breaking news
meeting with employees
-
ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం సమావేశం
హైదరాబాద్ : ఉద్యోగ సంఘాల నాయకులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాల నాయకుల సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘంతో కలసి ప్రగతి భవన్లో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని, సెలవు దినాల్లో కూడా ఉద్యోగులు పని చేశారని కొనియాడారు. రెవిన్యూ రికార్డులను విజయవంతంగా ప్రక్షాళన చేశామని వెల్లడించారు. రెవిన్యూ వసూళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, పీఆర్సీపై త్రిసభ్య కమిటీ వేశామని, ఆగస్టు 15 లోపు రిపోర్టు వచ్చేలా ఆదేశిస్తామని చెప్పారు. బదిలీల విధివిధానాలపై అజయ్ మిశ్రా అధ్యక్షతన కమిటీ వేశామని, ఉద్యోగుల బదిలీల్లో దంపతులకు ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. జోనల్ విధానంపై కేబినేట్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేసీఆర్ కిట్ల వల్ల ప్రభుత్వ వైద్యులపై మూడు రెట్ల పని భారం పెరిగిందని, వారి సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పారు. -
బడ్జెట్‌పై రెండో రోజూ కేసీఆర్ కసరత్తు
- ఆర్థిక మంత్రి ఈటెల సహా అధికారులతో భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ తయారీపై వరుసగా రెండో రోజు కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు. తొలి బడ్జెట్ తరహాలో కాకుండా వాస్తవాలను ప్రతిబింబించేలా బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే గతేడాదితో పోలిస్తే ఇంచుమించు అదే స్థాయిలో బడ్జెట్‌ను రూపొందించాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఉన్న న్యాక్‌లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఆ విభాగం ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, సలహాదారు జీఆర్ రెడ్డితోపాటు ఇతర అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలకు నిధుల కేటాయింపులు, కేజీ టూ పీజీ, డబుల్ బెడ్రూం పథకాలకు సంబంధించిన అంశాలు ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్ వెలువడటంతో రాష్ట్రానికి వచ్చే నిధులపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లోనే తుది కసరత్తును పూర్తి చేసి బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దాలని నిర్ణయించారు. అన్ని విభాగాల కార్యదర్శులతో సమావేశమై శాఖాపరమైన కేటాయింపులపై తుది నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావించినా ఆదివారం జరిగిన చర్చలను ఆర్థికశాఖ అధికారులకే పరిమితం చేశారు. మార్చి 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం తెలిసిందే.