breaking news
Natural food
-
ఇంటిపంటల కోసమే సిటీకి దూరంగా సొంతిల్లు!
వరంగల్‌లో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రేగూరి సింధూజ ఇంజనీరింగ్ చదువుకొని హైదరాబాద్ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. రసాయనిక అవశేషాలు లేని ప్రకృతిసిద్ధమైన ఆహారం విలువ గుర్తెరిగిన ఆమె.. సిటీలో ఫ్లాట్‌కు బదులు (బీహెచ్ఈఎల్ దగ్గర) నగర శివారు ప్రాంతం అమీన్పూర్ నరేంద్ర నగర్ కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకున్నారు. 200 గజాల టెర్రస్‌లో సగభాగంలో వందకు పైగా గ్రోబాగ్స్, కుండీలలో గత ఏడాదిగా ఇంటిపంటలు పండించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యాన శాఖ నుంచి 4 పెద్ద వృత్తాకారపు గ్రీన్ గ్రోబాగ్స్తో కూడిన సబ్సిడీ కిట్‌ను తీసుకున్నారు. శిక్షణా శిబిరాలకు హాజరై అవగాహన పెంచుకున్నారు. వీటితోపాటు తెల్లని గ్రోబాగ్స్‌ను, కొబ్బరిపొట్టు తదితర పరికరాలను సేకరించుకున్నారు. 30%మట్టి, 30%పశువుల ఎరువు, 30% శుద్ధి చేసిన కొబ్బరిపొట్టు, వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన ఇంటి కంపోస్టు+వేపపిండితో కలిపిన మట్టి మిశ్రమాన్ని గ్రోబాగ్స్, కుండీలలో నింపారు. వేసవి ఎండ తీవ్రత నుంచి ఇంటిపంటలను కాపాడుకోవడానికి ఇనుప ఫ్రేమ్‌తో షేడ్‌నెట్ వేసుకున్నారు. సింధూజ కుటుంబంలో నలుగురు పెద్దవారు ఉంటారు. పాలకూర, చుక్కకూర, గోంగూర, తోటకూర, కొత్తిమీర, బచ్చలి కూర పెంచుకొని తింటున్నారు. గత ఏడాదిగా ఆకుకూరలను బయట కొనటం లేదు. తీగజాతి కూరగాయలను పాకించడానికి కొబ్బరి తాళ్లతో పందిరి అల్లారు. బెండ, బీర, గోరుచిక్కుడు, కాప్సికం, సొర తదితర కూరగాయలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం వారంలో 2,3 రోజులు ఈ కూరగాయలు తింటున్నామని, కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో ఇంటి కూరగాయలే తమకు సరిపోతాయని సింధూజ(98857 61707) సంతోషంగా చెప్పారు. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా నిపుణుల సలహాలను తెలుసుకుంటున్నానన్నారు. -
ఆహారమే మహా భాగ్యం
స్వచ్ఛమైన ఆహార పదార్ధాలకు ఆదరణ నగరంలో ఏటా రూ.100 కోట్ల వ్యాపారం 50 వేలకు పైగా కుటుంబాలు ఆర్గానిక్ ప్రియులే ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న శ్రద్ధ సిటీబ్యూరో: సహజ ఆహారం ఇప్పుడు మహానగర వాసుల జీవన శైలిలో భాగమైంది. సహజంగా పండించిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, బియ్యం, గోధుమలు, అపరాల వంటి ఆహారోత్పత్తులకు అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఈ తరహా ఆహారాన్ని అందించేందుకువందల కొద్దీ చిన్న, పెద్ద సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు సహకార సంఘాలు పోటీ పడుతున్నాయి. దేశ ంలోని మెట్రో నగరాల్లో ఏటా రూ.వెయ్యి కోట్ల ఆర్గానిక్ ఆహార పదార్ధాలు విక్రయిస్తున్నట్టు అంచనా. అందులో ఒక్క హైదరాబాద్‌లోనే రూ.100 కోట్లకుపైగా వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 50 వేల కుటుంబాలు సహజ ఆహార పదార్ధాలను తీసుకుంటుండగా... వాటిలో 10 వేల కుటుంబాలు ఆర్గానిక్ రుచులను మాత్రమే ఆస్వాదిస్తున్నాయి. ఏటా ఆర్గానిక్ ఆహార ప్రియుల సంఖ్య పెరుగుతోంది. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తిని, ఊరటను కలిగించడంలో పోషక విలువలు, పీచు పదార్ధాలు సమృద్ధిగా ఉండే చిరుధాన్యాలే ఉత్తమమని జనం భావిస్తున్నారు. ఈ ఆర్గానిక్ ఆహారంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివళ్లు... బిరియానీ ఘుమఘుమలతో నిత్యం పసందైన విందు భోజ నాన్ని ఆరగించే నగర వాసులు... వ్యాధులకు దూరంగా... దృఢంగా... సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బతికిన నిన్నటి తరం ఆహారపు అలవాట్లను అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాల కిందట ప్రజల ఆహారంలో ప్రధాన భాగమైన సజ్జలు, కొర్రలు, సామలు, జొన్నలు వంటి తృణధాన్యాలకు మళ్లీ ఆదరణ లభిస్తోంది. అత్యధిక కాల్షియంతో... జీవన శైలి వ్యాధుల విముక్తికి తోడ్పడే రాగులకు ఈతరం అలవాట్లలో ప్రధాన స్థానమే ఉంది. మధ్య తరగతి, ఆహార పదార్ధాలతో పాటుసబ్బులు, షాంపూలు, గానుగాడించిన వంట నూనెలు, కాస్మొటిక్స్ ‘ఆర్గానిక్ దృక్పథం’ విస్తరించింది. మొరార్కో, ఫ్యాబ్ ఇండియా, 24 లెటర్ మంత్ర, ఈకోఫుడ్స్, కాన్షియస్ ఫుడ్, నేచర్ బాస్కెట్ వంటి వ్యాపార సంస్థలు నగర వాసుల అభిరుచికి అనుగుణమైన ఆర్గానిక్ ఆహారాన్ని అందిస్తున్నాయి. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, సహజ ఆహారం, ధరణి నేచురల్స్, గ్రామీణ్ మాల్ వంటి స్వచ్ఛంద సంస్థలు, రైతు సహకార సంఘాలు... సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహార పదార్ధాలతో మహా నగరానికి... పల్లెలకు మధ్య బాటలు పరిచాయి. సూపర్ మార్కెట్లలో బ్రౌన్‌రైస్, జొన్నలు, రాగులు తప్పనిసరి విక్రయ వస్తువులయ్యాయి. ఈ వ్యాపారం ఆన్లైన్ మార్కెట్‌కూ విస్తరించింది. గుడ్సీడ్స్, ధరణి వంటి సంస్థలు ఆన్లైన్లోఆర్డర్లు స్వీకరించి నేరుగా ఇళ్లకే సరఫరా చేస్తున్నాయి. ఆర్గానిక్ ఆహార పదార్ధాల వినియోగదారులలో 10 నుంచి 15 శాతం ఆన్లైన్ మార్కెట్‌పైనే ఆధార పడుతున్నట్టు స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. సహజ ఆహారమే ఎందుకంటే... బియ్యం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, వంటనూనెలు, పప్పులు వంటి ఆహార పదార్ధాల్లో ఇటీవల కల్తీ రాజ్యమేలుతోంది. 30 ఏళ్ల క్రితమే నిషేధించిన ఇతియాన్, డీడీటీ, బీహెచ్‌సీ వంటి పురుగు మందుల అవశేషాలు ఇప్పటికీ బయటపడుతున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి వాటికి రాజధానిగా మారిన హైదరాబాద్‌లో కల్తీ ఆహారం ప్రజలను మరింత అనారోగ్యం బారిన పడేస్తోంది. చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. కల్తీ ఆహారం మేధోవికాసానికి సైతం బ్రేకులు వేస్తోంది. వైద్య నిపుణుల అంచనా మేరకు నగరంలో సుమారు 19 లక్షల మంది మధుమేహం బారిన పడగా... 25 లక్షల మందికి పైగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అనర్ధాల నుంచి బయట పడేందుకు ప్రజలు ఆర్గానిక్ ఆహారాన్ని కోరుకుంటున్నారు. పీచుపదార్ధాలు, పోషక విలువలు ఉన్న ముడిబియ్యం తీసుకొనే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. సహజమైన బియ్యం, పప్పులు, కూరగాయలు, వంట నూనెలు వంటివి రైతు క్షేత్రాల నుంచే నేరుగా హైదరాబాద్‌కు వస్తున్నాయి. మహారాష్ట్రలోని వార్ధా నుంచి గోధుమలు, యావత్మాల్ నుంచి సోయాబీన్స్, తమిళనాడు నుంచి స్వచ్ఛమైన నువ్వులు, నువ్వుల నూనె, కేరళ నుంచి సహజమైన, స్వచ్ఛమైన సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చి... నగర మార్కెట్లో విక్రయిస్తున్నారు. ధరలు కొంచెం ఎక్కువే... సాధారణ ఆహారోత్పత్తుల కంటే ఆర్గానిక్ ఆహార పదార్ధాల ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. సాధారణ సోనామసూరి బియ్యం మార్కెట్లో కిలో రూ.35 నుంచి రూ.40కు లభిస్తుండగా... ఆర్గానిక్ బియ్యం ధర రూ.80 వరకు ఉంటోంది. రెడ్‌రైస్ ధర కిలో రూ.100 పైనే ఉంది. జొన్న పిండి, సజ్జపిండి, రాగుల పిండి కిలో రూ.40 నుంచి రూ.50 చొప్పున లభిస్తోంది. 250 గ్రాముల అవిసెల ప్యాకెట్ 24 లెటర్ మంత్ర వంటి షాపుల్లో రూ.60 చొప్పున లభిస్తోంది. పల్లీ నూనె సహజ ఆహారంలో (గానుగాడించిన నూనె) రూ.180 నుంచి రూ.200 వరకు ఉంటోంది. రైతుల నుంచి ఆహార పదార్ధాలను సేకరించడం, శుద్ధి, నిల్వ చేయడం వల్ల ధరలు పెంచవలసి వస్తోందంటున్నారు నిర్వాహకులు. గానుగ పట్టించడం వల్ల వంట నూనెల ధరలు కాస్త ఎక్కువే. స్వచ్ఛమైన తేనె అరకిలో ధర రూ.180. మసాలా దినుసులు, చింతపండు, ఉప్పు, బెల్లం, చక్కెర వంటి నిత్యావసరాలు... డ్రైఫ్రూట్స్ కూడా గుడ్సీడ్స్ సంస్థ విక్రయిస్తోంది. అవిసెలకు అనూహ్య డిమాండ్ జీవన శైలి వ్యాధులు, కీళ్ల నొప్పులు, ఇతర బాధల నుంచి విముక్తి కల్పించే ఒమెగా3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారానికి డిమాండ్ బాగా పెరిగింది. ఐదారేళ్ల క్రితం నగర వాసులకు పెద్దగా పరిచయం లేని... మెగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండే అవిసెలు (ఫ్లాక్స్ సీడ్స్) కోసం నగర వాసులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మొదట్లో రూ.40కేకిలో చొప్పున లభించిన అవిసెలు ఇప్పుడు రూ.100 పైనే పలుకుతున్నాయి. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వంటి సంస్థలు తృణధాన్యాలైన పచ్చజొన్న, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, తెల్లకొర్రలు, ఎర్రకొర్రలు, తెల్లసామలు, కోడిసామలు వంటివి పండించి విక్రయిస్తుండగా... గ్రామీణ్‌మాల్ అనే మరో స్వచ్ఛంద సంస్థ ఒకప్పుడు బహుళ ఆదరణ పొందిన ఎర్ర బియ్యం (రెడ్‌రైస్)ను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తెప్పించి నగరంలో విక్రయిస్తోంది. వీటితో పాటు పెసలు, కందులు, శనగలు, ఉలవలూ (ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి) ఆదరణ పొందుతున్నాయి.