breaking news
mou on godavari barrages
-
కుదిరిన ‘మహా’ ఒప్పందం
♦ అంతర్రాష్ట ప్రాజెక్టులపై చేతులు కలిపిన తెలంగాణ-మహారాష్ట్ర ♦ ఒప్పందంపై ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, ఫడ్నవీస్ సంతకాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ముంబైలోని సహ్యాద్రి అతిథి గృహంలో మంగళవారం ఉదయం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య గతంలో కుదిరిన ప్రాజెక్టుల ఒప్పందాలు, భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టుల పరిశీలనకు అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటుపై ఈ ఒప్పందం కుదిరింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారులు డి.శ్రీనివాస్, ఆర్.విద్యాసాగర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీశ్ మహాజన్, అక్కడి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సతీష్ ఎం గవాయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్రాష్ట మండలి ఏర్పాటు తాజా ఒప్పందంతో రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల నిర్మాణంలో అంతర్రాష్ట్ర మండలి క్రియాశీల పాత్ర పోషిస్తుంది. గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్-1979 (తదుపరి నివేదిక 1980) తీర్పులకు అనుగుణంగా.. రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణాన్నింటికీ ఈ బోర్డు పర్యవేక్షణ సంస్థగా పని చేస్తుంది. లెండి, ప్రాణహిత (తుమ్మిడిహెట్టి బ్యారేజీ), కాళేశ్వరం (మేడిగడ్డ బ్యారేజీ) ప్రాజెక్టులతోపాటు, పెన్‌గంగపై రాజాపేట బ్యారేజీ, ఛనాఖా-కొరటా బ్యారేజీ, పెన్‌పహాడ్ బ్యారేజీ, లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలను బోర్డు పర్యవేక్షిస్తుంది. సందేహాలు, అనుమానాలు, సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తుంది. మహారాష్ట్ర-ఉమ్మడి ఏపీ మధ్య గతంలో జరిగిన ఒప్పందాలను కూడా ఈ బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది. బోర్డుకు ఒక ఏడాది తెలంగాణ సీఎం, మరుసటి ఏడాది మహారాష్ట్ర సీఎం చైర్మన్‌గా ఉంటారు. ఒక ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉన్న కాలంలో మరో సీఎం కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రులు, అటవీ శాఖల మంత్రులు, కేంద్ర జల వనరుల శాఖ ప్రతి నిధి, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, ఆర్థిక శాఖ, రెవిన్యూ శాఖ, అటవీ శాఖ కార్యదర్శులు, మహారాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఈడీ, తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ, రెండు రాష్ట్రాల సీసీఎఫ్లు సభ్యులుగా ఉంటారు. బోర్డు ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంటుంది. హైదరాబాద్, ముంబైలలో బోర్డు సమావేశాలు జరుగుతాయి. హైదరాబాద్‌కు రండి.. ఈ ఒప్పందాలతో రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ఓట్లు వేయించుకున్నారు తప్ప కట్టలేదని, కానీ ఇప్పుడు నిజరూపం దాలుస్తున్నాయన్నారు. ‘‘తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మీరు(మహారాష్ట్ర) చెప్పినట్లే నడుచుకుంటాం. మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ నిర్వహించిన సర్వే నివేదికను మహారాష్ట్రకు అందించాం. అక్కడ బ్యారేజీ ద్వారా నిల్వ ఉండే నీటిని మహారాష్ట్ర కూడా వాడుకోవచ్చు. గడ్చిరోలి వంటి వెనుకబడిన జిల్లాలకు తరలించవచ్చు. ఈ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వీలైనంత త్వరలో బోర్డు మీటింగ్ పెట్టుకుందాం. ఇప్పుడున్న నీటిని వృథాగా పోనివ్వకుండా వేసవికి ఉపయోగించుకునే చర్యలు చేపట్టాలి. మీరు అనుమతిస్తే వెంటనే పనులు మొదలుపెడతాం. చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగుతాయి. అన్ని అంశాల్లో కలిసి నడుద్దాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను హైదరాబాద్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ తినిపిస్తాం. మీరు రావడం మా అదృష్టం...’’ అని సీఎం అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కీలకం: ఫడ్నవీస్ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కీలకమని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అన్నారు. దేశాల మధ్యే నీటి పంపకాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల మధ్య సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవడం ఎందుకు సాధ్యం కాద న్నారు. ఈ ఆలోచనతోనే తెలంగాణ, మహా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయన్నారు. ‘‘కొత్తగా ఏర్పడ్డ తెలంగాణతో మహారాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాది క్రితం తెలంగాాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వచ్చినప్పుడు వీటిపై చర్చ జరిగింది. మహారాష్ట్రను మిత్ర రాష్ట్రంగా చూస్తున్నామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మహారాష్ట్రతో వివాదాలు ఉండేవని, తెలంగాణ రాష్ట్రం అలా ఉండదని స్పష్టం చేశారు. మనం ఒకే దేశంలో ఉన్న ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లం. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరగాలి. అదే ఆలోచనతో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ముందు కు పోతున్నాం’’ అని చెప్పారు. చరిత్రలో మహత్తర అధ్యాయం: కేసీఆర్ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ఈ ఒప్పందం రెండు రాష్ట్రా ల చరిత్రలో ఓ మహత్తర అధ్యాయమని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రాలు వేరైనా మొదట భారతీయులమని, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఘర్షణపూరిత వాతావరణంలో కాకుండా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. ప్రాజెక్టుల ఒప్పందంపై సంతకాల అనంతరం మహా రాష్ట్ర సీఎంకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే పోరాటం చేసినం. ప్రజలకు ఎన్నో ఆకాంక్షలున్నాయి. సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో ఘర్షణాత్మక వైఖరితో ఉండాలనుకోవటం లేదు. భగవంతుడి దయ వల్ల గోదావరిలో చాలా నీళ్లున్నాయి. 2వేల నుంచి 4వేల టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా పోతోంది. ఇదే విషయాన్ని ఏపీ సీఎంకు చెప్పాను. గోదావరి నీటిని మహారాష్ట్ర ఉపయోగించుకున్న తర్వాత మేం ఉపయోగించుకుంటాం. మా తర్వాత ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. మహారాష్ట్రతో తెలంగాణకు చాలా పొడవైన సరిహద్దుంది. వారితో సామరస్యపూర్వక సంబంధాలు కోరుకుంటున్నాం’’ అని అన్నారు. -
హైదరాబాద్ రండి.. మా బిర్యానీ పెడతాం: కేసీఆర్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి, అధికారులు అందరూ హైదరాబాద్ రావాలని.. వస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాదీ బిర్యానీ పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తమకు పొరుగు రాష్ట్రాలన్నింటితో సత్సంబంధాలు కావాలని, ఏ రాష్ట్రంతోనూ కొట్లాడబోమని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.. అన్నింటితోనూ మంచి సంబంధాలే కోరుకుంటున్నట్లు చెప్పారు. గోదావరి నదిపై ఐదు బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం కుదిరింది. తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమక్షంలో ఎంఓయూ మీద సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ప్రధానంగా నీళ్లు, ఉద్యోగాలు వస్తాయని ప్రజలకు చెప్పామని గుర్తుచేశారు. అలా నీళ్లు ఇవ్వడంలో ఇప్పుడు పడినది పెద్ద ముందడుగని అన్నారు. గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయని, మనం మనం గొడవపడితే ప్రయోజనం ఉండదని, కొన్ని నీళ్లు మహారాష్ట్ర వాడుకుంటే కొంత మనం వాడుకుందామని ఏపీ ముఖ్యమంత్రికి కూడా చెప్పానని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం వల్ల రెండు రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై ఐదు బ్యారేజీలు కడతారని, నీళ్ల పంపిణీ విషయంలో ఇది మంచి ముందడుగు అవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణకు కూడా దీనివల్ల మేలు కలుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.