breaking news
Mlc sudhakarbabu
-
సీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే ‘ప్రత్యేక’ ఉద్యమం
కర్నూలు(అర్బన్) : రాయలసీమ అభివృద్ధిని పాలకులు నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదిక వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ హెచ్చరించారు. శనివారం రాయలసీమ హక్కుల ఐక్య వేదిక 12వ వార్షికోత్సవం స్థానిక మౌర్యా ఇన్ హోటల్లోని శ్రీ ఆర్య వైశ్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ హక్కుల ఐక్యవేదికను రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదికగా విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని అమరావతితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే రాయలసీమలో సమ్మర్, ఉత్తరాంధ్రలో వింటర్ రాజధానులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.రాయలసీమలోని నాలుగు జిల్లాలను 8, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను 6 జిల్లాలుగా పెంచాలన్నారు. కార్యక్రమానికి రాయలసీ మ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యం రెడ్డి, ఎమ్మెల్సీ ఎం. సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు లబ్బి వెంకటస్వామి, మదనగోపాల్, వరదరాజులురెడ్డి (కడప),మాజీ మేయర్ ఎస్. రఘురామిరెడ్డి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, బీజేపీ కర్నూలు పార్లమెంట్ ఇంచార్జి నక్కలమిట్ట శ్రీనివాసులు, జిల్లా ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు సీహెచ్ వెంగళ్‌రెడ్డి, విద్యా సంస్థల అధినేతలు వి. జనార్దన్‌రెడ్డి, పుల్లయ్య, రిటైర్డు డీఎస్పీ రామ్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు. సామూహిక వివాహాలు... వార్షికోత్సవం సందర్భంగా సామూహిక వివాహాలు జరిపించారు. మౌర్య హోటల్ 27 హిందువులు, 3 ముస్లిం, 11 క్రిస్టియన్ జంటలకు వివాహం జరిపించారు. టీజీ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డా.కేజీ గోవిందరెడ్డి హాజరయ్యారు. -
ప్రజలపై భారం మోపడం తగదు
కర్నూలు (ఓల్డ్‌సిటీ) : పెట్రో ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపడం తగదని ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు అన్నారు. శనివారం స్థానిక కళావెంకట్రావు కార్యాలయంలో డీసీసీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం.. చమురు కంపెనీలు కూడబలుక్కుని పెట్రోల్, డీజిల్ ధరలను తరచుగా తగ్గిస్తూ, అధికంగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు. మాజీ జెడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి మాట్లాడుతూ ధరలు పెంచడంలో ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చూపడం లేదన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శివకుమార్, శ్రీనివాసులు రెడ్డి, వెంకటస్వామి, జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ వినూత్న నిరసన కర్నూలు: పెట్రో ధరలను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినూత్న తరహాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మునెప్ప, గౌరవాధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ వద్ద ఆటోలకు తాళ్లను కట్టి లాగుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మునెప్ప మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేపదే పెట్రో, డీజిల్ ధరలు పెంచుతూ వినియోగదారుల నడ్డి విరుస్తోందన్నారు. తక్షణమే పెంచిన పెట్రో, డీజిల్ ధరలను తగ్గించి చమురు ధరలపై నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ నాయకులు రామునాయక్, ఈశ్వర్, రమణ, రాము, మధు, అక్బర్‌తో పాటు ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెంచిన ధరలను తగ్గించాలి కర్నూలు(రాజ్‌విహార్): పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్ డిమాండ్ చేశారు. శనివారం నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారాలు మోపడమే లక్ష్యంగా పనిచేస్తోందనన్నారు. అందులో భాగంగా నెల రోజుల వ్యవధిలో రెండో సారి చమురు ధరలు పెంచి మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో రవాణ చార్జీలు కూడా పెరుగుతాయన్నారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నగర నాయకులు రాముడు, రాజగోపాల్, నాగరాజు, రాజశేఖర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.