breaking news
Managing Trustee
-
‘బసవ తారకం’ ట్రస్టీ తులసీదేవి కన్నుమూత
హైదరాబాద్/తెనాలి రూరల్: బంజారాహిల్స్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి స్థాపనలో కీలకపాత్ర పోషించి.. వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్న డాక్టర్ పోలవరపు తులసీదేవి (80) శనివారం గుండెపోటుతో న్యూయార్క్‌లోని తన నివాసంలో మరణించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామానికి చెందిన తులసీదేవి న్యూయార్క్ నగరంలో గైనకాలజిస్టుగా స్థిరపడ్డారు. ఆమె భర్త డాక్టర్ రాఘవరావు ఆర్థోపెడిక్ సర్జన్. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పేద రోగులకు అందుబాటు ధరల్లో చికిత్స అందించే ప్రపంచ శ్రేణి క్యాన్సర్ చికిత్సా కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఎన్టీ రామారావు సంకల్పించగా.. అమెరికాలో ఇండో–అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి అమెరికాలో ఉన్న సుప్రసిద్ధ వైద్యులు, ఇతర తెలుగు వారిని ఏకం చేసి సంస్థ స్థాపనకు అవసరమైన నిధులు, అత్యాధునిక వైద్య పరికరాలు అందించడంలో తులసీదేవి ఎంతో కృషి చేశారు. తన స్వగ్రామమైన కంఠంరాజు కొండూరులో తండ్రి కారుమంచి గోవిందయ్య పేరిట ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. అమెరికాలో వైద్యపరమైన లాంఛనాలు పూర్తి కాగానే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు రానున్నట్టు డాక్టర్ కె.తుకారాం ప్రసాద్ తెలిపారు. కాగా, క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు, నిర్వహణలో కీలక భూమిక పోషించిన తులసీదేవి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆస్పత్రి చైర్మన్, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. -
మనసున మనసై..
‘ఇల్లు కట్టి చూడు-పెళ్లి చేసి చూడు’ అనేది నాటికీ నేటికీ ఎవర్గ్రీన్ నానుడి. అన్ని విధాల అనుకూలమైన సంబంధం చూసి పెళ్లి చేయడం రోజురోజుకూ కష్టసాధ్యం అయిపోతోంది. సకలాంగుల వివాహాలే సవాల్‌గా మారిపోయిన తరుణంలో వికలాంగులు వివాహం మాటేమిటనే ప్రశ్నకు చెన్నైలోని గీతాభవన్ ట్రస్ట్ సగర్వమైన సమాధానంగా నిలిచింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: జీవితంలో వివాహం కేవలం ఓ ముచ్చటేకాదు, ఒక ఆనందకరమైన బాధ్యత. మనిషి జీవితాన్ని వివాహాత్పూర్వం, వివాహానంతరంగా విభజించవచ్చు. మనిషి జీవితంలోని కీలకమైన మలుపుల్లో ఎక్కువ శాతం వైవాహిక జీవితంతో సంక్రమించేవే. ఏకాకిగా ఉండే ఒక వ్యక్తి సామూహిక శక్తిగా ఎదగడం భార్య, పిల్లలు, మనవ ళ్లు, మనవరాండ్రలతోనే సాధ్యం. జీవితంలో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వైవాహిక జీవితానికి నోచుకోక అంగవైకల్యాలతో వ్యథ భరిత జీవితాన్ని నెట్టుకొస్తున్న ప్రత్యేక ప్రతిభావంతులను గీతాభవన్ ట్రస్ట్ అక్కున చేర్చుకుంటోంది. ప్రత్యేక ప్రతిభావంతుల కోసమే ప్రత్యేకంగా 2010 నుంచి స్వయంవరాన్ని నిర్వహిస్తూ గత ఐదేళ్ల కాలంలో 248 జంటలకు అంగరంగ వైభవంగా ఉచితంగా వివాహాలు చేసింది. ఆరో విడతలో అనేక జంటలు: ఇదిలా ఉండగా, ఆరోవిడత ప్రత్యేక ప్రతిభావంతుల స్వయంవరం గీతాభవన్ ట్రస్ట్ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతిభావంతులశాఖ కమిషనర్ డాక్టర్ కే మణివణ్ణన్ ముఖ్యఅతిథిగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఆర్కే చటర్జీ ప్రత్యేక అతిథిగా హాజరై స్వయంవరాన్ని ప్రారంభించారు. తమిళనాడు, పుదుచ్చేరీల నుంచే గాక ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లా నుంచి కూడా యువతీ యువకులు హాజరైనారు. మూగ, చెవుడు, పోలియో వ్యాధిగ్రస్తులు, ఏమాత్రం నడువలేని వారు, రెండు చేతులూ లేని వ్యక్తి, మానసిక వికలాంగులు ఇలా ఎందరో స్వయంవరంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికపై నుంచి తనను తాను పరిచయం చేసుకుని, తాను ఎటువంటి జీవిత భాగస్వామిని ఆశిస్తున్నానో చెప్పుకున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే కొన్ని జంటలు తామిద్దరం వివాహం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నామని వేదికపై నుంచే ప్రకటించారు. ఎవరిని ఎందుకు ఇష్టపడ్డారో వివరిస్తూ ముసిముసి నవ్వులతో వారి అంతరంగాన్ని ఆవిష్కరించారు. పెళ్లి అనే పదాలకు తావులేదని నిరాశ లో మునిగిపోయిన తరుణంలో గీతాభవన్ ట్రస్ట్ తమ జీవితాల్లో వసంతాన్ని నింపిందని ప్రతి జంట కృతజ్ఞతలు తెలుపుకున్నారు. యువతుల సంఖ్య పెరగడం శుభపరిణామం: ప్రత్యేక ప్రతిభావంతులకు సేవ చేసే భాగ్యం కలగడం మా అదృష్టం. ఏ కారణం చేతలో యువతులు పెద్ద సంఖ్యలో ముందుకు రాకపోవడం వల్ల యువకులు నిలిచిపోతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది యువతులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఆదివారం నాటి స్వయంవరానికి 162 మంది యువకులు, 55 మంది యువతులు హాజరైనారు. చెన్నైతోపాటు అనేక జిల్లాల్లో క్యాంపులు పెట్టి స్వయంవరాలు నిర్వహిస్తుండగా ఆదివారం సాయంత్రానికి 67 జంటలు వివాహానికి సిద్ధమయ్యారు. ప్రతి ఏటా 60 మందికి వివాహాలు చేయాలని సంకల్పించగా, వధూవరుల నిర్ణయం అయిన పక్షంలో 200 వివాహాలు సైతం జరిపేందుకు సిద్ధం. అయితే వీరందరికీ అక్టోబర్ 4వ తేదీన ట్రస్ట్ నిర్వహించే కౌన్సెలింగ్‌లో ఉత్తీర్ణులైన తరువాతనే తమ సమక్షంలో వివాహం చేసుకునే అవకాశం కల్పిస్తాం. ఎంపికైన జంటలకు డిశంబర్ 3వ తేదీన సకల లాంఛనలతో ఉచిత సామూహిక వివాహాలు జరిపిస్తాం. కాపురానికి అవసరమయ్యే రూ.లక్ష విలువైన వస్తు సామగ్రిని వధూవరులకు ఉచితంగా అందజేస్తాం. అశోక్ గోయల్, మేనేజింగ్ ట్రస్టీ, గీతాభవన్ ట్రస్ట్