breaking news
Matrimony dot com
-
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లోన్ కావాలా? అయితే..
చెన్నై: వివాహ బంధాలకు వేదికగా ఉన్న మ్యాట్రిమోనీ డాట్ కామ్ మరో అడుగు ముందుకేసింది. పెళ్లి వేడుకకు రుణం సమకూర్చేందుకు వెడ్డింగ్‌లోన్స్ డాట్ కామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఐడీఎఫ్సీ, టాటా క్యాపిటల్, లార్సెన్ అండ్ టూబ్రో ఫైనాన్స్‌తో చేతులు కలిపింది.వివాహ ప్రణాళిక, బడ్జెట్, అమలు ప్రక్రియను సులభతరం చేయడానికి సేవలను విస్తరిస్తున్నట్టు మ్యాట్రిమోనీ డాట్ కామ్ సీఈవో మురుగవేల్ జానకిరామన్ తెలిపారు. ఈ సంస్థ పెళ్లిళ్ల కోసం రూ. 1 లక్ష నుండి రూ.1 కోటి వరకూ రుణాలను అందజేస్తుంది. నెలవారీ ఈఎంఐ కాలపరిమితి 30 సంవత్సరాల వరకు ఉంటుంది.2024లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన సమయంలో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనాల ప్రకారం, నవంబర్ 12 నుండి డిసెంబర్ 16 మధ్య వివాహాలు జరిగే సీజన్లో దాదాపు 48 లక్షల జంటలు పెళ్లి చేసుకోనున్నాయి. -
పెళ్లి ఖర్చులో అమ్మాయిల దూకుడు
సాక్షి, హైదరాబాద్ : పెళ్లంటే ఆకాశమంతా పందిరి.. భూదేవంత పీట వేసి కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలని యువతీయువకులు కలలు కంటారు. ఎవరి తాహతుకు తగ్గట్లు వారు ఖర్చు పెడతారు. పెళ్లి, ఖర్చుల విషయంలో యువతులు, యువకులు ప్రణాళికలపై పెళ్లి సంబంధాలు కుదిర్చే ప్రముఖ వెబ్సైట్ ‘మాట్రిమోనీ డాట్ కామ్’తాజాగా సర్వే నిర్వహించింది. పెళ్లి ఖర్చు విషయంలో యువకులతో పోల్చితే యువతులే ఓ మెట్టు ఎత్తులో ఉన్నట్లు ఇందులో తేలింది. కాస్త ఎక్కువ ఖర్చు చేసేందుకే వారు మొగ్గుచూపుతున్నారు. ఈ సర్వేలో మొత్తం 9,246 మంది తమ అభిప్రాయాలను తెలిపారు. వారిలో 20.6 శాతం యువతులు పెళ్లికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు ఖర్చు చేయాలని భావిస్తుండగా.. అంత ఖర్చుకు 11.2 శాతం యువకులే సంసిద్ధత వ్యక్తం చేశారు. రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేసేందుకు 6.1 శాతం యువతులు సై అనగా.. ఇందుకు 3.01 శాతం యువకులే ఓకే చెప్పారు. రూ.50 లక్షలకు మించి ఖర్చు చేయాలని 2.06 శాతం యువతులు, 1.59 శాతం యువకులు ప్రణాళికల్లో ఉన్నారు. ఉత్తరాదిలో ఖర్చులు ఎక్కువ.. దక్షిణాదితో పోలిస్తే ఉత్తర భారతీయుల పెళ్లి ఖర్చులు ఎక్కువే. పెళ్లికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఖర్చు చేసేందుకు 18.6 శాతం ఉత్తరాదివారు సై అంటుండగా.. దక్షిణాదివారు 12 శాతం ఉన్నారు. అంత మొత్తం వెచ్చించేందుకు పశ్చిమ భారతీయులు 11.1% , తూర్పు భారతీయులు 10.9% సంసిద్ధత వ్యక్తం చేశారు. ఏటా దేశంలో కోటి నుంచి 1.2 కోట్ల పెళ్లిళ్లు జరుగుతున్నాయని కేపీఎంజీ కన్సల్టెన్సీ 2014లో రూపొందించిన ఓ నివేదికలో పేర్కొంది. పెళ్లి ఆభరణాలకు.. పెళ్లి ఆభరణాలపై రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఖర్చు చేయాలనే ప్రణాళికలతో ఉన్నామని 22.14 శాతం యువతులు, 19.52% యువకులు తెలిపారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేయాలని 13% యువతులు, 8.1 % యువకులు ఆలోచిస్తున్నారు. రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేస్తామని 13.89% యువతులు, 6% యువకులు పేర్కొన్నారు. ఆభరణాలపై రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేసేందుకు 50.98% యువతులు, 66.24% యువకులు ఇష్టంగా ఉన్నారు. వివాహ విందుకు.. వివాహ విందు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేయాలని 31.84 శాతం యువతులు, 27.62 శాతం యువకులు భావిస్తున్నారు. రూ.5 లక్షలకు మించి ఖర్చు చేయాలని 7.87 శాతం యువతులు, 6.9 శాతం యువకులు ఆలోచిస్తున్నారు. వివాహ విందు భోజనం విషయంలోనూ ఉత్తరాది వారే ముందున్నారు. విందుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేయాలని 35.32 శాతం ఉత్తర, 29.36 శాతం తూర్పు, 26.49 శాతం దక్షిణ, 25.78 శాతం పశ్చిమ భారతీయులు భావిస్తున్నారు. ♦ విదేశాల్లో పెళ్లి చేసుకునేందుకు 27 శాతం యువకులు, 19.3 శాతం మంది యువతులు ఇష్టం చూపారు. ♦ 40.31 శాతం యువకులు, 36.21 శాతం యువతులు వెడ్డింగ్ ప్లానర్ సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ♦ ఫొటోగ్రఫీకి రూ.50 వేల నుంచి రూ.లక్ష ఖర్చు చేయాలని 27.08 శాతం యువతులు, 25.84 శాతం యువకులు ఆలోచిస్తున్నారు. రూ.లక్షకు పైగా ఖర్చు చేసేందుకు 5.85 శాతం యువతులు, 5.70 శాతం యువకులు యోచిస్తున్నారు. ♦ వస్త్రాలపై రూ.లక్షకు పైగా ఖర్చు చేయాలని 20.22 శాతం యువతులు, 15.24 శాతం యువకులు ఆలోచిస్తున్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేస్తామని 40.67 శాతం యువతులు, 39.92 శాతం యువకులు తెలిపారు. ♦ పెళ్లి మండపం కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు చేయాలని 25.12 శాతం యువతులు, 22.02 శాతం యువకులు ఆలోచిస్తున్నారు. రూ.2 లక్షలకు మించి ఖర్చు చేయాలని 6.74 శాతం యువతులు, 5.81 శాతం యువకులు భావిస్తున్నారు. హనీమూన్ కోసం.. లింగ భేదంతో సంబంధం లేకుండా పెళ్లి తర్వాత గోవా, కేరళ, సిమ్లా, మనాలీలకు హనీమూన్ కోసం వెళ్లాలని యువతీయువకులు ఆశిస్తున్నారు. విదేశాల్లో హనీమూన్ కోసం స్విట్జర్లాండ్, మాల్దీవులు, సింగపూర్ వెళ్లాలని కోరుకుంటున్నారు. -
పెళ్లి ప్రకటనే పెట్టుబడి
వరుడు కావాలని ప్రొఫైల్ క్రియేట్ చేసిన వివాహిత ఎన్ఆర్ఐనని నమ్మించి రూ.35 లక్షలు కాజేత సీీసీఎస్ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన నిందితురాలు సిటీబ్యూరో: ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మోసానికి పాల్పడింది. సీసీఎస్ డీసీపీ పాలరాజు కథనం మేరకు..బేగంపేటకు చెందిన మాలవిక (32)కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి కోసం వరుడు కావాలని మ్యాట్రిమోని డాట్ కామ్ వెబ్సైట్లో త న తప్పుడు ప్రొఫైల్‌ను పెట్టింది. చిన్న పిల్లల వైద్యురాలినని.. ప్రొఫైల్‌లో ‘తాను అమెరికాలో పుట్టాను. ఇండియాలో అమ్మమ్మ చనిపోవడంతో తాతయ్య ఆరోగ్యం చూసుకునేందుకు వచ్చాను. తాను చిన్న పిల్లల నిపుణుల డాక్టర్ని, నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తాను. ఇంకా పెళ్లి చేసుకోలేదు. వరుడు కావలెను. నాకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయని’ పేర్కొంది. ట్రాప్‌లో పడ్డ ఎన్ఆర్ఐ ఆమె ప్రొఫైల్‌ను చదివి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు జి.ప్రశాంత్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. ప్రేమలో పడ్డ అతగాడు ప్రతిరోజు సెల్‌ఫోన్, ఇంటర్నెట్లో వీడియో చాట్ చేసేవాడు. తన అవసరాల నిమిత్తం కొంత డబ్బు కావాలని కోరడంతో ఆమె అకౌంట్లోకి విడతల వారీగా మొత్తం రూ.35 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక పెళ్లి చేసుకునేందుకు గత నవంబర్‌లో ప్రశాంత్ ఇండియాకు రావడంతో ఆమె గుట్టు రట్టు అయ్యింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై చీటింగ్ కేసు నమోదైంది. అయితే ఆమె మకాం మార్చడంతో పోలీసులకు దొరకలేదు. దర్యాప్తులో భాగంగా ఆమె ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు కనుగొన్నారు. విచారణ నిమిత్తం సీసీఎస్‌కు రావాలని పోలీసులు కోరారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆమె సీసీఎస్ కార్యాలయం వద్దకు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆమె బ్యాగ్‌లో సూసైడ్ నోట్ లభించింది. అందులో..తన పరువు పోయిందని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటుంది.