breaking news
Metro Water
-
తీరనున్న తాగునీటి కష్టాలు !
శంషాబాద్: గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీరనున్నాయి. సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించిన వాటర్ గ్రిడ్ పథకంతో సమస్యలకు అడ్డుకట్ట పడనుంది. ఈ పథకంతో మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి. సర్కారు ఆదేశాలతో గ్రామీణ నీటి సరఫరా విభాగం వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన సర్వేను పూర్తి చేసి నివేదికను పంపేందుకు సిద్ధమైంది. మండలంలో మొత్తం మూడు పాయింట్లుగా నీటి సరఫరా చేయడానికి ఇందులో ప్రతిపాదించారు. నాగార్జునసాగర్ నుంచి కల్వకుర్తి, ఆమన్‌గల్ మీదుగా వచ్చే నీటి సరఫరాకు మహేశ్వరం మండలం హర్షగూడలో ప్రధాన పంపింగ్పాయింట్గా నిర్ణయించారు. శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ, రాళ్లగూడ, సరూర్‌నగర్ మండలంలోని పహడిషరీఫ్ పాయింట్లుగా నీటి సరఫరా చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ప్రణాళిక వ్యయం సుమారు రూ.51 కోట్లు కావచ్చనే అంచనాలను కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రూపొందించారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం చేయాల్సిన ఒవర్‌హెడ్ ట్యాంకులు, సంపులకు మరో రూ.10 కోట్ల అంచనాను ఇందులో పొందుపర్చారు. శంషాబాద్ మండలానికి ప్రతిరోజు 15 లక్షల 80 వేల లీటర్ల నీటి సరఫరా అవసరాన్ని గుర్తించి ఈ అంచనాను సిద్ధం చేసినట్లు సమాచారం. మెట్రోవాటర్ ఇక అంతే.. వాటర్ గ్రిడ్ పథకాన్ని పట్టాలెక్కించే యోచనలో ఉన్న సర్కారు జలమండలితో శంషాబాద్‌కు కృష్ణా నీటిని సరఫరా చేయాలనే ప్రతిపాదనలను దాదాపు విరమించుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. శంషాబాద్ పట్టణానికి రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి రిజర్వాయర్ నుంచి సరఫరా చేయడానికి పైప్‌లైన్ పనులు పూర్తి చేసి కృష్ణా నీటిని సరఫరా చేసినా అది మూన్నాళ్లముచ్చటగానే మారింది. వన్‌టైమ్ కనెక్షన్ డిపాజిట్ కింద జలమండలికి చెల్లించాల్సిన రూ.13 కోట్లు ప్రభుత్వం నేటికీ చెల్లించకపోవడంతో నీటి సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం వాటర్‌గ్రిడ్ పథకంలో జల్లపల్లి మీదుగా వచ్చే పైప్‌లైన్‌కు పహడిషరీఫ్ పాయింట్‌గా నీటి సరఫరా చేయాలనే యోచనలో అధికారులున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో జలమండలి నుంచి శంషాబాద్‌కు నీటి సరఫరా అయ్యే అవకాశాలు దాదాపు ముగిసినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి. -
‘మెట్రో వాటర్’పై చిన్నచూపు
సొంత బ్రాండ్‌పై జలమండలి శీతకన్ను రోజుకు 50 క్యాన్ల ఫిల్టర్‌కే పరిమితం ఐదేళ్లుగా ప్రేక్షకపాత్రలో వాటర్‌బోర్డు నెలకు రూ.25 కోట్లు ఆర్జించే అవకాశం అయినా పట్టించుకోని అధికారులు సాక్షి, సిటీబ్యూరో: జలమండలి సొంత బ్రాండ్‌పై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ‘మెట్రో వాటర్’ పేరిట శుద్ధి నీటిని నగరంలోని అన్ని సర్కార్ కార్యాలయాలకు సరఫరా చేయడంలో విఫలమైంది. ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్స్ వద్ద ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫిల్టర్ ప్లాంటు(నీటి శుద్ధి కేంద్రం)లో రోజుకు 50 క్యాన్ల (20 లీటర్లవి) శుద్ధికే పరిమితం కావడం బోర్డు డొల్లతనాన్ని స్పష్టం చేస్తోంది. పేరుకే మెట్రో వాటర్.. నల్లాల ద్వారా వచ్చే నీటి నాణ్యతపై నమ్మకం లేక లక్షలాదిమంది వినియోగదారులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల యజమానులు ఫిల్టర్ నీటి వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. నీటిలో మలినాలను, కాఠిన్యతను తగ్గించే ఫిల్టర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇలాంటి నగరంలో వెయ్యికి పైనే ఉన్నాయి. వీటి వ్యాపారం నెలకు రూ.100 కోట్లకు పైమాటే . ఈ నేపథ్యంలో సొంతంగా ‘మెట్రోవాటర్’ అన్న పేరుతో ఫిల్టర్ నీటిని తయారు చేసి బహిరంగ మార్కెట్లో విక్రయించాలని జలమండలి భావించింది. ఈ క్రమంలో ఐదేళ్లక్రితం మెట్రోవాటర్ పేరుతో గండిపేట్, హిమాయత్‌సాగర్ జలాశయాల నీటిని శుద్ధి చేసే ఆసిఫ్‌నగర్ ఫిల్టర్‌బెడ్స్ వద్ద ఓ ఫిల్టర్ ప్లాంటును ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటుకు రోజువారీగా సుమారు పదివేల లీటర్ల నీటిని శుద్ధిచేసే సామర్థ్యం ఉంది. కానీ ప్రస్తుతం రోజువారీగా వెయ్యి లీటర్లను మాత్రమే ఇక్కడ శుద్ధిచేస్తున్నారు. ఈ నీటిని 20 లీటర్ల సామర్థ్యంగల 50 ప్లాస్టిక్ క్యాన్లలో నింపి కేవలం ఖైరతాబాద్, గోషామహల్, ఎస్ఆర్ నగర్‌లోని జలమండలి కార్యాలయాలకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ ప్లాంటును సైతం సొంతంగా నిర్వహించలేకపోయింది. ఆ బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించడం బోర్డు నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. సుమారు ఐదు వేల కార్మికులు పనిచేస్తున్న బోర్డుకు ఫిల్టర్‌ప్లాంటును సొంతంగా నిర్వహించే సత్తా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మెట్రోవాటర్ బ్రాండ్ ఇమేజ్ పెంచొచ్చు ఇలా.. గ్రేటర్ పరిధిలో జలమండలి సరఫరా చేస్తోన్న 300 మిలియన్ గ్యాలన్ల నీటిలో 40 శాతం మేర సరఫరా నష్టాలుంటున్నాయి. అంటే రోజుకు 120 మిలియన్ గ్యాలన్ల నీరు వృథాగా పోతోంది. నీటి వృథాను అరికట్టడంతోపాటు సొంతంగా ఫిల్టర్‌ప్లాంట్లను నిర్వహించి విక్రయిస్తే జలమండలి లాభా లు తథ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఫిల్టర్‌నీటి వ్యాపారంలో దూసుకెళ్లకపోయినా నెలకు రూ.25 కోట్ల వరకు ఫిల్టర్ నీటిని విక్రయించి సొమ్ముచేసుకునే అవకాశం వాటర్ బోర్డుకు ఉంది. నగరంలో 56 స్టోరేజీ రిజర్వాయర్లు, పొరుగు జిల్లాల్లోని పలు జలాశయాల నీటిని నగరానికి తరలిస్తున్న మార్గాల్లో 22 ఫిల్టర్‌బెడ్స్ ఉన్నాయి. వీటి వద్దే ఫిల్టర్ నీటి ప్లాంట్లను ఏర్పాటు చేస్తే నీటి కొరత తలెత్తదు. గ్రేటర్ పరిధిలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు సుమారు 200కు పైగానే ఉన్నాయి. కనీసం వీటికైనా మెట్రోవాటర్‌ను సరఫరా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.