breaking news
madanepalle
-
సీఎం జగన్ మదనపల్లె పర్యటన వాయిదా
మదనపల్లె: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మదనపల్లె పర్యటన వాయిదా పడిందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషా ప్రకటించారు. మిథున్‌రెడ్డి, నవాజ్‌బాషా మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ 25వ తేదీన సీఎం జగన్ మదనపల్లెలో పర్యటించాల్సి ఉందని చెప్పారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు, భద్రతా కారణాల వల్ల సీఎం పర్యటన వాయిదా పడినట్లు వివరించారు. తిరిగి ముఖ్యమంత్రి పర్యటన ఈ నెల 29 లేదా 30న ఉండవచ్చని, సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాక అధికారికంగా ప్రకటిస్తామన్నారు. -
అదంతా కార్పొరేట్ మీడియా సృష్టే: నారాయణ
మదనపల్లె: ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీని దేశమంతా సమర్థుడని కితాబునిస్తున్నారని, అయితే ఇదంతా కార్పొరేట్ మీడియా సృష్టించిన ప్రచారమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. నారాయణ విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలే మోడీకి ఎంతో దోహదపడ్డాయని చెప్పారు. మదనపల్లెకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉండగా రాజకీయాలు చేస్తూ ఇరు ప్రాంతాల్లో ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వీరిద్దరూ ఉద్దేశపూర్వకంగానే సమస్యలను జఠిలం చేస్తూ ఉనికి కాపాడుకునేందుకే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దివంగత సీపీఐ నేత చండ్రరాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను వచ్చేనెల 11వ తేదీ హైదరాబాదులో జరపనున్నట్టు నారాయణ తెలిపారు.