breaking news
Madhava Rao Scindia
-
సింధియాలకు అందని సీఎం
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం పీఠం సింధియా కుటుంబాన్ని ఊరిస్తోంది. సీఎం అవుతారని అందరూ భావించినా జ్యోతిరాదిత్య సింధియాను కాదని సీనియర్ అయిన కమల్‌నాథ్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవ్‌రావు సింధియాకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పట్లో అర్జున్‌సింగ్ ఆయనకు సీఎం పీఠం దక్కకుండా చక్రం తిప్పారు. సీఎం రేసులో కమల్‌నాథ్‌తో పోటాపోటీగా తుదిదాకా జ్యోతిరాదిత్య ముందున్నారు. గుణ ఎంపీ అయిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలు తీసుకుని, పార్టీని విజయతీరాలకు నడిపించారు. 9 పర్యాయాలు ఎంపీ అయిన కమల్‌నాథ్ తన సీనియారిటీతోపాటు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు పొందడం ద్వారా సీఎం రేసులో పైచేయి సాధించారు. జ్యోతిరాదిత్యను సీఎం పీఠం ఎక్కిస్తే రాష్ట్రంలో అతిపిన్న వయస్కుడైన సీఎంగా రికార్డు సృష్టించేవారు. అయితే, కమల్‌నాథ్(72)వైపే అధిష్టానం మొగ్గు చూపింది. 1989లో జ్యోతిరాదిత్య తండ్రి మాధవ్‌రావు సింధియా విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. అప్పట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్‌సింగ్ చుర్హాత్ లాటరీ స్కాంలో ఇరుక్కోవడంతో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే, గ్వాలియర్ రాచకుటుంబానికి చెందిన మాధవ్‌రావు సింధియాకు సీఎం కుర్చీ అప్పగించరాదనే హామీని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నుంచి తీసుకున్న తర్వాతే అర్జున్‌సింగ్ పదవి నుంచి వైదొలిగారు. అంతేకాదు, తన వర్గం ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయాలు చేశారు. సీఎం పదవి తనకే దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్న మాధవ్‌రావు సింధియా కూడా భోపాల్‌లో మద్దతుదారులతో వేరుగా మకాం వేశారు. అయితే, అధిష్టానం మోతీలాల్ వోరాను ముఖ్యమంత్రిగా ఎంపికచేయడంతో మాధవ్‌రావు సింధియా తీవ్ర నిరాశ చెందారు. గ్వాలియర్ సంస్థానాధీశుల వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన నానమ్మ రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1971 ఎన్నికల్లో జనసంఘ్ తరఫున విజయరాజేతోపాటు మాధవ్‌రావు సింధియా కూడా పోటీ చేసి, గెలుపొందారు. అప్పట్లో ఇందిర ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన అతికొద్ది మందిలో వీరు కూడా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విజయరాజేను కూడా ప్రభుత్వం జైలుపాలు చేసింది. అయితే, మాధవ్‌రావు సింధియా 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన తోబుట్టువులు వసుంధరా రాజే, యశోధరా రాజే బీజేపీలో చేరారు. -
ఐదుగురు అగ్ర నేతలను వెంటాడిన ప్రమాదాలు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో అసలైన ప్రజా నాయకులుగా కీర్తిప్రతిష్టలు అందుకున్న ఐదుగురు అగ్ర నేతలను రోడ్డు ప్రమాదాలు కబళించాయి. ప్రజలకు మరింత కాలం సేవ చేయాలనున్న వారిని వెంటాడి మృత్యు ముఖంలోకి లాక్కెళ్లాయి. గోపీనాథ్ ముండే: మహారాష్ట్రలో బీసీ నాయకుడిగా, ప్రజా నేతగా రాజకీయాల్లో రాణిస్తూ వచ్చిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మంగళవారం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ముంబై వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా దారిలో ఓ కారు పక్క నుంచి ఢీకొట్టడంతో తీవ్ర షాక్‌కు గురైన ముండే గుండెపోటు, అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో మృతిచెందారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని 2004, 2009లో ఒంటి చేత్తో గెలిపించిన జన నేత, ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సాహిబ్‌సింగ్ వర్మ: ఢిల్లీ సీఎంగా (1996-1998), కేంద్ర మంత్రిగా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత సాహిబ్‌సింగ్ వర్మ 2007 జూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రాజేశ్ పైలట్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజేశ్ పైలట్ రాజస్థాన్‌లోని దౌసా సమీపంలో 2000 సంవత్సరం జూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మాధవరావు సింధియా: మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తొమ్మిదిసార్లు ఎంపీగా వరుసగా గెలిచిన మాధవరావు సింధియా 2001లో యూపీలో జరిగిన ప్రైవేటు విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.