breaking news
Naruda Donoruda
-
లవ్‌లో సస్పెన్స్!
ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. జీవితం చాలా అందంగా సాగుతోంది. ఇంతలో చిన్న కుదుపు. ఆ చిన్ని సంఘటన ఇద్దరి జీవితాల్లో పెను మార్పుకు కారణం అవుతుంది. అదేంటి? అనేది తర్వాత చెబుతామంటున్నారు నవీన్‌చంద్ర. ‘అందాల రాక్షసి’తో మంచి పేరు తెచ్చుకుని, వరుసగా సినిమాలు చేస్తోన్న నవీన్ ప్రస్తుతం ఓ లవ్‌స్టోరీలో నటిస్తున్నారు. ఇందులో శాలిని వడినికట్టి కథానాయిక. ‘క్షణం’ చిత్రం సహదర్శకుడు, ‘నరుడా డోనరుడా’ సినిమా లైన్ ప్రొడ్యూసర్ అయిన అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయి అభిషేక్ నిర్మాత. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కొత్త కథ, సరికొత్త కథనంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రేమకథా చిత్రమైనా ప్రేక్షకుల ఉహకందని సస్పెన్స్ ఉంటుంది. ఖర్చు, నాణ్యత విషయంలో పెద్ద సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా రూపొందిస్తున్నాం. 80% చిత్రీకరణ పూర్తయింది. దాదాపు 40% షూటింగ్ విదేశాల్లో చిత్రీకరించాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: శ్రవణ్. -
అది మా కుటుంబంలోనే లేదు!
‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సుమంత్ ‘నరుడా.. డోనరుడా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హిందీ ‘విక్కీ డోనర్’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని మల్లిక్‌రామ్ దర్శకత్వంలో వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మించారు. పల్లవీ సుభాష్ కథానాయిక. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘నరుడా.. డోనరుడా’ గురించి సుమంత్ మాట్లాడుతూ- ‘‘ ‘గోల్కొండ హైస్కూల్’ తర్వాత నా మూడు సినిమాలు సరిగ్గా ఆడలేదు. దాంతో కెరీర్జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలనుకున్నా. ఓ రోజు టీవీలో ‘విక్కీ డోనర్’ చూసిన తాతయ్య (ఏయన్నార్) చాలా బాగుందన్నారు. అటువంటి వైవిధ్యమైన కథలు రాయమని రచయితలకు చెప్పేవాణ్ణి. నిర్మాత రామ్మోహన్‌గారు దర్శకుడు మల్లిక్‌ను పరిచయం చేశారు. మల్లిక్ విజన్ ఉన్న డెరైక్టర్. వీర్యదానం నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదంతో పాటు సందేశం ఉంటుంది. సినిమాలో ఎక్కడా అసభ్యత ఉండదు. రెగ్యులర్ చిత్రాలు చేయడం మా కుటుంబంలోనే లేదు. ఎప్పుడూ కొత్తవి ట్రై చేస్తుంటాం. రావణాసురుడు, దుర్యోధనుడి తరహా విలన్ పాత్రలు చేయాలనుంది. ఎన్టీఆర్, చిరంజీవి, మోహన్బాబుగార్లు తొలుత విలన్‌గా నటించి, సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఈ చిత్రం విడుదల తర్వాత పూర్తి వివరాలు చెబుతా’’ అన్నారు.