భారీ అగ్ని ప్రమాదం 20 లక్షల ఆస్తినష్టం
                  
	మారేడుపల్లి: సికింద్రాబాద్ కార్ఖానా విక్రంపురి కాలనీ లో ఓ ప్లాజాలో బారీ అగ్ని ప్రమాదం జరిగింది.  షాపింగ్ మాల్స్ లో మంటలు వ్యాపించడంతో రూ. 20 లక్షల అస్తి నష్టం వాటిల్లింది.  కార్ఖానా పోలీసులు తెలిపిన మేరకు.. కార్ఖానా లోని పూజా ప్లాజాలో ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఈజీ బై షోరూంలో షార్ట్సర్కూ్యట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికంగా ఉన్న వారు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
	అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే ఈజీబై షోరూం లో బారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినప్పటికి దట్టమైన పొగలు  వ్యాపించడంతో లోనికి  వెళ్లడం కష్టంగా మారింది..దీంతో షోరూం అద్దాలను ద్వంసం చేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సంఘటనా  స్థలం వద్ద కు ఐదు ఫైర్ ఇంజన్లతో  మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
	పక్కన  ఉన్న దుకాణాల్లోకి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పక్కనే ఉన్న అన్ స్కిన్ షోరూం  స్వల్పంగా దగ్ధమైంది. షోరూంలో దుస్తులతో పాటు కాస్మొటిక్స్ ఉండటంతో మంటలను ఆదుపులోకి తీసుకు రావడానికి చాలా సమయం పట్టింది. సుమారు ఇరవై లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.   అగ్ని ప్రమాద ఘటనతో స్థానికంగా ట్రాఫిక్  అంతరాయం ఏర్పడింది. స్టోర్ మేనేజర్ రవి కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.