breaking news
narla tata rao thermal power station
-
ఇటుకలు దొరకడం లేదు...!
రాజధానిలో ఫ్లైయాష్ ఇటుకలనే వాడాలి డిమాండ్‌కు సరిపడా లేని ఫ్లైయాష్ సరఫరా రోజుకు 2,000 టన్నుల డిమాండ్ సరఫరా 600 టన్నులకే పరిమితం సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని అమరావతికి ఇటుకల కొరత సమస్యగా మారింది. రాజధాని చుట్టుపక్కల నిర్మాణ రంగ పనులకు అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉండటం లేదు. తాత్కాలిక సచివాలయం నుంచి ప్రభుత్వ పరిపాలన మొదలు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు వేగవంతమవుతాయని భావిస్తున్నారు. అయితే వీటన్నింటికీ కావాల్సిన ఇటుకల సరఫరా కష్టంగా కనిపిస్తోంది. చట్ట ప్రకారం థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్న 100 కి.మీ పరిధిలో నిర్మాణ రంగంలో కేవలం ఫ్లైయాష్ ఇటుకలనే వాడాల్సి ఉంది. మట్టితో చేసిన ఇటుకలను వాడటానికి వీలు లేదు. రాజధాని ప్రాంతం విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(వీటీపీఎస్)కు కేవలం 10 కి.మీల దూరంలో ఉంది. దీంతో ఇక్కడ ఫ్లైయాష్ ఇటుకలనే వాడాల్సి ఉంది. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా ఫ్లైయాష్ ఇటుకల సరఫరా కావడం లేదు. ఫ్లైయాష్ సరఫరా లేదు... ఇటుకలు తయారు చేయడానికి తగినంత ఫ్లైయాష్‌ను విద్యుత్ కేంద్రాలు సరఫరా చేయడం లేదని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ఫ్లైయాష్ బ్రిక్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 300 పైగా ఫ్లైయాష్ బ్రిక్స్ యూనిట్లున్నాయని, వీటికి రోజుకు 2,000 టన్నుల ఫ్లైయాష్ అవసరమైతే కేవలం 500 నుంచి 600 టన్నులు మాత్రమే సరఫరా ఉంటోందని ఏపీ ఫ్లైయాష్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కె.వి.సుబ్బారావు వివరించారు. విజయవాడ వీటీపీఎస్ నుంచి రోజుకు సుమారు 8వేల టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతోందని, ఇందులో సిమెంట్ ఫ్యాక్టరీలకు 3వేల టన్నులు పోగా మిగిలిన ఫ్లైయాష్‌ను బ్రిక్స్ యూనిట్లకు ఇవ్వడానికి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. థర్మల్‌పవర్ స్టేషన్లకు ఫ్లైయాష్‌ను వదిలించుకోవడం అతిపెద్ద సమస్య. అందుకే ఫ్లైయాష్‌ను బ్రిక్ యూనిట్లకు ఉచితంగా సరఫరా చేయడమే కాకుండా, తీసుకెళ్లినందుకు రవాణా ఖర్చులూ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే చాలా థర్మల్ యూనిట్లు ఉచితంగా కొంత ఇచ్చినట్లు రికార్డుల్లో చూపి, మిగిలిన మొత్తాన్ని ఫ్లైయాష్ పాండ్స్‌లోకి తరలిస్తున్నాయి. ఇందుకోసం పెద్దఎత్తున మంచి నీటిని వృథా చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 వేలకు పైగా ఫ్లైయాష్ యూనిట్లున్నాయి. వీటికి సగటున రోజుకు 20వేల టన్నుల ఫ్లైయాష్ అవసరమవుతుంది. కానీ ఈ స్థాయిలో ఫ్లైయాష్ సరఫరా లేదని బ్రిక్స్ యాజమాన్యం వాపోతోంది. నిర్మాణ రంగ కంపెనీలు ప్రత్యామ్నాయంగా మట్టి ఇటుకలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందువల్ల సారవంతమైన మట్టి వృథా కావడమే కాకుండా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టిసారించాలని ప్లైయాష్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. -
ఇటుకలు దొరకడం లేదు...!
-
హామీలతో ఆమోద ముద్ర
సాక్షి, విజయవాడ, ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : స్థానికుల తీవ్ర నిరసనను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్టీటీపీఎస్ తన పంతం నెగ్గించుకొంది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో నూతనంగా నిర్మించబోయే 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రంపై శుక్రవారం భారీ పోలీసు బలగాల మధ్య కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయసేకరణ జరిపి ఆమోదముద్ర వేయించుకోగలిగారు. ఇబ్రహీంపట్నంలోని థర్మల్ కేంద్రం గ్రౌండ్లో ఉదయం 11.30కి ప్రజాభిప్రాయ సదస్సు ప్రారంభమైంది. ఎన్టీటీపీఎస్ నుంచి వస్తున్న కాలుష్యం వల్ల బాధపడుతున్న 10 గ్రామాల ప్రజలు ‘రాజకీయ పార్టీల ఐక్యకార్యాచరణ వేదిక’గా ఏర్పడి ప్రజాభిప్రాయసేకరణలో తీవ్ర నిరసన తెలిపారు. వేదిక ముందే బైఠాయించి ఎన్టీటీపీఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్టీటీపీఎస్ డౌన్‌డౌన్, మాకొద్దు ఈ ప్రాజెక్టు.. అంటూ నినాదాలు చేశారు. ఎన్టీటీపీఎస్లో మరో కొత్త ప్లాంట్ ఏర్పాటుచేసి తమ జీవితాలను బుగ్గి చేయొద్దని మహిళలు డిమాండ్ చేశారు. ఒక దశలో స్థానికులతో అధికారులు మినిట్స్ పుస్తకాల్లో సంతకాలు పెట్టించి సమావేశాన్ని మొక్కుబడిగా ముగించేందుకు చేసిన యత్నాలను ప్రజలు తిప్పికొట్టారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే సభ రసాభాసగా మారింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. సభాస్థలి వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని స్థానికుల్ని శాంతింపజేశారు. ఒకదశలో పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన ఏపీ జెన్కో అధికారులు ప్రజల డిమాండ్లను అంగీకరిస్తూ లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో సభ ప్రశాంతంగా ముగిసింది. సమావేశంలో ఏపీ జెన్కో మేనేజింగ్ డెరైక్టర్ విజయానంద్, జెన్కో డెరైక్టర్ సి.రాధాకష్ణ, వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీఎల్ శాస్త్రి, కలెక్టర్ రఘునందన్‌రావు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, సబ్ కలెక్టర్ హరిచందన, ఎన్టీటీపీఎస్ సీఈ సమ్మయ్య, ఎంపీడీవో లక్ష్మీకుమారి, తహశీల్దారు ఎం.మాధురి, వ్యవసాయ అధికారి లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు : జోగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించిన తర్వాతే ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలంటూ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ సదస్సులో పట్టుబట్టారు. లక్షా 50వేల మంది ప్రజలున్న ఇబ్రహీంపట్నం మండలంలో కేవలం 120 మంచినీటి కుళాయిలు వేశామని చెప్పడానికి అధికారులు సిగ్గుపడాలంటూ ఆయన ధ్వజమెత్తారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, తమతోను, తమ పిల్లల భవిష్యత్తుతోనూ ఆటలాడుకోవద్దని ఆయన సూచించారు. 20 అంశాలపై అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మేడపాటి నాగిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ అంక మోహనరావు, కాంగ్రెస్ నాయకులు అక్కల గాంధీ, ఆవుల సీతారామయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు రామినేని రాజశేఖర్, బీజేపీ నేత రేగళ్ల రఘునాథ్‌రెడ్డి, సీపీఐ నాయకుడు పి.తాతయ్య, ఇబ్రహీంపట్నం ప్రముఖులు మల్లెల పద్మనాభరావు, సర్పంచి అజ్మీర స్వర్ణ, కొండపల్లి సర్పంచి అమ్మాజీ, ఈలప్రోలు సర్పంచి మిరియాల చినరామయ్య, జూపూడి సర్పంచి నల్లమోతు దుర్గారావు, జి.ప్రసాద్, ఎ.విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.