breaking news
massive exploitation
-
‘వైకుంఠపురం’లో పట్టిసీమ వ్యూహం
సాక్షి, అమరావతి: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ‘బోనస్’ పేరుతో కాంట్రాక్టర్‌తో కలిసి రూ.376.14 కోట్లు దోచేసిన తరహాలోనే వైకుంఠపురం బ్యారేజీ పనుల్లోనూ రూ.500 కోట్లకుపైగా కాజేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. అంతర్గత అంచనా విలువ (ఐబీఎం) కంటే ఐదు శాతం ఎక్కువ ధర కోట్ చేస్తూ కాంట్రాక్టర్లు షెడ్యూళ్లు దాఖలు చేస్తే.. జీవో 94 ప్రకారం ఆ టెండర్లను రద్దు చేయాలి. కానీ, ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌తో 24.99 శాతం అధిక ధర (ఎక్సెస్) కోట్ చేస్తూ దాఖలు చేసే షెడ్యూల్‌ను ఆమోదించాలని సోమవారం సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు జలవనరుల శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో 4.99 శాతం ఎక్సెస్.. రెండేళ్లలో పనులు పూర్తి చేస్తే 20 శాతం బోనస్(ప్రతి ఆరు నెలలకు లక్ష్యం మేరకు పనులు చేస్తే 5 శాతం చొప్పున బోనస్) ఇచ్చేలా షరతు విధించి.. పట్టిసీమ ఎత్తిపోతల తరహాలోనే వైకుంఠపురం టెండర్‌నూ కేబినెట్లో ఆమోదిస్తామని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాజధాని అమరావతిలో తాగు, పారిశ్రామిక నీటి అవసరాల కోసం కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణ పనులకు రూ.801.8 కోట్ల అంచనా వ్యయంతో గతేడాది జూలై 9న ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ విధానంలో ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. వైకుంఠపురం బ్యారేజీ పనులను తనకు బాగా కావాల్సిన నవయుగ సంస్థకే అప్పగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆ సంస్థకే పనులు దక్కేలా నిబంధనలతో అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అంచనా వ్యయం పెంచకపోతే గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్ పేచీ పెట్టారు. ఉన్నతస్థాయి ఒత్తిళ్ల మేరకు నవయుగను కాదని ఇతర కాంట్రాక్టర్లు షెడ్యూళ్లు దాఖలు చేయకపోవడంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. అంచనా వ్యయం పెంచేసినా.. ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన జలవనరుల శాఖ అధికారులు బ్యారేజీ పనులతోపాటు రాజధానికి 10 క్యూమెక్కుల నీటిని తరలించే పథకాన్ని కలిపి ఒకే ప్యాకేజీ కింద రూ.1,025.98 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచేసి ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ) విధానంలో 2018 ఆగస్టు 31న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ధరలకు కూడా కాంట్రాక్టర్ సంతృప్తి వ్యక్తం చేయలేదు. అంచనా వ్యయాన్ని మరింతగా పెంచేయాలంటూ మొండికేశారు. దాంతో ఆ టెండర్‌ను రద్దుచేసి, అంచనా వ్యయాన్ని రూ.1,075.15 కోట్లకు పెంచేసి, అక్టోబర్ 25న ముచ్చటగా మూడోసారి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినా కాంట్రాక్టర్ కనికరించలేదు. తాజా ధరల మేరకు అంచనా వ్యయాన్ని సవరించాలని పట్టుబట్టారు. ముఖ్యమంత్రి ఎంపిక చేసిన కాంట్రాక్టర్ అడ్డం తిరిగిన నేపథ్యంలో ఆ టెండర్‌ను కూడా రద్దు చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా.. వైకుంఠపురం బ్యారేజీ పనులను నవయుగ సంస్థకు కట్టబెట్టి, భారీగా కమీషన్లు వసూలు చేసుకోవడానికి వ్యూహం రచించిన సీఎం చంద్రబాబు.. ఆ పనులకు తక్షణమే టెండర్లు పిలవాలంటూ 20 రోజులుగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో వారం రోజుల గడువుతో స్వల్పకాలిక టెండర్ నోటిఫికేషన్ జారీచేసి, తాను సూచించిన కాంట్రాక్టర్‌కే పనులు కట్టబెట్టాలని అంటున్నారు. ఈ మేరకు అంతర్గత అంచనా విలువను రూ.1,459 కోట్లకు పెంచేస్తూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ధరలతో కూడా సీఎం చంద్రబాబు, కాంట్రాక్టర్ తృప్తి పడలేదని సమాచారం. బోనస్ పేరుతో బొక్కేద్దాం.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులకు 2015లో రూ.1,170.25 కోట్లను ఐబీఎంగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎం చంద్రబాబుతో కుదిరిన ఒప్పందం మేరకు కాంట్రాక్టర్ 21.9991 శాతం అధిక ధరలు కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేశారు. జీవో 94 ప్రకారం ఈ టెండర్‌ను రద్దు చేయాలి. కానీ, చంద్రబాబు జోక్యం చేసుకుని.. జీవో 94 ప్రకారం 5 శాతం అధిక ధరలతోపాటు ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తే 16.9991 శాతం బోనస్ ఇస్తామని ఆఫర్ ప్రకటించి, టెండర్‌కు ఆమోముద్ర వేశారు. దాంతో పనుల అగ్రిమెంట్ విలువ రూ.1,427.70 కోట్లకు పెరిగింది. ఇందులో 16.9991 శాతం బోనస్ విలువ రూ.199 కోట్లు కావడం గమనార్హం. వీటితోపాటు డిజైన్లు మార్చేయడం ద్వారా పట్టిసీమలో రూ.376.14 కోట్లు దోచేశారు. పట్టిసీమ స్ఫూర్తితో వైకుంఠపురం బ్యారేజీ పనుల టెండర్‌ను ఖరారు చేయాలని సోమవారం సాగునీటి ప్రాజెక్టుల పనులపై నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. సమీక్ష ముగిసిన తర్వాత అధికారులను బయటకు పంపించి.. కాంట్రాక్టర్, జలవనరుల శాఖకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులతో చంద్రబాబు రహస్య మంత్రాంగం జరిపారు. 24.99 శాతం అదనపు ధరలకు కాంట్రాక్టర్ షెడ్యూల్ దాఖలు చేస్తారని.. ఇందులో 4.99 శాతం అదనపు ధరగా పరిగణించాలని, మిగతా 20 శాతాన్ని బ్యారేజీ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తే బోనస్‌గా ఇస్తామని నిబంధన పెట్టి, టెండర్లను ఆమోదించాలని దిశానిర్దేశం చేశారు. అంటే అంచనా వ్యయం పెంచడం ద్వారా రూ.657.12 కోట్లు, 24.99 శాతం అధిక ధరలకు అంటే.. రూ.364.60 కోట్లు వెరసి రూ.1,021.72 కోట్ల మేర కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చి.. అందులో రూ.500 కోట్లకు పైగా కమీషన్ల రూపంలో రాబ్టుకోవాలన్నది సీఎం చంద్రబాబు ఎత్తుగడ. -
తుపాకుల కలకలం
♦ నాడు వెల్కటూర్ లో.. నేడు రాంపూర్‌లో ♦ మాఫియాకు అడ్డాగా మారుతున్న నంగునూరు ♦ పీస్‌జోన్ కావడంతో అక్రమార్కుల కన్ను ♦ సెటిల్మెంట్లు, భారీ దోపిడీలే లక్ష్యంగా అద్దెకు నంగునూరు: మూడు నెలల క్రితం వెల్కటూర్‌లో ఒక వ్యక్తి ఇంట్లో నుంచి పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకోగా తాజాగా రాంపూర్ వద్ద మూడు తుపాకులు లభించడం మండలంలో కలకలం రేపుతోంది. మండలం మారుమూల ప్రాంతం కావడంతో పాటు రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ పీస్ జోన్లో ఉండడంతో మాఫియాకు అడ్డాగా మారుతోంది. శనివారం రాత్రి రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు రెండు తుపాకులు, ఒక తపంచాతో పట్టుబడిన విషయం తెలిసిందే. వీరు ఎదైనా దోపిడీ ముఠా సభ్యులా.. లేక మాఫియా గ్యాంగ్‌కు చెందిన వారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలో పోలీసులను చూసి ముగ్గురు పారిపోగా ఒక వ్యక్తి పెద్ద బ్యాగ్ భుజానికి వేసుకొని పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎక్కడో సెటిల్మెంట్ చేసి భారీగా వచ్చిన డబ్బుల పంపకాల విషయంలో తేడాలు రావడంతో దాడులు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్క జిల్లాకు చెందిన ఒక వ్యక్తి, మండలానికి చెందిన మరో వ్యక్తితో కలసి దుబాయికి తీసుకెళ్తామని కొందరి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూల్ చేసినట్లు వినికిడి. విదేశాలకు పంపించాలని డబ్బులు ఇచ్చిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతో వారిని బెదిరించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ జిల్లా వారణాసి ప్రాంతానికి చెందిన కిరాయి హంతకులను ఇక్కడికి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. దుండగులు హన్మకొండ ప్రధాన రహదారిపై రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద గతంలో దాబా హోటల్ నడిచిన ఇంట్లో పది రోజులుగా బస చేస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నా ఎవ్వరికి అనుమానం రాకపోవడం గమనార్హం. నాడు వెల్కటూర్.. నేడు రాంపూర్ మండలం సిద్దిపేట పట్టణానికి సమీపంలో ఉన్నప్పటికీ మారుమూల ప్రాంతం కావడంతో నిఘా తక్కువగా ఉంటోంది. ఇదే కాకుండా రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో క్రైం శాతం తక్కువగా ఉండడం, పీస్ జోన్ కింద ఈ ప్రాంతం ఉండడంతో మాఫియా, ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ నెలలో వెల్కటూర్‌కు చెందిన బత్తిని వెంకటస్వామి ఇంట్లో పో లీసులు సోదాలు చేసి తుపాకీ స్వాధీనం చేసుకొని అతడిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి నెలలో లారీలో తరలిస్తున్న రెండు వందల క్వింటాళ్ల గంజాయిని రాజగోపాల్‌పేట ఎస్ఐ గోపాల్‌రావు పట్టుకున్న విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నుంచి జిల్లాలోని రాజగోపాల్‌పేట వరకు ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ లేకపోవడంతో నిఘా తక్కువగా ఉంటోంది. దీంతో అసాంఘీక కార్యకలాపాలకు మండలం అనువుగా మారింది. అలాగే ఈప్రాంతం లో నాలుగు దాబా హోటళ్లు ఉండడం మద్యం, భో జనాలు లభించడంతో అక్రమార్కులకు అడ్డాగా మారింది.