అనుకున్నది జరగదు
మనం చాలా అనుకుంటాం. అవన్నీ సినిమాలో జరగవు అంటోంది వర్ధమాన నటి మృదులా భాస్కర్. ఈ తమిళ అమ్మాయి వల్లినం చిత్రంతో తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే విజయాన్నందుకున్న సంతోషంలో తేలిపోతున్న ఈ బ్యూటీతో చిన్న భేటి.
ప్ర: వల్లినం చిత్రంలో అవకాశం ఎలా దక్కించుకున్నారు?
జ: దర్శకుడు అరివళగన్ వల్లినం చిత్రంలో నకుల్ సరసన నటించే హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. వెళ్లాను. అడిషన్ చేశారు. సెలక్ట్ అయ్యాను. నటనతోపాటు మంచి డ్యాన్స్, అలాగే పాడడం తెలుసు. ఇవన్నీ నాకు సైడ్ అట్రాక్షన్‌గా నిలిచాయని భావిస్తున్నాను. షూటింగ్లో దర్శకుడు చెప్పింది చెడగొట్టకుండా చేశాను. ఇప్పుడు మంచి పేరు వచ్చింది.
ప్ర: చిత్రంలో ఒక పాటలో గ్లామరస్‌గా నటించడం గురించి?
జ : నకుల్ - నేను కలిసి నటించిన ఆ పాటను కోవలం బీచ్‌లో చిత్రీకరించారు. ఆ పాటను ఎంత నాగరికంగా చిత్రీకరించాలో అంత బాగా తెరకెక్కించారు. మీరంటున్నట్లు అందులో అంత గ్లామరస్ కనిపించదు.
ప్ర: తదుపరి చిత్రాల గురించి?
జ: చాలా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో మరు ముణై, తిలకర్ చిత్రాలు చేస్తున్నాను. తెలుగులో సంత చూడు ఎంత బాగుంది చిత్రంలో నటిస్తున్నాను. ఇది తమిళ చిత్రం కుళ్లనరి కూట్టం చిత్రానికి రీమేక్.
ప్ర: తెలుగులో ఎక్కువగా గ్లామర్‌గా నటించాలంటారే?
జ: నిజానికి అలాంటిదేమీ లేదు. ఏ హీరోయిన్‌కు ఎలాంటి పాత్ర ఇవ్వాలన్నది వారికి తెలుసు. నేను ఒప్పందం చేసుకున్నప్పుడే శృతిమించిన గ్లామర్‌గా నటించనని దర్శక నిర్మాతలకు చెప్పాను. వాళ్లూ అంగీకరించారు.
ప్ర: సినిమాను అంగీకరించే ముందు ఎలాంటి కండిషన్స్ విధిస్తారు?
జ : ఇప్పటి వరకు కండషన్స్ అంటూ ఏమీ విధించలేదు. చిత్ర కథ విన్నప్పుడు అందులోని సన్నివేశాల్లో నటించడం నాకు సౌకర్యంగా ఉంటుందా? అని ఆలోచిస్తాను. బాగా ఉందని అనిపిస్తే ఓకే అంటాను.
ప్ర: మీకు స్ఫూర్తినిచ్చిన నటీమణులెవరన్నా ఉన్నారా? వారి గురించి?
జ: నటి వైజయంతి మాల నటన అంటే చాలా ఇష్టం. అలాగే నటి శ్రీదేవి నటన, స్టైల్, మేనరిజం నచ్చుతాయి. వీరిద్దరినీ స్ఫూర్తిగా భావిస్తాను. సినిమాలో అనుకున్నవన్నీ జరగవుగా, అందివచ్చిన అవకాశాల్లో మంచి వాటిని అంగీకరించి అంకిత భావంతో నటిస్తాను.