వైఎస్సార్సీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు
తాడేపల్లి: రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శ్రీనివాసరావు పార్టీలో చేరారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో శ్రీనివాసరావుకు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. మోపిదేవితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. అందర్నీ ఆహ్వానించి పార్టీ కోసం పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. చేరికల సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యాలయం కార్యకర్తలతో కిటకిటలాడింది. దీనిలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘మోపిదేవి శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. నా మీద నమ్మకం ఉంచి పార్టీలోకి వచ్చారు. శ్రీనుకి అన్ని రకాలుగా న్యాయం చేస్తాను. రేపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జి మోహన్ కృష్టకు మీ మద్దతు ఇవ్వాలి. మోహన్ కృష్ణ గెలుపు బాధ్యతలు తీసుకుని గెలిపించాలి. మోపిదేవి శ్రీను చేసే మంచిని జగన్ ఎన్నటికీ మరువడు. అదే చట్ట సభలో కుర్చీ వేసి కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తా. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎక్కువ మంది కార్యకర్తలను పరిచయం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయండి. అందరికీ హృదయపూర్వక అభినందనలు* అని పేర్కొన్నారు.