దున్నలు దున్నేస్తాయని..
సాధారణంగా చెట్టెక్కే టాలెంట్ చిరుతపులికే సొంతం. కానీ ఇక్కడ సింహానికి ఆ టాలెంట్‌ను చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే.. దిగితే దున్నలు దున్నేస్తాయని భయం. కెన్యాలోని మాసాయి మరా జాతీయ పార్కులో ఈ మృగరాజు మాంచి ఆకలి మీద వేటకు బయల్దేరింది. దారిలో అడవి దున్నలు కనిపించాయి. దూడ వాటికి కాస్త దూరంగా ఉండటంతో దాన్ని లటుక్కున పట్టుకుని చటుక్కున పారిపోదామనుకుంది.
కానీ సీన్ రివర్సైంది. అడవి దున్నలన్నీ సింహం వైపు దూసుకొచ్చాయి. సింహం దౌడ్ అంటూ పరుగు తీసింది. దున్నలు వదిలితేగా.. దీంతో చేసేది లేక.. చివరికి ఇలా చెట్టెక్కెంది. ఎంతైనా అది చిరుతపులి కాదు కదా.. దీంతో ఎక్కువసేపు ఉండలేక.. కిందకు దూకి.. కాళ్లకు పనిచెప్పింది. ఈ దృశ్యాలను చార్లెస్ కొమిన్ అనే మాజీ సైనికాధికారి తన కెమెరాలో బంధించారు.