breaking news
Milk Sweet
-
Guvvalacheruvu Palakova: గువ్వలచెరువు పాలకోవా అంటే ఫేమస్!
సాక్షి రాయచోటి: గువ్వలచెరువు పాలకోవా.. నోటి తీపికే కాదు.. ఊరూరా గుర్తింపు పొందింది. రాష్ట్రాలే కాదు.. ఖండాతరాలు దాటి వెళుతోంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని అనేక మంది ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. అక్కడ కూడా గువ్వలచెరువు పాలకోవాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వందల ఏళ్ల కాలం నుంచి ఇక్కడివారు పాలకోవా తయారు చేస్తూ రుచిలో శుచిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గువ్వల చెరువు మెయిన్‌రోడ్డు మీద ఉండే 60 షాపులే కాకుండా గ్రామంలో పాలకోవాను తయారు చేసే బట్టీలు 15 వరకు ఉన్నాయి. కోవా అనగానే గువ్వలచెరువు నుంచి తెచ్చారా? అనడం చూస్తే ఆ కోవాకు ఎంతటి గుర్తింపు ఉందో అర్థమవుతుంది. ప్రతిరోజు ఐదు వేల లీటర్ల వరకు పాలు వస్తుండగా... 2000 కిలోల వరకు పాలకోవాను తయారు చేసి విక్రయిస్తుంటారు. గువ్వల చెరువు గ్రామంలో సుమారు 1500 మంది జనాభా ఉంది. అధికభాగం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు నాయుళ్లు, వడ్డెర, గిరిజన కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. గ్రామంలో తరతరాల నుంచి అంటే దాదాపు వందేళ్లకు పైగా కోవా తయారు చేస్తూ వస్తున్నారు. ప్రతినిత్యం 100 కుటుంబాల వారు కోవా తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గువ్వలచెరువు పాలకోవా అంటే ఫేమస్ కావడంతో జీవనోపాధిని వదులుకోలేక కొనసాగిస్తున్నారు. తయారు చేసే సమయంలో కూడా అనేక రకాల కష్టాలు ఉన్నాయి. గోలాల్లో పాలు పోసి ఐదు గంటలపాటు వేడి చేసే సమయంలో విపరీలమైన వేడి పొగతో కళ్లు ఎర్రబారడం, నీళ్లు కారడం, మంటకు గురికావడం జరుగుతుంది. కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపైన గ్రామం ఉండడంతో నిత్యం వేలాది వాహనాలు గువ్వల చెరువు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి సమయంలో పదుల సంఖ్యలో లారీలో ఆగి ఉంటాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, మహరాష్ట్ర, పంజాబ్, కేరళ తదితర ప్రాంతాలకు వెళ్లే లారీల వారు పాలకోవాను ఆర్డర్లపై తీసుకెళుతుంటారు. అంతేకాకుండా కువైట్, సౌదీ అరేబియా, మస్కట్, ఖత్తర్, దుబాయ్, బెహరీన్ తదితర దేశాలకు కూడా బంధువులు, స్నేహితుల ద్వారా పాల కోవాను ప్యాకింగ్ చేసి పంపిస్తుంటారు. పాలకోవా సుదీర్ఘకాలంపాటు నిల్వ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతర దేశానికి తరలిస్తుంటారు. దీని తయారీకి అవసరమైన పాలను తయారీదారులు ప్రత్యేకంగా ఆటోల ద్వారా పీలేరు, రాయచోటి, మదనపల్లె తదితర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. పాలకోవాను గ్రామంలో బట్టీల వద్ద తయారు చేసిన అనంతరం పెద్దపెద్ద పాత్రలలో రోడ్డుపై ఉన్న షాపులకు సరఫరా చేస్తున్నారు. గువ్వలచెరువు పాలకోవా రుచికరంగా మంచి గుర్తింపు ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళుతుంటారు. అంతేకాకుండా ప్రతిరోజు 15 ఆటోల ద్వారా వివిధ జిల్లాలకు కూడా తీసుకెళ్లి విక్రయాలు సాగిస్తున్నారు. గతంలో ఈ మార్గంలో వెళుతున్న జాతీయ నేతలైన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతోపాటు ఆయన కుమార్తె ఇందిరాగాంధీ సైతం గువ్వుల చెరువు పాలకోవా రుచిచూసి మెచ్చుకున్నట్లు పలువురు గ్రామస్తులు తెలియజేశారు. తయారీ విధానం పాలకోవాను తయారీదారులు ముందుగా పాలను తీసుకొచ్చి పెద్ద గోలాల్లో వేసిసుమారు ఐదు గంటలపాటు మరగబెడతారు. ఒకవైపు గరిటెతో కలియబెడుతూ చిక్కదనం కోసం పొంగు రాకుండా చూసుకుంటారు. పాలు బాగా మరిగిన తర్వాత చక్కెర, ఇతర పదార్థాలు వేసి మరో అరగంట నుంచి గంటపాటు వేడి చేస్తారు. తద్వారా పాలకోవా రూపుదిద్దుకుంటుంది. అవసరమైన కట్టెలనుకూడా సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి తీసుకొస్తారు. గోలంలో పాలు ఉడికిస్తున్న ఇతని పేరు షేక్ జమాల్‌వలి. గువ్వలచెరువు గ్రామం. ఎన్నో ఏళ్ల నుంచి పాలకోవా తయారు చేస్తున్నారు. ఆర్డర్లను బట్టి పాలను ప్రత్యేకంగా ఆటోలో క్యాన్ల ద్వారా పీలేరు, మదనపల్లె, రాయచోటిలకు వెళ్లి తెచ్చుకుంటారు. ఈ ప్రాంతానికి చెందిన వారు అధికంగా ఇతర దేశాల్లో చాలా మంది ఉండడంతో అక్కడకి తీసుకెళ్లేందుకు ఆర్డర్లు ఇస్తుంటారు. ఇతర రాష్ట్రాలకు, ప్రొద్దుటూరు, కడప, మదనపల్లె, రాజంపేట, రాయచోటితోపాటు వివిధ ప్రాంతాల్లోని బేకరీలకు కూడా గువ్వలచెరువు నుంచే పాలకోవాను పంపిస్తుంటారు. (క్లిక్: వెయ్యేళ్ల చరిత్రకు పూర్వ వైభవం.. నాడు రాజుల నేతృత్వంలో.. నేడు సీఎం హోదాలో!) కల్తీ లేని కోవా కల్తీ లేకుండా నాణ్యమైన పాలకోవా అందిస్తాం. ఇక్కడి పాలకోవా మంచి రుచికరంగా ఉంటుంది. గ్రామంలో తయారు చేసి దుకాణాలకు ఆర్డర్లపై అందజేస్తారు. సుమారు 100 కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి సరుకు తీసుకెళుతుంటారు. – అబ్దుల్ మతిన్, పాలకోవా వ్యాపారి, గువ్వలచెరువు వ్యాపారం బాగుంది పాలకోవాను నమ్ముకుని వ్యాపారం చేస్తున్నాం. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు ఇక్కడ ఆగుతాయి. కార్లలో ప్రత్యేకంగా వచ్చి కోవాను తీసుకెళుతుంటారు. ఇతర రాష్ట్రాలకు చెందిన లారీల డ్రైవర్లు, క్లీనర్లు కూడా తీసుకెళతారు. ప్రతిరోజు మా షాపులో రూ. 4 వేల వరకు వ్యాపారం జరుగుతుంది. పదిహేనేళ్ల నుంచి ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాం. – పఠాన్ అజీజ్‌ఖాన్, పాలకోవా వ్యాపారి, గువ్వలచెరువు -
నోరు తెరవరాకన్నయ్యా..!
‘ఊహూ’ అంటాడు, తల అడ్డంగా ఊపుతూ. చెవి మెలిపెడుతుంది తల్లి యశోద! ‘ఆ..’ అంటాడు. అంతే! యశోద నోరు తెరవాల్సి వస్తుంది! చిన్నారి కన్నయ్య నోట్లో... పదునాలుగు భువన భాండమ్ములు! ఆ ‘భాండమ్ము’లలో మిల్క్ మైసూర్‌పాక్, మలై పేడా, పనీర్ కలాకండ్, డ్రైఫ్రూట్ లడ్డూ, శ్రీఖండ్... ఉన్నాయని ‘భాగవతం’లో పోతన ప్రత్యేకంగా చెప్పలేదు కానీ... ఉండే ఉంటాయి. లిటిల్ కృష్ణకు పాలు, వెన్న ఇష్టం కదా! అందుకే ఈ కృష్ణాష్టమికి మనం... ఆయన పేరు చెప్పుకుని మిల్క్ స్వీట్‌ని నోట్లో వేసుకుందాం. జయకృష్ణా... ముకుందా... మురారీ.... డ్రైఫ్రూట్ లడ్డూ కావలసినవి: ఖర్జూరాలు, ఎండుకొబ్బరి, పుచ్చకాయ గింజలు, కర్బూజా గింజలు, పిస్తా, జీడిపప్పు, బాదంపప్పు... మొత్తం కలిపి అరకేజీ ఉండాలి. (నచ్చిన ఏ గింజలనైనా వాడుకోవచ్చు); బెల్లం - అరకేజీ; పటికబె ల్లం - మూడు టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - అర టీ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను. తయారి: డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. (పొడిలా అయిపోకూడదు) ఖర్జూరాలను బాగా సన్నగా కట్‌చేయాలి. మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక, మంట తగ్గించి, డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి. ఖర్జూరం తరుగు, ఏలకుల పొడి, పటికబెల్లం వేసి వేయించి బాగా కలిశాక పక్కన ఉంచుకోవాలి. బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీరు ఒక పాత్రలో వేసి బెల్లాన్ని కరిగించి వడబోస్తే, తుక్కు బయటకు పోతుంది. ఈ మిశ్రమానికి టేబుల్ స్పూన్ నెయ్యి జతచేయాలి. ఉండపాకం వచ్చేవరకు ఉంచాలి; పటికబెల్లం జతచేయాలి; ఈ మిశ్రమాన్ని డ్రైఫ్రూట్స్ మీద పోసి బాగా కలిపి మరోమారు స్టౌ మీద ఉంచి కాసేపు ఉడికించాలి; కిందకు దించి ఉండలు చేయాలి. శ్రీఖండ్ కావలసినవి పెరుగు - రెండు కప్పులు; చల్లటి పాలు - 2 టేబుల్ స్పూన్లు; కుంకుమపువ్వు - చిటికెడు; పంచదార - అరకప్పు; జాజికాయ పొడి - చిటికెడు; ఏలకులపొడి - చిటికెడు; బాదంపప్పులు - 2 (గార్నిషింగ్ కోసం) తయారి: (గడ్డపెరుగు లేకపోతే, ఇంట్లో ఉన్న పెరుగును ఒక వస్త్రంలో వేసి మూట కట్టి, సుమారు నాలుగైదు గంటలు వేలాడదీయాలి. నీరంతా పోయి, గట్టి పెరుగు మిగులుతుంది) చిన్నపాత్రలో పాలు తీసుకుని, స్టౌ మీద ఉంచి గోరువెచ్చన చేసి, కిందకు దింపి, కుంకుమ పువ్వు జత చేసి బాగా కలిపి 5 నిముషాలు పక్కన ఉంచాలి. మరొక పాత్రలో పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి. రెండూ బాగా కలిసేలా చిలకాలి. కుంకుమపువ్వు జతచేసిన పాలు కలపాలి. ఏలకులపొడి జత చేయాలి. గ్లాసులలో పోసి, బాదంపప్పులతో, కుంకుమపువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఖాయం కావలసినవి: బెల్లం తురుము - కప్పు; శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, జీలకర్ర, వాము, కరక్కాయ - అన్నీ సమపాళ్లలో (కప్పు బెల్లంతో సమానంగా ఉండాలి); నెయ్యి - కప్పు తయారి: శొంఠి, పిప్పళ్లు... ఈ పదార్థాలను బాణలిలో దోరగా వేయించాలి. మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఒక పాత్రలో శొంఠి, పిప్పళ్ల... మిశ్రమం, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. నెయ్యి జతచేస్తూ ఉండలు చేసుకోవాలి. (ఇది బాలింతలకు పథ్యంగా పెడతారు. ఈ ఖాయం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థం) మిల్క్ మైసూర్‌పాక్ కావలసినవి: పాలపొడి - కప్పు; పంచదార - కప్పు; నీరు - అర కప్పు; మైదా - రెండు టేబుల్ స్పూన్లు; నెయ్యి - కప్పు; ఉప్పు - చిటికెడు. తయారి: ఒక పాత్రలో పంచదార, నీరు పోసి తీగపాకం వచ్చేవరకు స్టౌ మీద ఉంచాలి ఒక పాత్రలో పాలపొడి, మైదా, ఉప్పు, టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి ఈ మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి, స్టౌ మీద ఉంచి రెండు మూడు నిముషాలు బాగా కలిపి మంట తగ్గించాలి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి జతచేసి, మరో మూడు నిముషాలు ఉంచాలి ఈ మిశ్రమం పాత్ర నుంచి విడివడుతుండగా మరో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి, మంట తగ్గించాలి ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి రాసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో పోసి, బాగా చల్లారాక మనకు ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకోవాలి. మలై పేడా కావలసినవి: కండెన్స్డ్ మిల్క్ - ఒక టిన్; పాలు - ఒకటిన్నర కప్పులు; కార్న్‌ఫ్లోర్ - టీ స్పూన్; సిట్రిక్ ఆసిడ్ - అర టీ స్పూను; ఏలకులపొడి - టీ స్పూన్; నెయ్యి - టేబుల్ స్పూన్; ఫుడ్ కలర్ (పసుపు రంగు) - నాలుగు చుక్కలు తయారి: పాన్ వేడి చేసి అందులో నెయ్యి వేసి కరిగించాలి కండెన్స్డ్ మిల్క్, పాలు, సిట్రిక్ ఆసిడ్ (కొద్దిగా నీటిలో వేసి బాగా కలపాలి) వేసి కలపాలి బాగా దగ్గరపడేవరకు ఆపకుండా కలుపుతుండాలి చిన్నపాత్రలో రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి అందులో కార్న్‌ఫ్లోర్ వేసి పేస్ట్‌లా కలిపి, పాల మిశ్రమంలో వేయాలి విడివడేవరకు బాగా కలుపుతుండాలి రంగునీరు జతచేయాలి పెద్ద ప్లేట్లోకి తిరగబోసి పేడాల మాదిరిగా తయారుచేయాలి ఏలకులపొడితో గార్నిష్ చేయాలి. పనీర్ కలాకండ్ కావలసినవి: తాజా పనీర్ - ముప్పావు కప్పు (ఉప్పు లేని పనీర్); పాలపొడి - 8 టేబుల్ స్పూన్లు; పంచదార - పావు కప్పు; తాజా క్రీమ్ - అర కప్పు; ఏలకులపొడి - రెండు టేబుల్ స్పూన్లు; బాదంపప్పులు - 10. తయారి అన్ని పదార్థాలను ఒక పాత్రలో వేసి స్టౌ మీద ఉంచి మంట తగ్గించి, ఆపకుండా కలుపుతూ సుమారు 15 నిముషాలు ఉంచాలి మిశ్రమం బాగా చిక్కబడ్డాక దించేయాలి ఒక ప్లేట్లో ఈ మిశ్రమాన్ని పోసి, సమానంగా పరిచి, చల్లారాక, నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేయాలి బాదం పప్పులతో గార్నిష్చేయాలి. (తాజా పనీర్ వాడితే మంచిది) సేకరణ డా.వైజయంతి