృష్ణమూర్తి మరణవార్త ఇప్పుడే తెలిసింది. దిగ్భ్రాంతికి గురయ్యా. వ్యక్తిగతంగా కూడా ఆయన నాకు చాలా ఆప్తులు. సిసలైన జెంటిల్మన్. ఆయన పాడినవన్నీ నాకు నచ్చినవే. ఆయన మరణం కర్ణాటక సంగీతానికనే కాదు... యావత్ సంగీత ప్రపంచానికే తీరని నష్టం. - మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సంగీత దిగ్గజం, చెన్నై నేదునూరి నాకు పిఠాపురంలో ఆబాల్య స్నేహితుడు, సన్నిహితుడు. నేదునూరి, మా అన్నయ్య వేణుగోపాలరావు దగ్గర అష్టపదులు, తరంగాలు నేర్చుకోవడం నాకు గుర్తే. నేను సాహిత్యంలో, అతను సంగీతంలో మళ్ళిపోయాం. - ఆవంత్స సోమసుందర్, సుప్రసిద్ధ కవి, పిఠాపురం తమిళనాట మహా విద్వాంసులందరూ ఒప్పుకొనేలా సంగీతాన్ని వినిపింపజేసి, తన విద్వత్తును వారు అంగీకరించేలా చేసి, శభాషనిపించుకొని మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ నుంచి ‘సంగీత కళానిధి’ బిరుదాన్ని అందుకున్న తెలుగు బిడ్డ. ప్రతి ఏటా అకాడెమీలో నేదునూరి కచ్చేరీ ఉండాల్సిందే. ఆ ఘనత మరే తెలుగు విద్వాంసుడికీ దక్కలేదు. ‘అన్నమయ్య పాటలు’గా వ్యవహరిస్తున్న వాటికి స్వరాలు కూర్చి, ‘కీర్తన’ స్థానాన్ని కల్పించి, పూర్తి కచ్చేరీ స్థాయికి తీసుకెళ్ళారు. - మునుగంటి శ్రీరామ్మూర్తి, ‘గానకళ’ ఎడిటర్, కాకినాడ విజయవాడ సంగీత కళాశాలలో ప్రిన్సిపాల్‌గా ఆయన ప్రతి వారం ‘రాగరసం’ పేరిట ప్రత్యేక క్లాసు తీసుకొనేవారు. ఒక్కొక్క రాగాన్నీ, దాని పురోగతినీ పాడుతూ, వివరించేవారు. టి.టి.డి. వారి ‘మాధవసేవే మానవసేవ’, ‘తీర్థయాత్ర’ డాక్యుమెంటరీలకు ఆయన సంగీత దర్శకుడైతే, నేను అసిస్టెంట్‌ను. - పెమ్మరాజు సూర్యారావు, సహోద్యోగి, విజయవాడ గురువు గారు లేరు, ఆయన పాట మరి వినిపించదు అన్న చేదు నిజం జీర్ణించుకోలేకపోతున్నా. మాటలు రావడం లేదు. ఏం చెప్పను?’’ - జి. బాలకృష్ణప్రసాద్, నేదునూరి శిష్యుడు, తిరుపతి ముందు తరాల సంగీత విద్వాంసులు ఎలా పాడి మెప్పించారో విని, దాన్ని అందిపుచ్చుకొని తరువాతి తరాలకు అందించడమే సంప్రదాయం. గురువులు శ్రీపాద పినాకపాణి ద్వారా దాన్ని నూటికి నూరుపాళ్ళు ఆచరణలో పెట్టిన విద్వాంసులు నేదునూరి. మా అబ్బాయిలు ‘మల్లాది బ్రదర్స్’గా ఇంత పేరు తెచ్చుకున్నారంటే నేదునూరే కారణం. - మల్లాది సూరిబాబు, సంగీతజ్ఞుడు, విజయవాడ సేకరణ - రెంటాల జయదేవ -
ప్రముఖ సంగీత విద్వాంసుడు నేదునూరి కన్నుమూత
విశాఖ : ప్రముఖ సంగీత విద్వాంసుడు , సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి సోమవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నేదునూరి విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 1927లో జన్మించిన నేదునూరి తిరుమల తిరుపతి దేవస్థానం, కంచికామకోటి ఆస్థాన విద్యాంసుడిగా పనిచేశారు. అన్నమయ్య కృతులకు స్వరకల్పన చేశారు. -
సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి కన్నుమూత