చాంప్స్ శ్రీకాంత్, సింధు
జ్వాల జోడికి డబుల్స్ టైటిల్
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్
న్యూఢిల్లీ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాలు మెరిశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో 20 ఏళ్ల శ్రీకాంత్ తొలిసారి జాతీయ సీనియర్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకోగా... 18 ఏళ్ల సింధు రెండోసారి మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. గుత్తా జ్వాల తన భాగస్వామి అశ్విని పొనప్పతో కలిసి తన ఖాతాలో 14వసారి జాతీయ టైటిల్‌ను జమచేసుకుంది. సోమవారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్, సింధు, జ్వాల తమ డిపార్ట్మెంట్ జట్టయిన పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించారు.
పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్ 21-13, 22-20తో రెండో సీడ్ గురుసాయిదత్ (ఆంధ్రప్రదేశ్-పీఎస్‌పీబీ)పై గెలుపొందాడు. ఈ టైటిల్ సాధించిన నాలుగో తెలుగు క్రీడాకారుడు శ్రీకాంత్. గతంలో పుల్లెల గోపీచంద్ (1996 నుంచి 2000 వరకు); చేతన్ ఆనంద్ (2003, 2006, 2007); కశ్యప్ (2012) ఈ ఘనత సాధించారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21-11, 21-17తో రీతూపర్ణ దాస్ (ఆంధ్రప్రదేశ్)ను ఓడించి 2011 తర్వాత మరోసారి జాతీయ చాంపియన్‌గా నిలిచింది. 30 నిమిషాల్లో తన ప్రత్యర్థి ఆట కట్టించిన సింధు ఈ టోర్నీలో ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం.
మహిళల డబుల్స్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జంట 21-17, 21-16తో సిక్కి రెడ్డి (ఆంధ్రప్రదేశ్-ఏఏఐ)-ప్రద్న్యా గాద్రె (ఏఏఐ) ద్వయంపై గెలిచి 2009 తర్వాత మరోసారి జాతీయ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. ఈ విజయంతో జ్వాల-అశ్విని గత ఆదివారం టాటా ఓపెన్ ఫైనల్లో సిక్కి-ప్రద్న్యా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఓవరాల్‌గా జ్వాలకిది 14వ జాతీయ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్)-మనూ అత్రి (ఏఏఐ) ద్వయం 19-21, 17-21తో ప్రణవ్ చోప్రా (పీఎస్‌పీబీ)-అక్షయ్ దివాల్కర్ (ఎయిరిండియా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ (పీఎస్‌పీబీ) జోడి 21-10, 21-17తో తరుణ్ (పీఎస్‌పీబీ)-అశ్విని జంటను ఓడించి విజేతగా నిలిచింది.