breaking news
Maulivakkam
-
హమ్మయ్య..కూల్చేశారు
► రెప్ప పాటులో నేలమట్టం ► ఊపిరి పీల్చుకున్న మౌళివాక్కం వాసులు ► ఉత్కంఠ భరితంగా సాగిన కూల్చివేత ► శబ్దంతో దద్దరిళ్లిన పరిసరాలు ►చిమ్మ చీకటి...నానా యాతన ఏ సమయంలో మళ్లీ ఎలాంటి ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుందో అన్న ఆందోళనతో ఉన్న మౌళివాక్కం వాసులు బుధవారం హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్కంఠ భరితంగా సాగిన మిషన్ మౌళివాక్కం ఎట్టకేలకు విజయవంతమైంది. ప్రమాదకరంగా దర్శనం ఇస్తూ వచ్చిన 11 అంతస్తుల భవనాన్ని రెప్ప పాటు వ్యవధిలో మ్యాగ్లింక్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వర్గాలు నేల మట్టం చేశాయి. ఈ సమయంలో భారీ శబ్దంతో ఆ పరిసరాలు దద్దరిళ్లావయి. కూల్చివేత జాప్యంతో ఆ పరిసరాలు చిమ్మ చీకట్లో మునిగాయి. ఆ పరిసర వాసులు నానా యాతన పడాల్సి వచ్చింది. అయితే, ఆ భవనం కూల్చి వేయడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, చెన్నై: 2014 జూన్ 28వ తేదీ సాయంత్రం చెన్నైలో చోటుచేసుకున్న భారీ ప్రమాదం గురించి తెలిసిందే. దక్షిణ భారత దేశ చరిత్రలో ప్రపథమంగా మౌళివాక్కంలో నిర్మాణంలో ఉన్న ప్రైమ్ సృష్టి సంస్థకు చెందిన 11 అంతస్తుల భవనం కుప్పకూలడం సర్వత్రా ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనలో ఉత్తరాంధ్ర, తమిళనాడు, ఒడిశాలకు చెందిన 61 మంది విగతజీవులయ్యారు. మరో 26 మంది గాయపడ్డారు. నిర్మాణ లోపం కారణంగానే భవనం కుప్పకూలిందని నిర్ధారణ కావడంతో ఆ పరిసర వాసుల్లో ఆందోళన రెట్టింపు అయింది. ఇందుకు కారణం ఆ భవనం పక్కనే నిర్మాణంలో ఉన్న మరో 11 అంతస్తుల భవనం రూపంలో తమకు ఎలాంటి ప్రమాదం మున్ముందు ఎదురు అవుతుందో అన్న బెంగ రెండేళ్లుగా నెలకొంది. ఎట్టకేలకు ఆ భవనం కూడా బలహీనంగా ఉన్నట్టుగా నిర్ధారణ కావడంతో కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఉత్కంఠగా: సెప్టెంబరులో భవనం కూల్చాల్సి ఉండగా, చివరి క్షణంలో వాయిదా పడింది. ఎట్టకేలకు బుధవారం భవనాన్ని కూల్చి వేయడానికి తగ్గ కసరత్తులు చేపట్టారు. మౌళివాక్కం పరిసరాల్లో ట్రాఫిక్ మార్పులు చేశారు. పోరూర్, కుండ్రత్తూరు, మాంగాడు పరిసరాల్లోనూ పూర్తిగా విద్యుత్ సరఫరా నిలుపుదల చేశారు. మౌళివాక్కంలో ఉన్న మూడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇక, ఆ భవనానికి 200 మీటర్లలోపు ఉన్న ఇళ్లల్లోని ప్రజల్ని ఖాళీ చేయించారు. మొత్తంగా 130 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో కొందర్ని సమీపంలోని కల్యాణ మండపాలకు తరలించారు. మరి కొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి. తమిళనాడు చరిత్రలో ప్రపథమంగా నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భారీ భవనాన్ని కుప్పకూల్చనున్నడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. మీడియా దృష్టి అంతా మౌళివాక్కం వైపుగా మరలింది. ఆ భవనకు 250 మీటర్లకు అవతల నుంచి ప్రత్యక్ష ప్రసారాలకు కసరత్తులు చేసుకున్నారు. ఆ ప్రదేశాల్లోని భవనాల మీద నుంచి జనం కూల్చనున్న భవనం వైపుగా ఉత్సాహంతో ఎదురు చూశారు. అరుుతే, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్ని రకాల కసరత్తులు, తదుపరి ఉత్కంఠ బయలు దేరింది. పది అగ్నిమాపక వాహనాలు, మరో పది అంబులెన్సలు 150 మీటర్ల వ్యవధిలో సిద్ధంగా ఉంచారు. పన్నెండు బృందాలుగా ఏర్పడ్డ పోలీసు, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు ఆ పరిసరాల్లోని చుట్టుముట్టారు. వాకి టాకీల ద్వారా ఎప్పటికప్పుడు సమాచార బదలాయింపుల్లో నిమగ్నం అయ్యారు. రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో భవనం కుప్పకూలనున్నట్టు ప్రకటించడంతో, అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే, ఆ సమయం దాటినా భవనం కూల్చలేదు. ఐదు గంటలకు అంటూ ఓ మారు, ఆరు గంటలకు అంటూ మరో మారు సమయాన్ని పొడిగించుకుంటూ వెళ్లడంతో ఉత్కంఠ తప్పలేదు. అదే సమయంలో పలు మార్లు వర్షం పడడంతో ఉత్కంఠ రెట్టింపు అయింది. చిమ్మ చీకటి : ఆ భవనం దరిదాపుల్లోనే కాదు, మౌళి వాక్కం రోడ్డు వైపుగా ఏ ఒకర్నీ అనుమతించక పోవడంతో అసలు ఏమి జరుగుతున్నదో అన్న ఉత్కంఠ బయలు దేరింది. ఐదు గంటల కంతా భవనం కూల్చేస్తారని, ఇక తమ ఇళ్లకు వెళ్ల వచ్చని భావించిన వాళ్లకు తిప్పలు తప్పలేదు. ఆరు గంటలైనా ఎవర్నీ బయటకు పంపలేదు. అటు వైపుగా వాహనాలను అనుమతించక పోవడంతో ఇతర మార్గాల్లో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. ఇక, ఎటు చూసినా చిమ్మ చీకటే. విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగడంతో ఆ పరిసరాలు అంధకారంలో మునిగారుు. దీంతో జనానికి యాతన తప్పలేదు. ఓ దశలో సమయం అయ్యే కొద్ది, ఇక, ఈ భవనం కూల్చేది అనుమానమేనా అన్న ప్రశ్న బయలు దేరింది. చీకటి ఓ వైపు రాత్రి ఏడు కావస్తుండడం మరో వైపు వెరసి అనుమానాలకు బలం చేకూర్చేలా చేశాయి. అయితే, అక్కడ పేలుడు పదార్థాలను అమర్చిన దృష్ట్యా, మిషన్ ఆగిన పక్షంలో మరెదేని ప్రమాదం తప్పదేమో అన్నంతగా ఆందోళన బయలు దేరింది.అయితే, ఈ భవనం కూల్చి వేతకు తగ్గ నివేదిక శుక్రవారం కోర్టులో సమర్పించాల్సి ఉండడంతో , నేలమట్టం చేసి తీరాలన్న సంకల్పంతో సీఎండీఏ వర్గాలు ముందుకు సాగాయి. హమ్మయ్యా : మ్యాగ్ లింక్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఏడుగురితో కూడి బృందం ఈ 11 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేయడానికి నెలన్నర పాటుగా శ్రమించింది. పరిశోధనలు, పరిశీలనల అనంతరం 70 కేజీల ఆర్డీఎక్స్, గన్ పౌడర్, రసాయనాలు తదితర మిశ్రమంతో తయారు చేసిన పేలుడు పదార్థాలను ఆ భవనంలో 150 చోట్ల రంధ్రం వేసి అమర్చారు. అన్నింటినీ అనుసంధానించే విధంగా పకడ్బందీగా ఇన్ ఫ్లోజర్ పద్ధతిలో ఆ భవన్నాని కూల్చేందుకు కార్యచరణ సిద్ధం చేశారు. గ్రౌండ్, మొదటి, ఐదో అంతస్తులో ఈ పేలుడు పదార్థాలను ఉంచారు. మూడు రిమోట్ల ఆధారంగా పేల్చేందుకు సర్వం సిద్ధం చేసినా, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సమయాన్ని నెట్టుకు వచ్చినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. చివరకు నాలుగు, ఆరో అంతస్తులోనూ పేలుడు పదార్థాలను అమర్చి సరిగ్గా ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వ్యవధిలో రిమోట్ బట్ నొక్కగానే రెప్ప పాటు వ్యవధి(రెండు, మూడు సెకన్ల)లో ఆభవనం నేల మట్టం అయింది.ఈ సమయంలో రెండు వందల యాభై మీటర్ల మేరకు శబ్దంతో పాటు భూమిలో ప్రకంపన వచ్చినట్టుగా, శిథిలాల పొగ కమ్మేయడం గమనార్హం. అదే సమయంలో మరో ఐదు నిమిషాల్లో అక్కడ సిద్ధంగా ఉన్న అగ్నిమాపక వాహనాల ద్వారా ఆ భవనం వైపుగా నీటిని చల్లి పొగను అణచి వేసే పనిలో పడ్డారు. ఈ భవనం కుప్పకూలడంతో మౌళివాక్కం వాసులే కాదు, ఆ భవనం చుట్టూ నివాసం ఉంటున్న వాళ్లు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. విజయవంతం : ప్రమాదకరంగా ఉన్న 11 అంతస్తుల భవనం నేలమట్టం కావడంతో మ్యాగ్ లింక్ సంస్థ నిర్వాహకుడు పొన్ములింగం మీడియాతో మాట్లాడారు. తాము ముందుగా రచించిన వ్యూహం, తీసుకున్న నిర్ణయాల మేరకు భవనాన్ని నేలమట్టం చేయడంలో సంపూర్ణ విజయవంతం అయ్యామని పేర్కొన్నారు. కొన్ని పరిశీలను, పరిశోధనలు, ఇతర విస్పోటనాలకు, ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వని రీతిలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవశ్యం ఉన్న దృష్ట్యా, సమయం పొడిగించక తప్పలేదన్నారు. అన్ని రకాల పేలుడు పదార్థాల మిశ్రమంతో నేలమట్టం చేశామని, ఈ భవనం కూల్చి వేతకు ఖర్చు సుమారు రూ. 50 లక్షలుగా పేర్కొన్నారు.కాగా, ఆ భవనం కుప్పకూలడంతో పక్క పక్కనే ఉన్న నివాసాల్లో ఏదేని పగుళ్లు ఏర్పడ్డాయా...? అన్నది తేలాల్సి ఉంది. ఇక, ఈ భవనం నేలమట్టంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేసినా, గత కొంత కాలంగా మూత బడి ఉన్న ఆ భవనాన్ని ఆశ్రయంగా చేసుకుని ఉన్న పక్షులకు నీడ కరువైనట్టే. ఇందుకు నిదర్శనం భవనం నేలమట్టం అవుతోన్న సమయంలో వచ్చిన భారీ శబ్దంతో అక్కడ పెద్ద ఎత్తున ఉన్న ఎత్తున పక్షులు ఆందోళనతో ఆకాశం వైపుగా ఎగరడం కొసమెరుపు. -
నివేదికలో నిందితులు ఎవరో?
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై మౌళివాక్కంలోని అపార్టుమెంటు కూలిన ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ సోమవారం తన నివేదికను సీఎం జయలలితకు సమర్పించింది. దీంతో నివేదికలో పేర్కొన్న నిందితులు ఎవరోనన్న ఉత్కంఠకు తెరలేచింది. చెన్నై పోరూరు మౌళివాక్కంలో 11 అంతస్తుల అపార్టుమెంటు జూన్ 28న కుప్పకూలిపోయింది. అపార్టుమెంటు శిథిలాల కింద 61 మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణ దశలోనే భారీ అపార్టుమెంటు నిలువునా కూలిపోవడం, భారీ సంఖ్యలో ప్రాణ నష్టం ఏర్పడటం రాష్ట్రాన్నే కుదిపివేసింది. అపార్టుమెంటుకు చెన్నై మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (సీఎండీఏ) అధికారులు ఇచ్చిన అనుమతులపై విమర్శలు వెల్లువెత్తాయి. భారీ వర్షానికే కూలిపోయేంతటి లోపభూయిష్ట నిర్మాణమా అంటూ భవన నిర్మాణ సంస్థపై ఆగ్రహాలు పెల్లుబికాయి. ప్రజలు రెచ్చిపోవడాన్ని గమనించిన ప్రభుత్వం వెంటనే అపార్టుమెంటు యజమాని, ఇంజనీర్లు సహా ఏడుగురిని అరెస్ట్ చేసింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, నిందితులు ఎవరో తేల్చాలని కోరుతూ రిటైర్డు న్యాయమూర్తి రఘుపతి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను జూలై 3న సీఎం జయలలిత నియమించారు. ఇప్పటికే అనేక కమిషన్లను నిర్వహిస్తున్న రఘుపతికి మరో బాధ్యత అప్పగించడంపై డీఎంకే కోశాధికారి స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జయలలిత కనుసన్నల్లో మెలిగే రిటైర్డు న్యాయమూర్తి రఘుపతి నాయకత్వంలో జరిగే విచారణపై తమకు నమ్మకం లేదని, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో స్టాలిన్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో నీటికుంట ఉన్న ప్రాంతంలో 11 అంతస్తుల భారీ అపార్టుమెంటు నిర్మాణానికి అనుమతులు ఎలా మంజూరు చేశారంటూ సీఎండీఏ అధికారులపై కొందరు మండిపడ్డారు. అనుమతుల మంజూరులో తప్పిదం లేదు, నిర్మాణంలో నాణ్యత లేమికి అధికారులు బాధ్యత వహించాలని ప్రభుత్వం సీఎండీఏ అధికారులను వెనకేసుకు వచ్చింది. జూలై 11న ఏకసభ్య కమిషన్ సంఘటనా స్థలాన్ని సందర్శించడం ద్వారా విచారణను ప్రారంభించింది. సీఎండీఏ అనుమతులను సైతం పరిశీలించనున్నట్లు ఏకసభ్య కమిషన్ ప్రకటించింది. ఇలా అనేక వివాదాలు, విమర్శల నేపథ్యంలో ఎట్టకేలకూ ఏకసభ్య కమిషన్ తన విచారణను పూర్తిచేసింది. రిటైర్డు న్యాయమూర్తి రఘుపతి సోమవారం మధ్యాహ్నం చెన్నై సచివాలయంలో సీఎం జయలలితను కలిసి నివేదికను సమర్పించారు. మరో అపార్టుమెంటు మాటేమిటి? కుప్పకూలిన అపార్టుమెంటు పక్కనే మరో 11 అంతస్తుల అపార్టుమెంటు ఉంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెండో దాన్ని అధికారులు సీజ్ చేశారు. రెండో అపార్టుమెంటు నాణ్యతపై కూడా అనుమానాలు ఉన్నందున కూల్చివేయాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఆ పరిసర ప్రాంతాల ఇళ్లను ఖాళీ చేయించారు. ఏకసభ్య కమిషన్ విచారణ పూర్తికాగానే రెండు అపార్టుమెంట్ల కూల్చివేతపై తేదీ ఖరారు అవుతుందని అధికారులు చెబుతున్నారు. రెండో అపార్టుమెంటు ఎక్కడ కూలుతుందోనని మౌళివాక్కం ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంతకూ రెండో అపార్టుమెంటును స్వచ్ఛందంగా కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారా? మొదటి అపార్టుమెంటు ప్రమాదానికి అసలైన కారకులు ఎవరు? ఇందులో అధికారుల పాత్ర ఏమైనా ఉందా? అనే అనుమానాలు ప్రజల మెదళ్లను తొలచివేస్తున్నాయి. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక వివరాలను త్వరలో ప్రభుత్వమే వెల్లడి చేస్తుందని ఎదురుచూస్తున్నారు.