పుత్తడి బొమ్మ పెళ్లికూతురాయె
- పుస్తకాలు మోసే వయస్సులో పుస్తెల భారం
- మూడు ‘ముళ్ళు’ బంధంతో బాలికల భవిష్యత్తు ఛిద్రం
- ఆధునిక సమాజంలోనూ పుత్తడి బొమ్మ పూర్ణమ్మలెందరో..
- బాల్య వివాహాలు జరగడంలో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో అనంత
- బాల్య వివాహాలపై ప్రభుత్వ శాఖల వద్ద సమన్వయం కరువు
అనంతపురం సెంట్రల్:
‘‘నలుగురు కూచొని నవ్వే వేళ
నా పేరొక తరి తలవండి
మీమీ కన్నబిడ్డల నొకెతకు
ప్రేమను నా పేరివ్వండి’’
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథలో చనిపోయే ముందు పూర్ణమ్మ అన్న మాటలివి. నాటి సమాజంలో కన్యాశుల్కం దురాచారాన్ని వ్యతిరేకిస్తూ గురుజాడ అప్పరావు రాసిన గేయకవిత ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ రచన ఎంతో ప్రసిద్ధి చెందింది. పదేళ్ల బాలికను అరవై ఏళ్లముదుసలి వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించడం ద్వారా కలిగే దుష్పరిణామాలను ఈ కథలో చక్కగా వివరించారు. ప్రభుత్వం కూడా ఈ కథకు జనాధరణ కల్పించేందుకు 20 ఏళ్ల క్రితం తెలుగుపాఠ్యాంశాల్లోనూ చేర్చారు. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ ఇలాంటి పుత్తడి బొమ్మలెందరో ఉండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో ఎక్కడో ఒక చోట బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అరకొరగా అధికారుల దృష్టికి వచ్చిన ఉదంతాలను ఎలాగోలా అడ్డుకుంటున్నారు. బయటకు రాకుండా జరిగిపోతున్న నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. వారం రోజుల క్రితం ఒకే రోజు రెండు ఉదంతాలు వెలుగుచూశాయి.
నగరంలో నాయక్‌నగర్‌కు చెందిన ఓబాలికకు కదిరికి చెందిన ఓ వ్యక్తితో వివాహం నిశ్చయం అయింది. తెల్లవారితో పెళ్లి జరగాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు వివాహాన్ని అడ్డుకున్నారు. బుక్కరాయసముద్రం మండలం విరూపాక్షేశ్వరనగర్లో ఓ విద్యార్థినికి బలవంతంగా పెళ్లిచేయాలని తల్లిదండ్రులు భావించారు. తనకు చదువుకోవాలని ప్రాధేయపడినా మంచి సంబంధం.. ఇలాంటి సంబంధం మళ్లీ రాదు.. ఈసంబంధమే చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. మనస్తాపం చెందిన విద్యార్థి విషపుద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఒకేరోజు ఈ రెండు ఘటనలూ వెలుగుచూశాయి. ఇలాంటివి జిల్లాలో ఎక్కడో ఒక చోట తరచూ జరుగుతూనే ఉన్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతోనే, పిల్లలకు ఇష్టంలేకనే బయటకు వస్తున్నాయి. కొన్ని లోలోపల మాత్రం జరిగిపోతున్నాయి. రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా బాల్య వివాహాలు జరగడంలో రెండో స్థానంలో ఉంది. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో ఏ స్థాయిలో బాల్య వివాహాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
వివాహాలు జరుగుతున్నాయి? ఎన్ని అడ్డుకుంటున్నారనే విషయం ప్రభుత్వ శాఖల వద్ద లేకపోవడం మరో విచారకరం. ఈ అంశంపై పోలీసు, ఐసీడీఎస్ అధికారులను సంప్రదించగా తమ వద్ద లేదని సమాధానం చెప్తున్నారు. నోడల్ ఏజెన్సీగా ఉన్న 1098 సంస్థను సంప్రదించాలని సూచించారు. చివరకు 1098 సిబ్బందిని సంప్రదించినా ఫలితం లేదు. దీన్ని బట్టి చూస్తే సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.
బాల్య వివాహాలు జరిపితే కఠిన చర్యలు
బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం. సమాచారం తెలిసిన వారు వెంటనే చైల్డ్‌లైన్ 1098, డయల్–100కు సమాచారం అందించాలి. ఎవరైతే బాల్య వివాహాలు చేస్తారో వారితో పాటు సహకరించిన వారు కూడా శిక్షార్హులు. షామియానా వేసేవారు. భోజనాలు వడ్డించేవారు. పెళ్ళికి వచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకోవచ్చు. కావున బాల్య వివాహాలు చేయడం మానాలి. దీని వలన పిల్లలకు ఆరోగ్య పరంగా రకరకాల సమస్యలు వస్తాయి. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తెరగాలి. బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయాలని ఇటీవల జిల్లా స్థాయిలో కలెక్టర్ సమక్షంలో ప్రభుత్వ అనుబంధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో చైతన్యం కలిగించాలని ఆదేశాలు జారీ చేశాం.
- జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ