breaking news
Los Angeles International Airport
-
ఐదు వేల అడుగుల ఎత్తులో ఎగిరిన మనిషి.. హై అలర్ట్!
టెక్నాలజీ ఎంత వృద్ధి చెందుతున్నా.. దానికంటూ ఓ పరిధి ఉంటుంది. కానీ, అది పరిధి దాటి ప్రవర్తిస్తే.. ఆ టెక్నాలజీ మీదే అనుమానాలు ఏర్పడుతుంటాయి. అలాంటిదే ఈ ఘటన. ఆకాశంలో మనిషి స్వేచ్ఛా విహారం కోసం తయారు చేసిన రెక్కల సాంకేతికత ‘జెట్ప్యాక్’లు అమెరికాను బెంబేలెత్తిస్తున్నాయి. జెట్ప్యాక్ ధరించిన ఓ మనిషి.. అదీ వేల అడుగుల ఎత్తులో సంచరించడం చర్చనీయాంశంగా మారింది. ఏడాది కాలంలో ఇది నాలుగో ఘటన కాగా.. లాస్ ఏంజెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(LAX) దగ్గర్లో కనిపించడంతో భద్రతాపరమైన అనుమానాలు మొదలయ్యాయి. సాక్రమెంటో: బోయింగ్ 747 ఫ్లైట్ ఒకటి బుధవారం సాయంత్రం లాస్ ఏంజెల్స్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. ఆ వెంటనే పైలెట్ అదరా బాదరాగా అధికారులకు ఒక రిపోర్ట్ చేశాడు. జెట్ప్యాక్ ధరించిన ఓ వ్యక్తి గాల్లో తేలుతుండడం చూశానని, ఎయిర్‌పోర్ట్‌కి 15 మైళ్ల దూరంలో ఐదు వేల అడుగుల ఎత్తున అతను కనిపించాడని రిపోర్ట్ చేశాడు ఓ పైలెట్. దీంతో మిగతా పైలెట్లు అప్రమత్తంగా ఉండాలని ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వార్త బయటకు లీక్ కావడంతో మీడియా ఛానెల్స్ అత్యుత్సాహం ప్రదర్శించాయి. సీబీఎస్ లాస్ ఏంజెల్స్ ఏకంగా యూఎఫ్‌వో, ఐరెన్‌మ్యాన్ అంటూ కథనాలు రాయడం కొసమెరుపు. ఎఫ్‌బీఐ అలర్ట్ జెట్ప్యాక్ మ్యాన్ కథల్ని మొదట్లో కాలిఫోర్నియా ప్రజలు ‘ఉత్త ప్రచారం’గా భావించారు. అయితే ఆగష్టు 2020లో అమెరికన్ ఎయిర్‌లైన్స్ పైలెట్ ఒకతను మూడు వేల అడుగుల ఎత్తులో జెట్ప్యాక్ వేసుకున్న ఓ వ్యక్తిని చూశానని చెప్పాడు. ఆ తర్వాత అక్టోబర్‌లో చైనా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ పైలెట్.. ఆరు వేల అడుగుల ఎత్తులో జెట్ప్యాక్మ్యాన్ను చూశానని వెల్లడించారు. ఇక అమెరికన్ ఎయిర్‌లైన్స్ పైలెట్ ఒకతను 300 యార్డ్ల దూరంలో తనకు అతిదగ్గరగా జెట్ప్యాక్మ్యాన్ను చూశానని చెప్పడం కలకలం సృష్టించింది. అంతేకాదు డిసెంబర్లో ఒక ఫుటేజీని రిలీజ్ చేయడం, అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కూడా అది జెట్ప్యాక్ మ్యాన్ అని నిర్ధారించడం జరిగిపోయాయి. ఇక ఇప్పుడు తాజా ఘటన తర్వాత ఎఫ్‌బీఐ అప్రమత్తం అయ్యింది. హై అలర్ట్ ప్రకటించి.. డ్రోన్ల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు అధికారులు. అంత ఎత్తు సాధ్యమేనా? ప్రపంచవ్యాప్తంగా జెట్ప్యాక్ తయారీ కంపెనీలు చాలానే ఉన్నాయి. కానీ, వాటిలో లైసెన్స్‌లతో అమ్మేవి కొన్నే అతితక్కువ మాత్రమే. అయితే జెట్‌ప్యాక్‌లో ఇంధనం ఎంత ఎత్తుమేర ఎగరడంలో సపోర్ట్ చేస్తాయనేదానిపై కంపెనీలపై ఒక క్లారిటీ లేకుండా పోయింది. కాలిఫోర్నియాకు చెందిన జెట్ప్యాక్ ఏవియేషన్ కంపెనీ.. జెట్‌ప్యాక్‌ల సాయంతో గరిష్టంగా పదిహేను వేల అడుగుల ఎత్తుకు ఎగరొచ్చని ఆ మధ్య ప్రకటించుకుంది. కానీ, ఆ కంపెనీ సీఈవో డేవిడ్ మయన్ మాత్రం అది అసాధ్యం అని ఇప్పుడు అంటున్నాడు. జెట్‌ప్యాక్‌లతో మనిషి పదిహేను వందల అడుగుల ఎత్తు వరకు వెళ్లడం సాధ్యమవుతుంది. అంతకు మించి వెళ్తే ఇంధన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక చైనా ఎయిర్‌లైన్స్ పైలెట్ చెప్పిన ఆరువేల అడుగుల ఎత్తులో జెట్ప్యాక్ మ్యాన్ నిజం అయ్యి ఉండకపోవచ్చు అని చెప్తున్నాడు మయన్. ఇదిలా ఉంటే ప్రముఖ ఏవియేషన్ కంపెనీ ‘జెట్మన్ దుబాయ్’.. కిందటి ఏడాది ఫిబ్రవరిలో పైలెట్ విన్స్ రెఫెట్ ద్వారా ఆరు వేల అడుగుల ఎత్తులో జెట్ప్యాక్ ప్రయోగం చేయించింది. అయితే ఒక రెక్కలో సాంకేతిక ఇబ్బంది తలెత్తడంతో ఆ ప్రయోగం విఫలమైంది. అయినప్పటికీ.. పారాషూట్సాయంతో సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు రెఫెట్. అయితే దురదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగిన తొమ్మిది నెలల తర్వాత ఓ ట్రైనింగ్ యాక్సిడెంట్లో రెఫెట్ మరణించాడు. -
కాక్‌పిట్‌లోకి వెళ్లే ప్రయత్నం; విమానం నుంచి దూకేశాడు
లాస్ ఏంజిల్స్: కదులుతున్న విమానం నుంచి ఓ ప్రయాణికుడు కిందకు దూకేసిన ఘటన లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. వివరాలు.. సాల్ట్ లేక్ సిటీకు వెళ్లాల్సిన యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ విమానం 5365ను స్కై వెస్ట్ నిర్వహిస్తోంది. కాగా సాయంత్రం 7 గంటల తర్వాత డోర్ తీసేందుకు ప్రయత్నించిన యువకుడు విమానంలో నుంచి బయటకు దూకేశాడు. అంతకముందు పైలట్లు ఉన్న కాక్‌పిట్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.ఆ తర్వాత సర్వీస్ డోర్ ఓపెన్ చేయాలనుకోగా.. చివరికి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కావడంతో అక్కడినుంచి దూకేశాడు. ఇది గమనించిన ఎయిర్పోర్ట్ అధికారులు అతన్ని కస్టడీలోకి తీసుకుని ట్యాక్సీవేలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో విమానం టేకాఫ్ తీసుకొని మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. అతను విమానం నుంచి దూకేయడం వెనుక ఉన్న కారణాలు తెలియరాలేదు. కాగా ఈ ఘటనపై ఎఫ్‌బీఐ విచారణ చేయనుంది. చదవండి: వార్నీ.. మంచం కింద ఇంత పెద్ద సొరంగమా..! -
రన్‌వేపై విమాన ప్రమాదం
లాస్ ఏంజిల్స్: లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మెక్సికో బయలుదేరుతున్న సమయంలో ఎరోమెక్సికో జెట్ విమానం ప్రమాదానికి గురైంది. విమాన రన్‌వేపై ఏర్పాటు చేసిన వేగ నిరోధకాన్ని ఆ విమానం ఢీ కొట్టింది. దీంతో విమానం ఎడమ చేతి భాగం దెబ్బతిందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 129 మంది ప్రయాణికులు ఉన్నారని.... వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ప్రయాణికులకు మరో విమానంలో వారి గమ్యస్థానానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. -
లాస్ఏంజల్స్ను వణికించిన షూటర్
లాస్ ఏంజల్స్: అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరాన్ని కొన్ని గంటలపాటు వణికించాడో షూటర్. లాస్ ఏంజెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కలకలం సృష్టించాడు. కార్లోంచే ఆటోమేటిక్ పిస్టల్ చూపుతూ ఎయిర్పోర్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌ను చంపేస్తానంటూ వీరంగం వేశాడు. చివరకు అన్నంతపనీ చేశాడు. ఎయిర్పోర్ట్ మూడో నెంబరు టెర్మినల్ దగ్గర ఈ సంఘటన జరిగింది. కాల్పుల సంఘటన తెలుసుకున్న సిటీ పబ్లిక్ టెన్షన్ పడిపోయారు. ఈ సంఘటనతో లాస్ ఏంజల్స్ మీదుగా వెళ్లే దాదాపు ఏడువందల విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఇంతటి కలకలం సృష్టించిన ఆ షూటర్‌ను ఆ తర్వాత పట్టుకున్నారు.