breaking news
magadi
-
జబ్బు నయం అయ్యేందుకు నరబలి
బాలిక హత్యకేసులో నిందితుల అరెస్ట్ బెంగళూరు : కర్ణాటకలోని మాగడి వద్ద చోటుచేసుకున్న నరబలి ఘటన మిస్టరీ వీడింది. పక్షవాతం బారిన పడిన వ్యక్తి కోలుకునేందుకు నిందితులు అభం శుభం తెలియని బాలికను నరబలి ఇచ్చారు. ఈమేరకు మాగడికి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్వాసిల్, నజీమ్తాజ్, రషీదున్నిసాను అరెస్ట్ చేసిన మాగడి పోలీసులు..ఇదే కేసుకు సంబంధించి మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. మహమ్మద్ వాసిల్ కుటుంబ సభ్యుల్లో ఒకరు పక్షవాతంతో బాధపడుతున్నారు. ఎన్ని చోట్ల వైద్యులకు చూపించినా నయం కాలేదు. దీంతో మూఢనమ్మకాలను ఆశ్రయించాడు. బాలికను నరబలి ఇస్తే పక్షవాతం నయమవుతుందంటూ ఎవరో చెప్పిన మాటలను నమ్మి తన సంబంధీకులతో కలసి చర్చించాడు. ఈమేరకు నరబలి ఇవ్వడానికి బాలిక కోసం అన్వేషణ సాగించారు. ఈ క్రమంలో మాగడిలో కిరాణదుకాణం నిర్వహిస్తున్న మహమ్మద్ నూరుల్లా కుమార్తె ఆయేషాపై నిందితుల కన్ను పడింది. ఈనెల 1న ఆయేషా ఒంటరిగా స్నేహితుల ఇంటికి వెళుతుండగా నిందితులు... ఆ బాలికను అపహరించి క్షుద్రపూజలు చేశారు. అనంతరం నరబలి ఇచ్చి మృతదేహాన్ని సమీపంలోని చెరువులో విసిరేసి పారిపోయారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు సంబంధించి మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
కోర్టులో లొంగిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణ
బెంగళూరు : మాగడి తాలూకాలోని కూదూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ, సీఐలను అసభ్యపదజాలాలతో దూషించిన కేసులో మాగడి ఎంఎల్ఏ బాలకృష్ణ శుక్రవారం మాగడిలోని ఒకటవ జేఎంఎఫ్‌సీ కోర్టులో లొంగిపోయారు. వివరాలు..తాలూకాలోని అయ్యండనహళ్లిలో ఇటీవల జరిగిన జాతరలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనలో తమ పార్టీకి చెందిన వారిపై దాడులకు పాల్పడ్డ వ్యక్తులను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సదరు ఎమ్మెల్యే ఎస్ఐ, సీఐలను బుధవారం అసభ్యపదజాలాలతో దూషించినట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు కూదురు సీఐ నందీశ్ జిల్లా ఎస్పీ రమేశ్‌కు ఫిర్యాదు చేశాడు. దీనికితోడు ఎంఎల్ఏ బాలకృష్ణ పోలీసు అధికారులను దూషిస్తున్న దృశ్యాలు ప్రసారమాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. దీంతో ఎస్పీరమేశ్ ఎమ్మెల్యే బాలకృష్ణపై కూదురు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారన్న విషయం తెలుసుకున్న బాలకృష్ణ తన లాయర్‌తో కలసి శుక్రవారం మాగడిలోని జేఎంఎఫ్‌సీ కోర్టులో లొంగిపోయారు.