breaking news
NALLAJARLA MANDAL
-
160 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, పశ్చిమ గోదావరి: నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద పోలీసుల వాహన తనిఖీలో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి గుట్టు రట్టయింది. నర్సీపట్నం నుంచి హైదరాబాదు 80ప్యాకెట్లలో దాదాపు 160కిలోల గంజాయిని నీలిరంగు క్రిటా కారులో తరలిస్తుండుగా గురువారం సాయంత్రం పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. ఈగంజాయి అక్రమ రవాణాలో ఒక మహిళ, మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న టీఎస్ 07 యూహెచ్ 3658 నీలిరంగు క్రిటా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఈ కారు నర్సీపట్నం నుంచి బయలుదేరి తణుకు, తాడేపల్లిగూడెం బైపాస్ మీదుగా వెళ్తుండుగా చేబ్రోలు వద్ద వాహన తనిఖీలు జరుగుతున్నట్టు ఈ ముఠాకు సమాచారం అందడంతో తాడేపల్లిగూడెం రూరల్ మండలం నుండి తెలికిచెర్ల–అనంతపల్లి–కొయ్యలగూడెం మీదుగా ఖమ్మం వెళ్ళేందుకు ప్లాను చేసుకున్నారు. అనంతపల్లి సెంటర్లో కారును రోడ్డుపక్కన పెట్టి టీ తాగేందుకు ఆగారు. అటుగా వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ళు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో విషయం బయటపడింది. తాడేపల్లిగూడెం టౌన్ సీఐ ఆకుల రఘు, నల్లజర్ల ఎస్ఐ కె.చంద్రశేఖర్ కేసునమోదు చేసారు. ముద్దాయిలను అరెస్టు చేయాల్సి ఉంది. -
వ్యవసాయానికి 11 గంటల విద్యుత్
నల్లజర్ల : మెట్ట ప్రాంతంలో వర్షాలు లేక ఎండిపోతున్న వరి పంటను రక్షించేందుకు 11 గంటల వ్యవసాయ విద్యుత్‌ను అందించేందుకు కలెక్టర్ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారని వ్యవసాయశాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి తెలిపారు. ఈ విధానం సోమవారం నుంచే అమలు కానుందన్నారు. ఆదివారం ఆమె పోతవరం, అనుమనిలంక, సుబధ్రపాలెం గ్రామాల్లో నీరందక ఎండిపోతున్న వరి పైరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోపాలపురం నుంచి కొయ్యలగూడెం మీదుగా పోతవరం వచ్చే తాడిపూడి లిఫ్ట్–3 ద్వారా పూర్తి స్థాయిలో నీరందించేలా సంబంధిత అధికారులతో మాట్లాడారు. మెట్ట ప్రాంతంలో ఎక్కడైనా పంటలు దెబ్బతినే పరిస్థితి ఉంటే సంబంధిత వ్యవసాయాధికారి దృష్టికి తీసుకువచ్చి అక్కడ ఉన్న నీటి వనరులను సద్వినియోగపర్చుకోవాలన్నారు. వ్యవసాయశాఖ ద్వారా ఆయిల్ ఇంజిన్లు, రెయిన్ గన్స్, స్పింక్లర్లు యుద్ధప్రాతిపదిక అందించనున్నట్టు చెప్పారు. నల్లజర్ల మండలంలో 20 రెయిన్‌గన్స్ అందుబాటులో ఉంచుతున్నామని అత్యవసరమనుకున్న వారు వాటిని తీసుకెళ్లి వినియోగించుకోవచ్చని చెప్పారు. మండలంలో 500 హెక్టార్లలో వరి ఎండిపోయే పరిస్థితి ఉందని, దాంట్లో 300 హెక్టార్లు తాడిపూడి కాలువ కిందే ఉందన్నారు. వ్యవసాయ విద్యుత్ పెంచడం, తాడిపూడి కాలువ ద్వారా సత్వరం నీరందితే ఈ పంటను దక్కించుకోగలుగుతామన్నారు. ఆమె వెంట ఏవో సోమశేఖరం, ఎంపీఈవో యజ్ఞ శ్రీలత, రైతులు కానూరి వెంకటరత్నం,కరుటూరి రామకృష్ణ,పెండ్యాల గిరి, ప్రత్తిపాటి వెంకటేశ్వరావు పాల్గొన్నారు.