breaking news
Meklinagan
-
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ‘హ్యాట్రిక్’
► వరుసగా మూడో విజయం 10 పరుగులతో ఓడిన ముంబై ► రాణించిన శామ్సన్, డుమిని రోహిత్ శర్మ పోరాటం వృథా తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిన తర్వాత ఢిల్లీ జట్టులో అనూహ్య మార్పు. ఎక్కువ మంది కుర్రాళ్లతో బరిలోకి దిగినా అంచనాలకు మించి రాణిస్తోంది. లక్ష్యం నిర్దేశించడంలోనూ, ఛేదించడంలోనూ తమదైన శైలిలో చెలరేగుతూ ‘హ్యాట్రిక్’ విజయాలను సొంతం చేసుకుంది. న్యూఢిల్లీ: సొంతగడ్డపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ అదరగొడుతోంది. మొన్న బెంగళూరుపై భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన జహీర్ సేన ఇప్పుడు సూపర్ బౌలింగ్‌తో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేసింది. బ్యాటింగ్‌లో సంజూ శామ్సన్ (48 బంతుల్లో 60; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డుమిని (31 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లకు తోడు స్లాగ్ ఓవర్లలో బౌలర్లు చెలరేగడంతో ఐపీఎల్-9లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 10 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై నెగ్గింది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసింది. తర్వాత ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులకు పరిమితమైంది. రోహిత్ శర్మ (48 బంతుల్లో 65; 7 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా, క్రునాల్ పాండ్యా (17 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. సంజూ శామ్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది. శామ్సన్ జోరు... తొలి రెండు బంతులను బౌండరీలుగా మలిచిన ఓపెనర్ డికాక్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించినా.. రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. దీంతో ఢిల్లీ 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో వచ్చిన శామ్సన్ కుదురుగా ఆడేందుకు ప్రయత్నించినా... నాలుగో ఓవర్లో శ్రేయస్ అయ్యర్ (20 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) ఓ ఫోర్, సిక్స్‌తో 12 పరుగులు రాబట్టాడు. పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన ఢిల్లీ.. ఏడు, ఎనిమిది ఓవర్లలో శ్రేయస్, కరుణ్ నాయర్ (5) వికెట్లను చేజార్చుకోవడంతో రన్‌రేట్ పడిపోయింది. తర్వాత శామ్సన్తో జత కలిసిన డుమిని సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ చక్కని సహకారం అందించాడు. దీన్ని ఉపయోగించుకున్న శామ్సన్... హర్భజన్ వేసిన 12వ ఓవర్లో ఓ సిక్స్, ఫోర్‌తో వేగం పెంచాడు. ఆ తర్వాతి ఓవర్లో మరో బౌండరీ సాధించి 40 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌లో డుమిని కూడా పొలార్డ్‌కు సిక్సర్ రుచి చూపెట్టాడు. 17వ ఓవర్ రెండో బంతికి భారీ సిక్సర్ సంధించిన శామ్సన్ తర్వాతి బాల్‌కు అవుటయ్యాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు వికెట్‌కు 71 పరుగులు జోడించారు. చివరి మూడు ఓవర్లలో డుమిని, పవన్ నేగి (10 బంతుల్లో 10 నాటౌట్; 1 ఫోర్)లు 34 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. మెక్లీనగన్ 2 వికెట్లు తీశాడు. రోహిత్ ఒక్కడే... ముంబై ఓపెనర్లలో పార్థీవ్ పటేల్ (1) నిరాశపర్చినా... రెండో ఎండ్‌లో రోహిత్ తన మార్క్‌ను చూపెట్టాడు. అంబటి రాయుడు (23 బంతుల్లో 25; 4 ఫోర్లు)తో కలిసి ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నేగి వేసిన మూడో ఓవర్లో రోహిత్ నాలుగు ఫోర్లతో 19 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో రాయుడు కూడా రెండు బౌండరీలు సాధించడంతో 8కి పైగా రన్‌రేట్ నమోదైంది. పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 52 పరుగులు చేసిన ముంబై.. 9వ ఓవర్లో రాయుడు వికెట్‌ను కోల్పోయింది. మిశ్రా అద్భుతమైన గుగ్లీతో అతన్ని అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచిన క్రునాల్ ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. మొత్తం 4 ఫోర్లు, 2 సిక్సర్లతో మూడో వికెట్‌కు 41 పరుగులు జోడించి అవుటయ్యాడు. ఇక 6 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన దశలో ఢిల్లీ బౌలర్లు విజృంభించారు. బట్లర్ (2)ను వెంటనే అవుట్ చేయడంతో పాటు భారీ షాట్లకు పోకుండా రోహిత్, పొలార్డ్ (18 బంతుల్లో 19; ఒక సిక్స్)లను కట్టడి చేశారు. దీంతో సింగిల్స్ మాత్రమే రావడంతో రన్‌రేట్ పెరిగిపోయింది. 19వ ఓవర్లో భారీ సిక్సర్ కొట్టిన పొలార్డ్ ఆఖరి బంతికి అవుటయ్యాడు. ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరంకాగా, రోహిత్, హర్భజన్ (0) వరుస బంతుల్లో వెనుదిరిగారు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) హార్దిక్ (బి) మెక్లీనగన్ 9; శ్రేయస్ (సి) రాయుడు (బి) హార్దిక్ 19; శామ్సన్ (సి) సౌతీ (బి) మెక్లీనగన్ 60; కరుణ్ నాయర్ (సి) సౌతీ (బి) హర్భజన్ 5; డుమిని నాటౌట్ 49; నేగి నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1-11; 2-48; 3-54; 4-125. బౌలింగ్: సౌతీ 3-0-21-0; మెక్లీనగన్ 4-0-31-2; బుమ్రా 4-0-42-0; క్రునాల్ పాండ్యా 4-0-25-0; హార్దిక్ పాండ్యా 1-0-7-1; హర్భజన్ 3-0-24-1; పొలార్డ్ 1-0-11-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ రనౌట్ 65; పార్థీవ్ పటేల్ రనౌట్ 1; రాయుడు (బి) మిశ్రా 25; క్రునాల్ పాండ్యా రనౌట్ 36; బట్లర్ ఎల్బీడబ్ల్యు (బి) మిశ్రా 2; పొలార్డ్ (సి) మోరిస్ (బి) జహీర్ 19; హార్దిక్ నాటౌట్ 2; హర్భజన్ ఎల్బీడబ్ల్యు (బి) మోరిస్ 0; సౌతీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1-9; 2-62; 3-103; 4-110; 5-144; 6-152; 7-152. బౌలింగ్: జహీర్ 4-0-30-1; షమీ 3-0-24-0; నేగి 1-0-19-0; మోరిస్ 4-0-27-1; మిశ్రా 4-0-24-2; తాహిర్ 4-0-29-0. -
కెప్టెన్ల పోరులో... రోహిత్ జోరు
► కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ విజయం ► 188 పరుగులను ఛేదించిన రోహిత్ బృందం ► బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఇటు గంభీర్, అటు రోహిత్... ఇద్దరు కెప్టెన్ల నాణ్యమైన, బాధ్యతాయుత ఇన్నింగ్స్. ఇటు రసెల్, అటు బట్లర్... ఇద్దరు విదేశీ హిట్టర్ల మెరుపులు. చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో సమ ఉజ్జీల సమరంలా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ జట్టు పైచేయి సాధించింది. అవడానికి ఈడెన్ గంభీర్ జట్టుకు సొంతమైదానమే అయినా... ఇక్కడ అద్బుతమైన రికార్డు ఉన్న రోహిత్ శర్మ మరోసారి అదే జోరుతో ముంబైని గెలిపించాడు. కోల్‌కతా: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో విజయాల బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో పుణే చేతిలో ఘోరంగా ఓడిన రోహిత్ సేన వేగంగా కోలుకుని కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. 188 పరుగుల భారీ లక్ష్యం కళ్లముందున్నా... రోహిత్ శర్మ (54 బంతుల్లో 84 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు... జాస్ బట్లర్ (22 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు తోడవడంతో... మరో ఐదు బంతులు మిగిలుం డగానే 6 వికెట్లతో గంభీర్ సేనను ఓడించింది. ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 187 పరుగులు చేసింది. కెప్టెన్ గంభీర్ (52 బంతుల్లో 64; 4 ఫోర్లు, 1 సిక్సర్) యాంకర్ పాత్ర పోషించి అర్ధసెంచరీ చేశాడు. మనీష్ పాండే (29 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడి అర్ధసెంచరీ చేయగా... రసెల్ (17 బంతుల్లో 36; 1 ఫోర్, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుత భాగస్వామ్యం కోల్‌కతా జట్టు ఈ మ్యాచ్‌కు నరైన్ అందుబాటులో ఉన్నా ఆశ్చర్యకరంగా తుది జట్టులోకి తీసుకోలేదు. ఓపెనర్లు ఉతప్ప, గంభీర్ ఆచితూచి ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే మెక్లీనగన్ బౌలింగ్‌లో షార్ట్ బంతిని ఆడబోయి ఉతప్ప (8) అవుటయ్యాడు. ఈ దశలో గంభీర్, మనీష్ పాండే కలిసి అద్భుతంగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతుల్ని బౌండరీలకు పంపుతూ రన్‌రేట్ తగ్గకుండా చూశారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 60 బంతుల్లోనే 100 పరుగులు జోడించారు. ఈ క్రమంలో గంభీర్ 39 బంతుల్లో, పాండే 26 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో హర్భజన్ టాప్ స్పిన్‌తో మనీష్ పాండేను అవుట్ చేశాడు. రసెల్ ఆడిన నాలుగో బంతికే సిక్సర్ బాదాడు. అదే జోరులో మరో మూడు సిక్సర్లు కొట్టడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. అయితే చివరి మూడు ఓవర్లలో ముంబై బౌలర్లు పుంజుకుని పరుగులను నియంత్రించారు. మెరుపు ఆరంభం లక్ష్య ఛేదనలో సిక్సర్‌తో ఖాతా తెరచిన రోహిత్ ఇన్నింగ్స్ ఆద్యంతం నిలకడగా ఆడాడు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన పార్థీవ్ పటేల్ కూడా జోరు కనబరిచాడు. అయితే పవర్ ప్లే చివర్లో లేని పరుగుకు వెళ్లి రనౌటయ్యాడు. పార్థీవ్, రోహిత్ తొలి వికెట్‌కు 35 బంతుల్లో 53 పరుగులు జోడించి ముంబైకి మెరుపు ఆరంభాన్నిచ్చారు. హార్దిక్ పాండ్యా నిరాశపరిచినా... పించ్ హిట్టర్‌గా వచ్చిన మెక్లీనగన్ (8 బంతుల్లో 20; 3 సిక్సర్లు) వేగంగా ఆడాడు. మరో ఎండ్‌లో కుదురుగా ఆడిన రోహిత్ 38 బంతుల్లో అర్ధసెంచరీ మార్కును చేరుకున్నాడు. బట్లర్ రెండు ఫోర్లు, సిక్సర్‌తో వేగంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ముంబై విజయానికి చివరి ఐదు ఓవర్లలో 49 పరుగులు అవసరమైన దశలో... బట్లర్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో చివరి రెండు ఓవర్లలో విజయానికి 18 పరుగులు అవసరం కాగా..... రసెల్ బౌలింగ్‌లో బట్లర్ అవుటయ్యాడు. అయితే 19వ ఓవర్లోనే రోహిత్ నాలుగు ఫోర్లు కొట్టడంతో ముంబై విజయం ఖరారయింది. స్కోరు వివరాలు: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) పొలార్డ్ (బి) మెక్లీనగన్ 8; గంభీర్ (సి) పార్థీవ్ (బి) పాండ్యా 64; మనీష్ పాండే (సి) అండ్ (బి) హర్భజన్ 52; ఆండ్రీ రసెల్ (బి) మెక్లీనగన్ 36; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 9; మున్రో రనౌట్ 4; సూర్యకుమార్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1-21; 2-121; 3-164; 4-170; 5-183. బౌలింగ్: సౌతీ 4-0-43-0; బుమ్రా 4-0-32-0; మెక్లీనగన్ 4-0-25-2; హార్దిక్ పాండ్యా 2-0-22-1; హర్భజన్ 4-0-31-1; సుచిత్ 2-0-31-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ నాటౌట్ 84; పార్థీవ్ పటేల్ రనౌట్ 23; హార్దిక్ పాండ్యా (సి) పాండే (బి) చావ్లా 9; మెక్లీనగన్ (సి) మున్రో (బి) కుల్దీప్ 20; బట్లర్ (సి) సూర్యకుమార్ (బి) రసెల్ 41; పొలార్డ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1-53; 2-87; 3-109; 4-175. బౌలింగ్: రసెల్ 4-0-52-1; హేస్టింగ్స్ 4-0-31-0; హాగ్ 4- 0-37-0; చావ్లా 3.1-0-29-1; కుల్దీప్ 4-0-37-1.