breaking news
Minister deveneni Umamaheshwara Rao
-
మహనీయుల స్ఫూర్తితో ముందడుగు
జెండా ఊంఛా రహే హమారా.. అంటూ త్రివర్ణ పతాకాన్ని మచిలీపట్నంలో సగర్వంగా ఎగరేశారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. జిల్లా ప్రగతి, అభివృద్ధిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రసంగం చేశారు. మచిలీపట్నం : భారత స్వాతంత్య్రం కోసం ఉద్యమాలు చేసిన మహనీయుల స్ఫూర్తితో ముందడుగు వేసి జిల్లాను అందరి సహకారంతో అభివ ృద్ధి పథంలో నడుపుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. భారత 69వ స్వాతంత్య్రదిన వేడుకలు మచిలీపట్నంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం వైభవంగా నిర్వహించారు. తొలుత జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్రదిన వేడుకలను పురస్కరించుకుని పోలీసు బలగాలు చేసిన మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. వివిధ ప్రభుత్వ పథకాలను చాటుతూ ఏర్పాటుచేసిన శకటాలు అలరించాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.రవీంద్రబాబు, కలెక్టర్ బాబు.ఎ, జేసీ గంధం చంద్రుడు, ఎస్పీ జి.విజయ్‌కుమార్, ఇన్చార్జ్ డీఆర్వో పి.సాయిబాబు చేతుల మీదుగా అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులు మేకా నరసయ్య, సీహెచ్ పాండురంగారావులతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత గొరిపర్తి నరసింహరాజు యాదవ్‌లను ఈ సందర్భంగా సత్కరించారు. జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. మహనీయులను స్మరించుకుంటూ... మంత్రి దేవినేని ఉమా తన ప్రసంగంలో జిల్లాకు చెందిన అయ్యదేవర కాళేశ్వరరావు, కొమరరాజు లక్ష్మణరావు, గొట్టిపాటి బ్రహ్మయ్య, తిపురనేని రామస్వామిచౌదరి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలక ృష్ణయ్య, మాకినేని సుబ్రహ్మణ్యం, జెండా వీరుడు తోట నరసయ్య, కాశీనాథుని పూర్ణమల్లిఖార్జునుడు, కోటగిరి వెంకటక ృష్ణారావు, బండారు అచ్చమాంబ, వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వంటి ఎందరో మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగకపోవటంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కృష్ణా పుష్కరాలు వైభవంగా నిర్వహించేందుకు చర్యలు ఈ వేడుకల్లో మంత్రి ఉమా మాట్లాడుతూ జిల్లా ప్రగతి, చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు. చేయబోతున్న అభివృద్ధి పనుల వివరాలు కూడా తెలియజేశారు. రైతు రుణమాఫీ మూడు విడతల్లో చేపట్టామని, మూడో విడత పేర్లు ఆన్లైన్లో పొందుపరిచామని వివరించారు. నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామన్నారు. రూ.700 కోట్లు వెచ్చించి పోలవరం కుడికాలువ పనులు వేగవంతంగా చేస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామన్నారు. కేఎల్‌రావు సాగర్, పులిచింతల ప్రాజెక్టు పనులను పూర్తిచేసి కృష్ణాడెల్టాలో సకాలంలో సాగు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్వాక్రా రుణమాఫీ మొదటి విడతగా 48 వేల గ్రూపుల్లోని 4.9 లక్షల మంది సభ్యులకు రూ.134 కోట్లు వారి పొదుపు ఖాతాలో జమ చేశామన్నారు. జిల్లాలోని 2160 రేషన్‌షాపుల ద్వారా ఈ-పోస్ విధానంలో నిత్యావసర సరకులు అందజేస్తున్నామని, ఈ విధానం అమలు చేసిన ఘనత మన జిల్లాకే దక్కిందని తెలిపారు. చేపల వేట నిషేధం సమయంలో ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి రూ.4 వేలు ఆర్థిక సహాయం అందించనున్నామని చెప్పారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివ ృద్ధి చేస్తామని, బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని, క ృష్ణా యూనివర్సిటీని అన్ని వసతులతో అభివ ృద్ధి చేస్తామని, ఆగిరిపల్లిలో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని తెలిపారు. క ృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. భవానీ ద్వీపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. మచిలీపట్నం,, పెడన, బంటుమిల్లి, విజయవాడ, రుద్రవరం పాఠశాలల విద్యార్థులు చేసిన వివిధ ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. వీఎంఆర్ కృష్ణలంక విద్యార్థులకు ప్రథమ, గురుకుల పాఠశాల రుద్రవరం విద్యార్థులు ద్వితీయ, విజయవాడ మాంటిస్సోరీ గర్ల్స్ విద్యార్థులకు తృతీయ బహుమతులు ప్రకటించారు. ఎస్సీ కార్పొరేషన్ శకటానికి ప్రథమ బహుమతి స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రభుత్వ పథకాలను తెలియజేసే వివిధ శకటాలను ప్రదర్శించారు. పౌర సరఫరాల విభాగం, ఈ-పోస్ ద్వారా సరకుల పంపిణీ, నీరు-చెట్టు కార్యక్రమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలను వివరించే శకటం, ఎస్సీ కార్పొరేషన్, విద్యాశాఖ, ఆర్డబ్ల్యూఎస్, జాతీయ ఉపాధి హామీ పథకం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శకటాలు ఆకట్టుకున్నాయి. వీటితో పాటు 108, 104 శకటాలను ప్రదర్శించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుపోషణపై ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ శకటానికి ప్రథమ, డీఎస్వో కార్యాలయం ఏర్పాటు చేసిన శకటానికి ద్వితీయ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ శకటానికి తృతీయ బహుమతులు ప్రకటించారు. -
మాట తప్పారు
పట్టిసీమ ద్వారా డెల్టాకు సాగునీరు ఎప్పటికో.. జూన్ 1, జూన్ 15, ఆగస్టు 15న సాగునీరంటూ వాయిదాలు ఎదురుచూసిన రైతులకు మిగిలింది నిరాశే.. మచిలీపట్నం : పట్టిసీమ నుంచి డెల్టాకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం ముచ్చటగా మూడోసారీ మాటతప్పింది. జూన్ ఒకటో తేదీకే ఖరీఫ్ నారుమడులకు సాగునీరు అంది స్తామని ఒకసారి, కొద్ది రోజుల తరువాత అదే నెల 15వ తేదీ నాటికి ఇస్తామని మరోసారి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీ నాటికి పట్టిసీమ నీరు పోల వరం కాలువలో పారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వాగ్దానం చేశారు. అయితే ఈ నెల 13వ తేదీ నాటికే ముఖ్యమంత్రితోపాటు మంత్రులు మాటమార్చేశారు. పట్టిసీమ పనులు పూర్తి కానందున, ఈ పనుల్లో నాణ్యత పాటించాల్సి ఉన్నందున వారం, పది రోజుల తరువాత కృష్ణానదికి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో డెల్టా రైతుల్లో నిరాశ, నిస్పృహ నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి సాగునీటి విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఖరీఫ్‌లో సాగర్ నీరు వచ్చినారాకున్నా, పట్టిసీమ నీరు తెచ్చి కృష్ణానదిలో కలిపి, ప్రకాశం బ్యారేజీ నుంచి జూన్ ఒకటి నుంచి సాగునీరు ఇస్తామని ఘంటసాల మండలంలో పర్యటించినప్పుడు మంత్రి ఉమా ప్రకటించారు. ఆ తరువాత జరిగిన జెడ్పీ సమావేశంలో జూన్ 15వ తేదీ నుంచి నీరు ఇస్తామన్నారు. అయితే వరుణుడు కరుణించక, పాలకులు చెప్పినట్టు పట్టిసీమ ద్వారా కృష్ణానదికి నీరు చేరి కాలువలకు విడుదల చేస్తే పంటలు సాగు చేసుకుందామనే ఆశతో రైతులు ఉన్నారు. కాలువలకు నీటి విడుదల ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోవటంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పట్టిసీమ ద్వారా నీరు చేరేనా..! పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 174 కిలోమీటర్ల దూరం ఉంది. 130 కిలోమీటర్ల మేర వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోల వరం కాలువను తవ్వారు. అప్పట్లో ఈ కాలువను 86 కిలోమీటర్ల పొడవున తవ్వారు. మిగిలిన 44 కిలోమీటర్ల మేర పోలవరం కాలువ తవ్వి కృష్ణానదికిలో పట్టిసీమ నీరు చేరేలా పనులు పూర్తిచేయాలి. ఏడాదిగా ఈ పనులు చేస్తూ ఆగస్టు 15వ తేదీ నాటికి పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభిస్తామని పాలకులు గొప్పలు చెప్పారు. పట్టిసీమ వద్ద పంపింగ్ చేయడం ప్రారంభిస్తే 48 గంటల్లో ప్రకాశం బ్యారేజీ వద్దకు నీరు చేరుతుందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏడాదిగా చెప్తున్నారు. రూ.1300 కోట్లతో చేపట్టిన ఈ పథకం వద్ద 24 మోటార్లతో రోజుకు 8,500 క్యూసెక్కుల నీటిని కృష్ణానదికి తరలించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. పనులు పూర్తికాకపోవటంతో కనీసం నాలుగు మోటార్ల ద్వారానైనా నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించారని, అయితే ఆ పనులు కూడా పూర్తికాలేదని రైతులు చెబుతున్నారు. తొలుత 30 మోటార్లను ఈ పట్టిసీమ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. తరువాత వాటిని 24కు కుదించారు. అనుకున్న సమయానికి పనులు కాకున్నా పట్టిసీమ పథకాన్ని ఆగస్టు 15వ తేదీన జాతికి అంకితం చేసే కార్యక్రమం చేపట్టడం ఎంత వరకు సమంజసమని రైతులు, రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. నీరు కృష్ణానదికి చేరేనా.. పట్టిసీమ ప్రాజెక్టు వద్ద నుంచి 30 మోటార్లతో నీటిని పంపింగ్ చేస్తే రోజుకు 8,500 క్యూసెక్కుల నీరు కృష్ణానదికి వస్తుందనేది అధికారుల లెక్క. ఈ మోటార్ల సంఖ్యను 24కు, అక్కడి నుంచి ఎనిమిదికి, ఆ తరువాత నాలుగుకు, అక్కడి నుంచి ఒక్క మోటారుకు కుదించినట్లు ప్రచారం జరుగుతోంది. 24 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తే రోజుకు 8,500 క్యూసెక్కుల నీరు కృష్ణానదికి చేరుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 24 మోటార్లు నూరుశాతం పనిచేసేందుకు విద్యుత్ నిరాటంకంగా సరఫరా అవుతుందా అన్న అనుమానాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పోలవరం కాలువ పనుల్లో వంతెనలు నిర్మించాల్సిన చోట తూములు ఏర్పాటు చేశారని, ఇవి ఎంతమేర పనిచేస్తాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల సంక్షేమాన్ని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఏడాది కాలంగా పట్టిసీమ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి చివరి క్షణాల్లో తూచ్ అనటం టీడీపీ నాయకులకే చెల్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పులిచింతలను ఆదర్శంగా తీసుకున్నారా? నిర్మాణ పనులు పూర్తికాకుండానే 2013 నవంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 35 నుంచి 45 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టులో నిల్వ ఉంచే అవకాశం ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. నిర్వాసితులకు రూ.200 కోట్లు ఇస్తే పులిచింతల పనులు పూర్తిస్థాయిలో చేయించుకునే అవకాశం ఉన్నా నిధులు విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. పట్టిసీమ ప్రాజెక్టు వద్ద 24 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తే రూ.257 కోట్ల కరెంటు బిల్లు వచ్చే అవకాశం ఉందని అధికారులే చెబుతున్నారని రైతు సంఘల నాయకులు పేర్కొంటున్నారు. పులిచింతలకు రూ.200 కోట్లు విడుదల చేస్తే 40 నుంచి 45 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం పులిచింతలను కాదని, 35 టీఎంసీల నీటిని పట్టిసీమ నుంచి కృష్ణానదికి పంపింగ్ చేసేందుకే మొగ్గు చూపటం వెనుక కారణాలు ఏమిటని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.