breaking news
major canal
-
కొండపల్లి మైనింగ్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
సాక్షి, అమరావతి: కొండపల్లి మైనింగ్, మేజర్ కాల్వలు పూడికపై దాఖలైన పిటిషన్లపై సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదుల వాదనలు వినిపించారు. ఇబ్రహీంపట్నంలోని మేజర్ కెనాల్ 19 నుంచి 24 కిలోమీటర్ల వరకు స్టోన్ క్రషర్ కంపెనీలు రోడ్డు వేసుకున్నాయి.. 17 చోట్ల కెనాల్‌ని పూడ్చేశాయి అని తెలిపారు. కెనాల్ పక్కన కొన్ని చోట్ల అక్రమంగా ఇల్లు ఏర్పాటు చేసుకున్నారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. (చదవండి: బెంజ్ సర్కిల్ ‘ఫ్లై ఓవర్ల’ వివాదానికి తెర) స్టోన్ క్రషర్ కంపెనీ పూడ్చేసిన 17 చోట్ల కెనాల్ పూడిక తీశాం. రిజర్వు ఫారెస్ట్‌కి 10 మీటర్లు లోపలే మైనింగ్ జరుగుతుంది. మైనింగ్‌కు సంబంధించిన గూగుల్ మ్యాప్ ఫొటోలు కూడా ఉన్నాయని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న కోర్టు అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. -
పంట కాలువనూ పీల్చేశారు!
రెండువేల ఎకరాలకు నీరందించే పంట కాలువ అది. రైతుల లోగిళ్లలో ధాన్యరాశులు కురిపించే వరదాయని అది. కానీ అదిప్పుడు మాయమైపోయింది. మైనింగ్ మాఫియా బారిన పడి రూపు కోల్పోయింది. క్వారీలను కొల్లగొట్టడంతోపాటు పంటలకు సాగు నీరందించే సాగర్ కాలువను సైతం మైనింగ్ మాఫియా మాయం చేసింది. తమ వాహనాలు తిరగడానికి వీలుగా కాలువను ఆక్రమించేయడమేగాక అడ్డంగా రహదారిని నిర్మించింది. అంతేకాదు కాలువ గట్టు మట్టిని సైతం కొల్లగొట్టి అమ్మేసుకుని సొమ్ము చేసుకుంది. దీంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేరకు పంట కాలువ కనిపించకుండా మాయమైంది. సందట్లో సడేమియా అన్నట్టుగా కాలువ మరమ్మతు పనుల కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్ ఎటువంటి మరమ్మతులు చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టించి రూ.కోట్లు దండుకున్నారు. ఫలితంగా కాలువ పూడుకుపోయి నీరు దిగువకు రాని దుస్థితి నెలకొంది. దీంతో రెండువేల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారి రైతులు తల్లడిల్లిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఎక్కడో కాదు.. సాక్షాత్తూ సాగునీటి శాఖ మంత్రి ఇలాకాలోనే చోటు చేసుకుంది. అధికారపార్టీ అండతో చెలరేగుతున్న మైనింగ్ మాఫియా ఆగడాలకు ఇది మరో నిదర్శనం. సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో నాగార్జునసాగర్ నుంచి సాగునీటిని తీసుకొచ్చే ఇబ్రహీంపట్నం మేజర్ కెనాల్ దాదాపు ఐదు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. గ్రామ శివారు సర్వే నంబర్ 801లో ఉన్న 1,204 ఎకరాల కొండపోరంబోకులోని దొనబండ క్వారీల పక్కనుంచి ఈ కాలువ ప్రవహిస్తుంది. గొట్టిముక్కల అబ్బరాజు చెరువు, పరిటాల చెరువుకు ఈ కాలువ ద్వారా నీరందుతుంది. గొట్టిముక్కల అబ్బరాజు చెరువు వరకు కాలువ బాగానే ఉంది. నాగార్జునసాగర్ నుంచి నీళ్లు విడుదల చేస్తే చెరువుకు నీరు చేరుతుంది. ఆ తర్వాత.. మైనింగ్ జరుగుతున్న ప్రాంతం నుంచి ఈ కాలువ సాగుతుంది. అయితే ఈ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్న మాఫియా.. అధికార పార్టీ అండతో చెలరేగిపోతోంది. క్వారీలను కొల్లగొట్టే క్రమంలో అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో కంచికచర్ల మండలం పరిటాల దొనబండ క్వారీలు ఉన్న ప్రదేశంలో ఐదు కిలోమీటర్ల మేరకు ఉన్న పంట కాలువను క్వారీల నిర్వాహకులు తమ సొంత అవసరాలకోసం ఆక్రమించారు. క్వారీల ప్రాంతంలోకి తమ వాహనాలు వెళ్లాల్సి ఉండడంతో కెనాల్‌పైనే రహదారులు నిర్మించారు. కార్మికులకు నివాసాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ పంట కాల్వ ద్వారా పరిటాల చెరువు కింద రెండువేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. మైనింగ్ మాఫియా కాలువను ఆక్రమించడమేగాక కాలువకు అడ్డంగా రోడ్లను సైతం నిర్మించడంతో సాగర్ నీరు వదిలినా ఈ కాలువలో నీళ్లు రావడానికి అవకాశం లేకుండా పోయింది. మరమ్మతుల పేరుతో నిధులు స్వాహా.. గత వేసవిలో దుగ్గిరాలపాడు నుంచి దొనబండ వరకు ఉన్న సాగర్ కెనాల్ ఎర్త్ వర్క్‌కోసం నిధులు మంజారయ్యాయి. దాదాపు 24 కిలోమీటర్ల వరకు ఉన్న కాలువ మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.9.35 కోట్లు నిధులు మంజూరు చేసింది. పనులను అధికారపార్టీకి చెందిన కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే సదరు కాంట్రాక్టర్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఉన్న ఐదు కిలోమీటర్ల మేరకు కాలువ మరమ్మతులు చేపట్టకపోగా పనులు చేసినట్టుగా చూపించి బిల్లు తీసుకున్నారు. ఆ మేరకు రూ.2 కోట్ల నిధులు స్వాహా చేసినట్టు సమాచారం. 5 వేల ట్రాక్టర్ల మట్టి విక్రయం... ఒకవైపు కాలువను ఆక్రమించి రోడ్లు వేసిన మైనింగ్ మాఫియా కాలువ గట్టుమీద ఉన్న మట్టిని కూడా వదల్లేదు. కాలువ గట్టుపై ఉన్న మట్టిని విక్రయించి సొమ్ము చేసుకుంది. దాదాపు ఐదువేల ట్రాక్టర్ల మట్టిని తవ్వేసి విక్రయించారని స్థానికులు చెబుతున్నారు. దీంతో కాలువ మరింత కుంచించుకుపోయి ఆనవాళ్లను కోల్పోయింది. బిల్లులు తీసుకున్నారు గతంలో కెనాల్ రిపేర్ల పనులు జరిగినట్టు రికార్డుల్లో ఉంది. ఆ టైంలో నేను లేను. కానీ ఆ రికార్డులు మాత్రం బదిలీపై వెళ్లిన ఏఈ ఇవ్వలేదు. పనులు మాత్రం పూర్తిచేసి బిల్లులు తీసుకున్నట్టు నా దృష్టికి వచ్చింది. – రమేష్‌బాబు, ఇరిగేషన్ ఏఈ కంచికచర్ల కాలువ లేకుండా చేశారు గతంలో క్వారీలున్న ప్రాంతంలో ఉన్న సాగునీటి కాలువను ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. కొందరు క్వారీ యజమానులు వారి లారీలు పోయేందుకు కాలువను పూడ్చి రోడ్డు నిర్మించుకున్నారు. కాలువపైనే రహదారులు ఏర్పాటు చేసుకోవడంతో పూర్తిగా పూడిపోయింది. దీంతో సాగునీటి పారుదల ఆగిపోయింది. క్వారీల సమీపంలోనే నాకు 8 ఎకరాల భూమి ఉంది. నీరు రాక ప్రస్తుతం వర్షంపైనే ఆధారపడి పంటలు పండించుకుంటున్నాం. – మాగంటి ప్రసాద్ రైతు, పరిటాల గట్టు కూడా కన్పించడం లేదు సాగర్ కెనాల్లో గతంలో సాగునీరు పుష్కలంగా ఉండేది. కొందరు క్వారీ యజమానులు వారి అవసరాలకోసం కాలువనే పూర్తిగా మాయం చేశారు. రైతుల అవసరాలకంటే వారి వ్యాపార ఆదాయంకోసం వాడుకోవటం బాధగా ఉంది. వారికి రాజకీయంగా పలుకుబడి ఉండడంతో అ«ధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కాలువ గట్టు మట్టిని కూడా వదలిపెట్టకుండా అమ్మేసుకున్నారు. దీంతో గట్టు కూడా కన్పించడం లేదు. – పురమా సత్యనారాయణ రైతు, పరిటాల -
అబ్బిరెడ్డిగూడెం మేజర్‌కు గండి
గరిడేపల్లి: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం మేజర్ కాలువకు గండి పడింది. దీంతో సమీప పంట పొలాల్లోకి భారీగా నీరు చేరుతోంది. స్థానిక రావిచెట్టు దగ్గర మేజర్‌కు సోమవారం తెల్లవారుజామున గండిపడింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.