breaking news
mpcc president
-
కాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీలోకి అధ్యక్షుడు, 8 మంది ఎమ్మెల్యేలు
ఇంపాల్: దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా మరో రాష్ట్రంలో భారీ షాక్ తగిలింది. ఈశాన్య రాష్ట్రల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న కమల పార్టీ ధాటికి కాంగ్రెస్ కుదేలవుతుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్ష పదవికి గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పూడ్చలేని నష్టమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గోవిందాస్ కొంతౌజమ్ వరుసగా ఆరు సార్లు బిష్నాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంపీసీసీకి చీఫ్ విప్‌గా కూడా పని చేశారు. గతేడాది డిసెంబర్లో సోనియా గాంధీ ఆయనను మణిపూర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా నియమించారు. నెల క్రితం వరకు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేసిన గోవిందాస్ ఇంత అనూహ్యంగా పార్టీ మారుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. -
రుణమాఫీపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
♦ ఈ నెల 9,10 తేదీల్లో చేపడతాం: అశోక్ చవాన్ ♦ మాఫీపై ప్రభుత్వం ఎందుకు కినుక వహిస్తోందని వ్యాఖ్య సాక్షి, ముంబై : రైతుల రుణ మాఫీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 9, 10వ తేదీల్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టనున్నట్లు ఎంపీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్ వెల్లడించారు. ముంబైలోని గాంధీభవన్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది మొదటి అయిదు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 1059 రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ప్రభుత్వం ప్రకటించిందని, ప్రత్యక్షంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశముందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో ఎక్కువ మంది అప్పుల బాధతోనే తనువు చాలించినట్లు తెలిసిందన్నారు. రైతులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులకు రుణాల మాఫీ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటన చేయడం లేదని నిలదీశారు. రైతుల రుణమాఫీ విషయమై ఈ నెల తొమ్మిది, 10వ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపడతామని చవాన్ పేర్కొన్నారు. ఈ బాధ్యతలను జిల్లా కాంగ్రెస్ నాయకులు అప్పగించామన్నారు. సతారా జిల్లాలో మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలో జరుగుతాయని, సింధుదుర్గా, ర త్నగిరి జిల్లాలలో జరిగే ఆందోళనకు మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే నేతృత్వం వహించనున్నారని చెప్పారు. అహ్మద్‌నగర్-ఔరంగాబాద్ జిల్లాల్లో ప్రతిపక్ష నాయకుడైన రాధకృష్ణ విఖేపాటిల్ నేతృత్వంలో ప్రదర్శనలు నిర్వహిస్తామని వెల్లడించారు. -
దేశ్‌ముఖ్‌కే పట్టం!
- మండలి చైర్మన్ ఎన్నికల బరిలో దిగని మహాకూటమి - దీంతో ఏకగ్రీవంగా ఎన్నిక కానున్న శివాజీరావ్ - ఎన్నికల నేపథ్యంలో నేడు సమావేశం కానున్న మండలి - చైర్మన్ ఎన్నికపై అధికారికంగా వెలువడనున్న ప్రకటన సాక్షి, ముంబై: విధానమండలి చైర్మన్ పదవి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి శివాజీరావ్ దేశ్‌ముఖ్‌నే వరించనుందా? ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారా? బుధవారం దాఖలైన నామినేషన్ల తీరు చూస్తే దాదాపు అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మండలి చైర్మన్ పదవి కోసం శివాజీరావ్ మినహా మరెవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు దాదాపుగా ఖరారైందని చెప్పవచ్చు. మండలి చైర్మన్ ఎన్నిక కోసం నేడు ఒకరోజుపాటు విధాన మండలి సమావేశం కానుంది. అనంతరం శివాజీరావ్‌ను చైర్మన్‌గా ప్రకటిస్తూ అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శివసేన, బీజేపీ, ఆర్పీఐల మహాకూటమి తమ అభ్యర్థిని మండలి చైర్మన్ పదవి కోసం బరిలోకి దింపనుందనే వార్తల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. చివరకు మహాకూటమి తరఫున ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో శివాజీరావ్ ఎన్నిక దాదాపుగా ఖరారైంది. కాంగ్రెస్, ఎన్సీపీ నేతల సమక్షంలో దేశ్‌ముఖ్ నామినేషన్ వేశారు. ఆయన వెంట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు ఉన్నారు. ఈ పదవికి మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో దాదాపుగా ఆయన ఎన్నికైనట్లు భావించిన కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు శివాజీరావ్ దేశ్‌ముఖ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పట్టునిలుపుకున్న ముఖ్యమంత్రి... విధానమండలి చైర్మన్ ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తనపట్టును నిలుపుకున్నారు. శివాజీరావ్ దేశ్‌ముఖ్‌కే మరోసారి చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు చవాన్ తీవ్రంగా ప్రయత్నించారు. మరోవైపు ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్‌ఠాక్రే, మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ మోహన్ ప్రకాష్లిద్దరు దళిత నేత, ఎమ్మెల్యే శరద్ రణ్పిసేను విధానమండలి చైర్మన్‌గా చేయాలని ప్రయత్నించారు. ఇలా పృథ్వీరాజ్ చవాన్ వర్గం, మాణిక్‌రావ్ ఠాక్రే వర్గంవారు తమదైన పద్దతుల్లో తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు మళ్లీ శివాజీరావ్ దేశ్ముఖ్వైపే అధిష్టానం మొగ్గుచూపింది. దీంతో మాణిక్‌రావ్ వర్గం కొంత వెనక్కు తగ్గింది. దేశ్‌ముఖ్‌ను చైర్మన్ చేసేందుకు బీజేపీ విధానమండలి ప్రతిపక్ష నాయకుడైన వినోద్ తావ్డేతోపాటు శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే పీఏ మిలింద్ నార్వేకర్లతో చవాన్ సమావేశమయ్యారని, మహాకూటమి అభ్యర్థిని బరిలోకి దింపకుండా వారితో మాట్లాడారని సమాచారం. ఎలాంటి విభేదాలు లేవు... మాణిక్‌రావ్ ఠాక్రే విధాన మండలి చైర్మన్ ఎన్నికల విషయంలో ఎలాంటి విభేదాలు లేవని ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్‌ఠాక్రే పేర్కొన్నారు. విధాన మండలి చెర్మైన్ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి, ఎంపీసీసీ అధ్యక్షుల మధ్య అంతర్గత విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. చైర్మన్ పదవికి శివాజీరావ్ పేరును ముందుగా తానే సిఫారసు చేశానని చెప్పారు. చవాన్ కూడా ఆయనకే మద్దతు పలికారని, శరద్ రణ్పిసే పేరును తాను ప్రతిపాదించలేదని, అదంతా మీడియా సృష్టేనన్నారు. దేశ్‌ముఖ్‌కు అభినందనలు... విధాన మండలి చైర్మన్‌గా శివాజీరావ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం దాదాపు ఖరారైన సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్‌తోపాటు ఎన్సీపీ నాయకులు ఆయనను అభినందనలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ నాయకులు వసంత్ డావ్కరేతోపాటు పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.