తుపాకీ పేలి ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో తుపాకీ పేలి గుళ్లు తలలోంచి దూసుకుపోవడంతో ఓ ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం పొద్దుటూరుకు చెందిన ఖాజా మోహినుద్దీన్(47) 1999లో పోలీస్ విభాగంలో చేరాడు. ఇతనికి భార్య రహెనాబేగం, ఒక కూతురు ఉంది. కొండాపూర్ కొత్తగూడలో ఉంటున్నారు. అంబర్‌పేట పోలీసు ట్రైనింగ్ సెంటర్లోని సైబరాబాద్ ఏఆర్ కేంద్రంలో ఆదివారం గార్డుగా విధులు నిర్వహించేందుకు వచ్చాడు. ఇతనితో పాటు కానిస్టేబుల్ నాగరాజు, రమేశ్, అలీముద్దీన్, నాగభూషణం విధుల్లో ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఖాజా మోహినుద్దీన్ పడుకున్న వైపు నుంచి తుపాకీ పేలిన శబ్దం వచ్చింది.
దీంతో తోటి సిబ్బంది ఏం జరిగిందని గదిలో పరిశీలించగా ఖాజా రక్తం మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఖాజా అక్కడికక్కడే మృతి చెందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏఆర్ ఎస్ఐ అఫ్జల్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అంబర్‌పేట ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికి ఘటనను ఆత్మహత్యగానే అనుమానిస్తున్నట్లు తెలిపారు. కాగా సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ సంఘటన స్థలిని సందర్శించారు. తుపాకీ పేలిన తీరు, తదితర వివరాలు తోటి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆనవాళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతామని అందులో మృతిపై మరింత స్పష్టత వస్తుందన్నారు.