breaking news
Mens Wealth
-
బెంజిమిన్ ఫ్రాంక్లిన్ చెప్పినట్లు...
మెన్స్ వెల్త్ రచయిత, ముద్రాపకుడు, దౌత్యవేత్త, రాజనీతిజ్ఞుడుగా... బెంజిమిన్ ఫ్రాంక్లిన్లో ఎన్నో ప్రతిభావంతమైన కోణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన జీవితం నుంచి ఎన్నో ఆర్థికపాఠాలు నేర్చుకోవచ్చు. అవి ఈ కాలానికి కూడా అతికినట్లుగా సరిపోతాయి. ఏడు సంవత్సరాల వయసులోనే తొలి ఆర్థిక పాఠాన్ని నేర్చుకున్నాడు ఫ్రాంక్లిన్. స్కూల్ దగ్గర ఒక అబ్బాయి అదేపనిగా విజిల్ ఊదుతున్నాడు. ఆ శబ్దం ఫ్రాంక్లిన్‌కు విపరీతంగా నచ్చింది. ‘‘ఈ విజిల్ ఎంతకిస్తావ్?’’ అని అడిగాడు. విజిల్ అబ్బాయి సమాధానం చెప్పగానే, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా జేబులో ఉన్న డబ్బులన్నీ ఇచ్చి ఆ విజిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇంటికొచ్చిన తరువాత సోదరికి చూపిస్తే ‘‘ఎంత ధరకు కొన్నావు?’’ అని అడిగింది ఆమె. ఫ్రాంక్లిన్ చెప్పిన సమాధానం విని ఆమె ఆశ్చర్యపోయింది.‘‘నువ్వు నాలుగు రెట్లు ఎక్కువ ధరకు ఆ విజిల్‌ను కొన్నావు తెలుసా!’’ అని ఆమె చెప్పేసరికి ఫ్రాంక్లిన్‌లోని ఆనందమంతా ఆవిరైపోయింది. ‘‘వస్తువులను కొనేముందు హేతుబద్ధంగా ఉండాలి’’ అనే పాఠం తెలిసొచ్చింది. విషయాలను స్వతహాగా నేర్చుకోవడం వల్ల డబ్బు మిగలడమే కాదు ఆత్మసంతృప్తి కూడా దొరుకుతుందని ఫ్రాంక్లిన్ నమ్మేవాడు. దాన్ని ఆచరించి చూపాడు. ప్రింటర్‌గా ఉన్నప్పుడు...‘‘ఫలానా యంత్రం ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకోవాలి, టైమ్ పడుతుంది’’ అని ఎవరైనా చెబితే ‘‘అప్పటివరకు ఎదురుచూడడం ఎందుకు? అలాంటి యంత్రాన్ని మనమే ఎందుకు తయారుచేసుకోకూడదు’’ అంటూ కొత్త యంత్రాలు తయారుచేయించేవాడు. ‘మనిషి అనేవాడు తప్పక పెట్టుబడి పెట్టాలి. అది డబ్బు కావచ్చు...ఇంకేదైనా కావచ్చు’ అనేది ఫ్రాంక్లిన్ సిద్ధాంతం. ఫ్రాంక్లిన్ తన డబ్బును పుస్తకాలలో పెట్టాడు, పుస్తకాలను తన కాలంలో పెట్టుబడిగా పెట్డాడు. విపరీతంగా చదివాడు. ఫలితం వృథా పోలేదు. ప్రపంచ ప్రసిద్ధ రచయిత, శాస్త్రవేత్త కావడానికి ఇది ఉపయోగపడింది.బ్యాంకుల్లో దాచుకున్నదే సంపద కాదు...స్నేహితులు కూడా సంపదే అనేవాడు ఫ్రాంక్లిన్. స్నేహితుల మద్దతు, వారి సలహాలు వెలకట్టలేనివి అని నమ్మేవాడు. తాను ఏ కొత్త పని చేసినా వాటి బాగోగుల గురించి స్నేహితులతో చర్చించడం ఫ్రాంక్లిన్ అలవాటు. ‘‘వ్యాపారం నుంచి మనసును ఎప్పుడైతే దారి మళ్లిస్తామో... అప్పుడు నష్టాలు మొదలవుతాయి. ఎంత నష్టజాతక వ్యాపారమైనా సరే, ఓపిక ఉండి కష్టపడే వాడి చేతిలో లాభాలతో వెలిగిపోతుంది’’ అని చెప్పడమే కాదు నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల బాట పట్టించాడు ఫ్రాంక్లిన్. -
మొహమాటాలొద్దు...
మెన్స్ వెల్త్ కొందరికి అదేపనిగా అప్పులు అడిగే అలవాటు ఉంటుంది. తీసుకున్న అప్పు తీర్చరని తెలిసినా ఇచ్చేస్తుంటాం. ఆ తరువాత తీరిగ్గా బాధ పడుతుంటాం. అందుకే ‘సారీ’ చెప్పి తప్పించుకోవడమంత ఉత్తమమేదీలేదు. ఒక్కసారి చెక్ చేసుకోండి... హైదరాబాద్‌లో అయిదు సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్ నోటి నుంచి ‘‘డబ్బులు సరిపోవడం లేదు’’ అనే మాట తరచుగా వినిపించేది. పని మీద దృష్టి పెట్టకుండా, ఎక్కువ జీతం వచ్చే వేరే కంపెనీకి మారాలని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతని స్నేహితుడు- ‘‘మార్చాల్సింది కంపెనీ కాదు...నీ అలవాట్లను’’ అని సలహా ఇచ్చాడు. దీంతో తన నెల ఖర్చులు వివరంగా లెక్కలు వేసుకున్నాడు. అనివార్యమైన ఖర్చుల కంటే, వృథా ఖర్చులు రెట్టింపు ఉన్నాయి! అప్పటి నుంచి అవసర ఖర్చులకు పుల్‌స్టాప్ పెట్టాడు. ‘ ఒక రూపాయి ఆదా చేస్తే, ఒక రూపాయి సంపాదించినట్లే కదా’ అనే పాత నిజం అనుభవంలోకి రావడానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు. మంచీ చెడు.. మన మీదే! డబ్బుకు మంచి చేసే గుణం, చెడు చేసే గుణం రెండూ ఉంటాయనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు ‘ఫైనాన్షియల్ రికవరీ: డెవలపింగ్ ఏ హెల్తీ రిలేషన్షిప్ విత్ మనీ’ పుస్తక రచయిత కరెన్ మెకాల్. డబ్బును సద్వినియోగం చేస్తే ‘మంచి’ జరిగినా జరగకపోయినా, దుర్వినియోగం చేస్తే మాత్రం వందశాతం చెడు జరుగుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఖాళీ తెర... ‘డబ్బు అనేది బ్లాంక్ స్క్రీన్ లాంటిది. దానిపై మనం ఎన్ని అందమైన కలలైనా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఆ కలలను ఎంత వరకు వాస్తవంలోకి తీసుకువస్తున్నామనే దానిపై మన సామర్థ్యం ఆధారపడి ఉంటుంది అంటున్నారు ఢిల్లీకి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డా.బ్రిష్టి బర్కతక్.