breaking news
marriage book
-
ఏడడుగులు తడబడి... విడివడి
మన దగ్గర ‘పెళ్లి పుస్తకం’ అమ్మాయి సహనం, సైలెన్స్.. అబ్బాయి ఆజ్ఞ, అధికారంతో రాసి ఉంది! కుటుంబ పరువు, ప్రతిష్ఠల మధ్య బైండ్ అయిపోయింది! అందుకే కలహాలు, కలతలున్నా ఆ కాపురం సాగిపోతూనే ఉండింది! కానీ దాన్నిప్పుడు అమ్మాయిలు ప్రేమ, కంపాటబిలిటీతో తిరగరాసేందుకు ప్రయత్నిస్తున్నారు. గౌరవం, భావోద్వేగాలతో బంధించాలనుకుంటున్నారు. అయితే ఆ ప్రయాణంలో విడాకుల అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాన్ని గమనిస్తున్న పెద్దలకు మన వివాహ వ్యవస్థ కూలిపోతున్నట్టనిపించవచ్చు! కానీ.. ఒక వ్యవస్థను పునర్నిర్మించడంలో అలాంటివి సాధారణమే అంటున్నారు సామాజిక విశ్లేషకులు. ఆ తడబాట్లు సర్దుకుని పెళ్లిపుస్తకంలో కొత్త పేజీలుగా మారుతాయని చెబుతున్నారు! సుచరిత బిజినెస్ ఎనలిస్ట్. పెళ్లయి రెండేళ్లవుతోంది. భర్త సాఫ్ట్వేర్. పెళ్లయిన వెంటనే యూకేలో మంచి జాబ్ ఆఫర్ వస్తే.. పెళ్లిని నిలబెట్టుకోవడం కోసం ఆ జాబ్ ఆఫర్‌ని వద్దనుకుంది. ఓ స్టార్టప్ ప్లాన్ చేసుకుని ఈ రెండేళ్లలో దాన్ని బాగా డెవలప్ చేసుకుని ఆంట్రప్రెన్యూర్‌గా స్థిరపడే దశకు చేరుకుంది. ఆ క్రమంలో పిల్లలనూ అప్పుడే వద్దనుకుంది. భర్త మాత్రం పిల్లలు కావాలనుకుంటున్నాడు. ఈ మధ్యే అతనికి అమెరికాలో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. సుచరితనూ తీసుకుని అమెరికా వెళ్లిపోతే పిల్లల కోసం కన్విన్స్ అవుతుందనుకుని ఆ జాబ్‌కు ఓకే చేసి ఇక్కడున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, సుచరిత ముందు తన ప్రపోజల్ పెట్టాడు. తను స్టార్టప్‌ను వదిలేసి వచ్చే సమస్యే లేదని స్పష్టం చేసింది. చర్చలు, వాదనలు జరిగాయి. ‘పెళ్లయిన కొత్తలోనే ఇప్పుడు నీకొచ్చిన జాబ్ ఆఫర్ కన్నా రెట్టింపు శాలరీతో మంచి ఆఫర్ నాకు వచ్చింది. కానీ మన పెళ్లిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ జాబ్‌ను వద్దనుకున్నాను. ఇప్పుడు నా స్టార్టప్ క్లిక్ అయ్యింది. ఇంత ఎఫర్ట్నీ తుంగలో తొక్కి నీతో రమ్మంటే రాలేను. కావాలంటే నువ్వు నా కంపెనీలో చేరు. ఇద్దరం కలిసి పనిచేద్దాం!’ అంది. ససేమిరా అన్నాడు. మన బంధానికన్నా నీకు ఆ స్టార్టప్పే ఎక్కువ? నీ కెరీర్ కోసం మదర్‌హుడ్‌ని కూడా పణంగా పెడతావా?’ అంటూ నిలదీశాడు. ఆ మాటలకు, ఆ ఆలోచనా ధోరణికి విస్తుపోయింది సుచరిత.‘నేనేం పిల్లలను వద్దనుకోవట్లేదు. నీ అమెరికా జాబ్ కోసం నా కెరీర్‌ను వదలను అంటున్నాను. నువ్వు ఇక్కడే ఉండు.. పిల్లల కోసమూ ప్లాన్ చేసుకుందాం’ అంది. రాజీకి రాలేదు అతను. అయితే విడాకులు కావాలంది సుచరిత. ఆమె నిర్ణయానికి అటు పెద్దలు, ఇటు పెద్దలు హతాశులయ్యారు. మూర్ఖత్వంతో కాపురాన్ని కూల్చుకుంటున్నావంటూ తిట్టారు. అయినా చలించలేదు సుచరిత. కూతురి తీరుకు ఏడుస్తున్న తల్లిని ‘నన్నెవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు నువ్వు అపార్థం చేసుకోవడమే పెయిన్‌గా ఉందమ్మా! బాగా చదువుకోవాలి, నీ కాళ్లమీద నువ్వు నిలబడాలి, కోట్ల ఆస్తి ఉన్న భర్త దొరికినా సరే.. నీకంటూ రూపాయి సంపాదించుకున్నప్పుడే నీకు ధైర్యం, గౌరవమని నువ్వు చెప్పిన మాటల్ని నువ్వే మరచిపోయావా? ఆ గోల్ కోసం నేను పడ్డ కష్టాన్ని నువ్వూ ఇగ్నోర్ చేయడమేంటమ్మా..’ అంటూ బాధపడింది. అమ్మకు అర్థమైంది, అలాగని కూతురిని పూర్తిగా సమర్థించలేకపోయింది.ఎందుకంటే.. ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని చిన్నప్పటి నుంచీ నూరిపోసిన ఆ తల్లి ఆడపిల్లకు కాపురం కూడా అంతే ముఖ్యం, అవసరమైతే అంతకన్నా ముఖ్యమనే సంప్రదాయ విలువలకు కండిషనింగ్ అయి ఉంది. ఆ భావజాలం కూతురి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి అడ్డం పడుతోంది. తన పెంపకం పట్ల అపరాధ భావాన్నీ కలిగిస్తోంది. ఆమే కాదు ఆడపిల్లల చదువును, ఉన్నతిని కాంక్షించి ఆ దిశగా వాళ్లను తీర్చిదిద్దిన చాలామంది తల్లిదండ్రులదీ అదే భావన. పెళ్లిని నిలుపుకోవడం కోసం చదువును, కెరీర్‌ను ఆడపిల్లలే పణంగా పెట్టాలనుకుంటారు. ఎందుకంటే ఎంతకాదన్నా మన దగ్గర పెళ్లి సఫరింగ్నే గ్లోరిఫై చేస్తోంది కాబట్టి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. బాధ పడుతున్నా.. హింసను ఎదుర్కొంటున్నా, మానసిక దూరం పెరుగుతున్నా, భావోద్వేగాలు నిర్లక్ష్యం అవుతున్నా ఆలుమగలు కలిసి ఉండాలనే నేర్పుతోంది కుటుంబం. కానీ..చదువు, లోకజ్ఞానం, సాధికారత ఇచ్చిన ధైర్యంతో అలాంటి కాపురంలో కొనసాగడం కన్నా విడాకులతో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు సుచరితలాంటి అమ్మాయిలు. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేని పెళ్లిని పెళ్లిగానే చూడట్లేదు. విడాకులను పెద్దవాళ్లు పరువుప్రతిష్ఠలకు ముడిపెడతారు. ఆ భావన నుంచి బయటపడాలి. భరిస్తూ కలిసి బతకడంలో అర్థం లేదు. విడిపోయినా ఆత్మగౌరవంతో బతకడంలోనే ఆనందముందని గ్రహించాలని కోరుకుంటున్నారు. అందుకే ఏమైనా సరే సహనంతో సర్దుకుపోవాలంటూ పిల్లలను బలవంత పెట్టకూడదని మానసిక, న్యాయ నిపుణులూ చెబుతున్నారు. ఇది సంప్రదాయాన్ని మంటగలుపుతున్న మార్పు కాదు. పరిణామ క్రమమని అంటున్నారు సామాజిక విశ్లేషకులు. విడాకులకు కారణాలు.. మునుపటిలా ఆడవాళ్ల పని, మగవాళ్ల పనంటూ బాధ్యతలను జెండర్ కోణంలో చూడట్లేదు. ఇంటా, బయటా స్త్రీ, పురుషుల విధుల్లో మార్పులొచ్చాయి. మారిన ఈ విలువలను జీర్ణించుకోలేని కాపురాలు విడాకుల బాట పడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ఆర్థిక సమస్యలు, బంధంలో భావోద్వేగాల సమన్వయం లోపించడం, నమ్మకం లేకపోవడం, అభద్రత, అస్తవ్యస్త పనివేళలు, మద్యం, ధూమపానం మొదలైనవీ విడాకులకు ప్రధాన కారణాలే అంటున్నాయి అధ్యయనాలు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, లక్నో వంటి నగరాల్లో విడాకుల దరఖాస్తులు మూడింతలయ్యాయి. పురుషాధిపత్య సమాజాలుగా పేరొందిన ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో విడాకుల సంఖ్య, వేరు పడిన సంసారాల సంఖ్యా తక్కువగా ఉన్నాయి.పెళ్లి, పిల్లలు,పేరెంటింగ్, విడాకులు, ఆందోళన వంటివన్నీ మనదాకా వస్తేగానీ తెలియవు. కాలం కలిసి వచ్చినప్పుడు అంతా బ్రహ్మాండంగా సాగుతూ మనంత తెలివిగల వాళ్లు లేరనిపిస్తుంది. కాలం ఎదురు తిరిగినప్పుడే అసలు సినిమా కనిపిస్తుంది.– కరీనా కపూర్భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మంచి, చెడు రెండిటికీ కమ్యూనికేషన్ ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. అనుబంధం బలపడుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఆ బంధంలోకి భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మంచి, చెడు రెండిటికీ కమ్యూనికేషన్ ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. అనుబంధం బలపడుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఆ బంధంలోకి మూడోవ్యక్తి దూరకూడదు. ఆ జంటే పరిష్కరించుకోవాలి.మూడోవ్యక్తి దూరకూడదు. ఆ జంటే పరిష్కరించుకోవాలి.– విద్యా బాలన్ – సరస్వతి రమ -
జ్ఞాపకాల పందిరి.. విషాద లోగిలి
పెళ్లి పుస్తకంలో ఓ పేజీ రక్తసిక్తమైంది. వధూవరులు.. బంధుమిత్రుల రాకతో మధురజ్ఞాపకాలు మిగిల్చాల్సిన తిరుగుపెళ్లి విషాదం నింపింది. ఓ గంట గడిస్తే.. సంబరం అంబరాన్నంటాల్సిన ఆ ఇల్లు శోకసంద్రమైంది. ఆనందాలకు స్వాగతం పలుకుదామని ఒళ్లంతా కళ్లుచేసుకున్న మామిడి తోరణం ముడుచుకుపోయింది. ఆ జంట జీవితంలో సరికొత్త రాగం ఆలపించాల్సిన పాట మూగబోయింది. పెళ్లి ముచ్చట్లతో సాగుతున్న ఆ ప్రయాణాన్ని మృత్యువు అడ్డగించింది. మలుపులో మాటేసి పంజా విసిరింది. వందేళ్ల జీవితానికి సాక్ష్యంగా నిలవాల్సిన రోజు.. ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. మహానంది: కర్నాలు-ప్రకాశం జిల్లాల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతంలో పాత రైల్వే బ్రిడ్జి వద్ద శుక్రవారం అర్ధరాత్రి పెళ్లి బృందం లారీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 42 మంది క్షతగాత్రులు కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన శిరీషకు గిద్దలూరు పట్టణంలోని చట్రెడ్డిపల్లెకు చెందిన నరసయ్యతో ఈనెల 18న వివాహమైంది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు తిరుగుపెళ్లి నిమిత్తం వధూవరులతో పాటు బంధుమిత్రులు సుమారు 50 మంది లారీలో బయలుదేరారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నల్లమలలోని పాత రైల్వే బ్రిడ్జి వద్దనున్న మలుపులో అదుపుతప్పిన లారీ కొండను ఢీకొంది. ఘటనలో చట్రెడ్డిపల్లెకు చెందిన తిరుపాలు(55), ప్రభాకర్(33), ఏసోబు(39), బోయలకుంట్లకు చెందిన ఉడుముల జయమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందగా.. చట్రెడ్డిపల్లెకు చెందిన గడ్డం వెంకటయ్య(34), మొలక కృష్ణ(20)లు గిద్దలూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 31 మందికి తీవ్ర గాయాలు కాగా.. కర్నూలు, నంద్యాల, ఒంగోలు, నరసరావుపేట, గిద్దలూరులో చికిత్సనందిస్తున్నారు. వీరిలోనూ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పెళ్లికూతురు స్వగ్రామం గోపవరంలో విషాదం అలుముకుంది.