breaking news
Mandsaur railway station
-
మహిళలపై దాడి వీడియో కలకలం
-
మహిళలపై దాడి వీడియో కలకలం
మందసార్: అల్పసంఖ్యాక వర్గాలపై హిందూ అతివాద శక్తుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గుజరాత్ లోని ఉనాలో జరిగిన అవమానవీయ ఘటన ఒకపక్క దేశాన్ని కుదిపేస్తుండగానే మధ్యప్రదేశ్ లో మహిళలపై ఇలాంటి దురాగతం చోటుచేసుకుంది. మందసార్ రైల్వేస్టేషన్ లో ఇద్దరు ముస్లిం మహిళలపై హిందూ దళ్ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. జయొరా ప్రాంతం నుంచి గోమాంసం తీసుకువచ్చారనే ఆరోపణలతో ఇద్దరు ముస్లిం మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగానే హిందూ దళ్ కార్యకర్తలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఇద్దరు మైనారిటీ మహిళలను నోటికొచ్చినట్టు దూషించి, విచక్షణారహితంగా కొట్టారు. బాధితులు కింద పడిపోయారు. ప్రత్యక్షసాక్షి ఒకరు వీడియో తీయడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. తీరిగ్గా మేలుకున్న పోలీసులు అరగంట తర్వాత ఇద్దరు మహిళలను స్టేషన్ కు తరలించారు. వీరి నుంచి 30 కిలోల మాంసం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దీన్ని పరిశీలించిన స్థానిక డాక్టర్లు గొడ్డుమాంసంగా ధ్రువీకరించారు. గొడ్డుమాంసం అక్రమ రవాణా చేస్తున్నారనే అభియోగాలపై ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. బహిరంగంగా వీరిపై విచక్షణారహితంగా దాడి చేసిన మహిళలు, పురుషులపై పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం.