breaking news
nadendla mandal
-
తల్లి పొత్తిళ్లలో ఓలలాడాల్సిన నెలరోజుల పసికందును..
నాదెండ్ల(చిలకలూరిపేట): కన్నతల్లి పొత్తిళ్లలో ఓలలాడాల్సిన నెలరోజుల పసికందును కర్కశంగా హతమార్చిన అమానుష ఘటన గురువారం గుంటూరు జిల్లాలో సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన పోతురాజు శ్రీనివాసరావు, లక్ష్మి దంపతుల కుమారుడు గోపీకృష్ణ మంగళగిరిలోని ఓ సెల్షాపులో పనిచేస్తుంటాడు. వారానికోసారి ఇంటికి వచ్చిపోతుంటాడు. తెలంగాణకు చెందిన ఝాన్సీరాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. నవంబర్ 1న వీరికి ఓ బాబు జన్మించాడు. బుధవారం ఎప్పటిలానే అత్తమామలతో కలిసి ఝాన్సీరాణి భోజనం ముగించుకుని నిద్రించింది. అయితే తెల్లవారుజామున లేచి చూసే సరికి.. తన పక్కలో ఉండాల్సిన శిశువు ఇంటి ఎదురుగా ఉన్న నీటి తొట్టెలో విగతజీవిగా కనిపించడంతో ఆమె షాక్కు గురైంది. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, రూరల్ సీఐ కె.సుబ్బారావు, నాదెండ్ల ఎస్ఐ కె.సతీష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. భర్త గోపీకృష్ణ గ్రామానికి చేరుకున్నాడు. శిశువు తండ్రి గోపీకృష్ణను డీఎస్పీ విజయభాస్కరరావు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కంటైనర్ను ఢీకొన్న కారు : నలుగురి మృతి
గుంటూరు : గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద శుక్రవారం ఆగిఉన్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా...మరో ఇద్దరు చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు ప్రాంతానికి చెందిన వారని పోలీసులు చెప్పారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.