రాజకీయ దురుద్దేశంతోనే విభజన
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే లక్ష్యంతోనే రాష్ట్ర విభజన చేపట్టారని, దీంట్లో రాజకీయ దురుద్దేశం మినహా మరొకటి లేదని వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు అన్నారు. శనివారం ఒంగోలు వచ్చిన ఆయనను సమైక్యాంధ్ర దళిత సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు, నాయకులు చుట్టుముట్టారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ మొదటినుంచి వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటన రాకముందే తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు లాగా రెండు కళ్ల సిద్ధాంతాన్ని తమ పార్టీ నమ్ముకోలేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పార్టీ విశేషంగా కృషి చేస్తోందని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి సమైక్యాంధ్రకు మద్దతు కూడగడతామని తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంటోని కమిటీని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. గవర్నర్ కోటా కింద ఎంపికైన ఎమ్మెల్సీల తరఫున గవర్నర్‌ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వినతి పత్రం అందజేశామని చెప్పారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని, అవసరమైతే ఎలాంటి ఉద్యమానికైనా వెనుకాడేది లేదని వివరించారు. అనంతరం దళిత సంఘాల జేఏసీ కన్వీనర్ దాసరి శివాజీ మాట్లాడుతూ అన్ని దళిత సంఘాలను కలుపుకొని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వివరించారు.