breaking news
Mahanagar Gas Limited
-
సిటీ గ్యాస్‌లో పోటీ- ఎంజీఎల్, ఐజీఎల్ వీక్
రానున్న రోజుల్లో సిటీ గ్యాస్ పంపిణీ(సీజీడీ) బిజినెస్‌లో పోటీకి తెరతీసేందుకు వీలుగా నిబంధనలు విడుదల చేయనున్నట్లు పెట్రోలియం, సహజవాయు నియంత్రణ బోర్డ్(పీఎన్జీఆర్బీ) తాజాగా పేర్కొంది. దీంతో ఉన్నట్టుండి సిటీ గ్యాస్ పంపిణీ కంపెనీల కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. 30-45 రోజుల్లో సీజీడీ ప్రాంతాలను నోటిఫై చేసే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో లిస్టెడ్ కంపెనీలు మహానగర్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్ కౌంటర్లు బలహీనపడ్డాయి. వివరాలు చూద్దాం.. కోవిడ్-19 ఎఫెక్ట్ కొత్తగా పోటీకి తెరతీసే విషయంలో గడువు ప్రకటించనప్పటికీ తొలుత ముంబై, ఢిల్లీలలో ఇందుకు అవకాశమున్నదని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇది మహానగర్ గ్యాస్(ఎంజీఎల్), ఇంద్రప్రస్థ గ్యాస్ కౌంటర్లపై కొంతమేర ప్రభావం చూపనున్నట్లు అభిప్రాయపడింది. ఎంజీఎల్ ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంతోపాటు.. రాయ్‌గఢ్‌లో కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు సెంట్రమ్ బ్రోకింగ్ పేర్కొంది. అయితే కోవిడ్-19 కారణంగా ఇప్పటికే వృద్ధి అవకాశాలు నీరసించడంతో ఈ ఏడాది పెట్టుబడుల వ్యయాలను రూ. 400-500 కోట్లకు పరిమితం చేయనున్నట్లు అభిప్రాయపడింది. కాగా.. ఏడాదికి 40 కొత్త గ్యాస్ స్టేషన్లను ప్రారంభిస్తూ ఐజీఎల్ నిలకడగా వృద్ధి సాధిస్తున్నట్లు ఎడిల్వీజ్ సెక్యూరిటీస్ పేర్కొంది. ప్రాధాన్య రంగాలపై అధికంగా ఆధారపడటం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నట్లు తెలియజేసింది. నేలచూపులో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎంజీఎల్ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 1032 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1024 వరకూ వెనకడుగు వేసింది. ఇక ఐజీఎల్ షేరు 4.4 శాతం పతనమై రూ. 422 వద్ద కదులుతోంది. కాగా.. ఐజీఎల్ మార్చి 19న రూ. 284 వద్ద 52 వారాల కనిష్టాన్నీ, ఫిబ్రవరి 7న రూ. 534 వద్ద గరిష్టాన్నీ తాకింది. ఇదే విధంగా ఎంజీఎల్ మార్చి 19న రూ. 664 వద్ద ఏడాది కనిష్టాన్నీ, జనవరి 30న రూ. 1246 వద్ద గరిష్టాన్నీ చేరింది. -
నాకా జంక్షన్లో గ్యాస్ లీకేజీ
సాక్షి, ముంబై: వర్లీ నాకా జంక్షన్ వద్ద గురువారం మధ్యాహ్నం గ్యాస్ లీకయ్యింది. దాంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడున్న ప్రజలను ఖాళీ చేయించారు. మంటలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని లీకేజీని అరికట్టగలిగారు. వర్లీలోని సీఎన్జీ ఔట్లెట్లో సాంకేతిక లోపం వల్ల గ్యాస్ లీకేజీ అయ్యింది. వెంటనే గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ గ్యాస్ లీకేజీవల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్థానిక వర్లీ పోలీసులు చెప్పారు. అయితే లక్షల కేజీల గ్యాస్ గాలిలో కలిసిపోయిందని మహానగర్ గ్యాస్ కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, గ్యాస్ లీకేజీ అయినట్లు తెలియగానే అక్కడ ఎవరూ పొగ తాగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్యాస్ తీవ్రతను తగ్గించేందుకు అగ్నిమాపక సిబ్బంది లీకేజీపై నీటిని పిచికారి చేశారు. వర్లీనాకా జంక్షన్ కావడంతో వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. సాయంత్రం వరకు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయి. కాగా, ఈ ఘటన ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన గ్యాస్ దుర్ఘటనను జ్ఞప్తికి తెచ్చిందని స్థానికులు పేర్కొనడం గమనార్హం.