breaking news
Lodha recommendations
-
లోధా సిఫారసులు అమలు చేయరా?
హెచ్‌సీఏ తీరుపై అజహరుద్దీన్ విమర్శలు సాక్షి, హైదరాబాద్: లోధా కమిటీ సిఫారసులను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అమలు చేయడం లేదని భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ మండిపడ్డారు. హెచ్‌సీఏలో నిత్యకృత్యమైన ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై ఆయన విమర్శలు గుప్పించారు. మొయినుద్దౌలా గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నీ కోసం ఎంపిక చేసిన హైదరాబాద్ జట్లలో ప్రతిభ గల కుర్రాళ్లను పక్కన బెట్టడం దారుణమన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజహరుద్దీన్ మాట్లాడుతూ ‘ఇది చాలా విచారకరం. హెచ్‌సీఏ ‘ఎ’ డివిజన్ రెండు రోజుల లీగ్‌లలో మూడేసి సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ను, ఐదేసి వికెట్లు తీసిన బౌలర్లను హైదరాబాద్ ఇరు జట్లకు ఎంపిక చేయలేదు. లోధా ప్యానెల్ సిఫారసుల ప్రకారం సెలక్టర్లుగా నియామకమైనవారికి కనీసం 25 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి. కానీ దీన్ని హెచ్‌సీఏ పాటించట్లేదు. పీకల్లోతు అవినీతి అరోపణల్లో కూరుకుపోయిన హెచ్‌సీఏను ప్రక్షాళన చేయాల్సిందే. సర్వోన్నత న్యాయస్థానం నియమించిన ‘లోధా’ సిఫారసులను అమలు చేయాలి’ అని అజహరుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ జనవరిలో జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆయన విఫలయత్నం చేశారు. అయితే ఈ భారత మాజీ కెప్టెన్ వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు అజహర్ విమర్శలపై హెచ్‌సీఏ అధ్యక్షుడు జి.వివేకానంద్‌ను సంప్రదించగా... ‘లోధా సిఫారసుల అమలు విషయాన్ని బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) చూసుకుంటుంది. ఇది ఇప్పుడు కోర్టు పరిధిలోని అంశం. దీనిపై ఇంకా ఎక్కువ ఏమీ మాట్లాడలేను. ఆయన (అజహర్)కు ఏమైనా అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చు’ అని అన్నారు. -
పైసా కూడా ఇవ్వొద్దు
రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ నిధుల నిలిపివేత మ్యాచ్‌ల నిర్వహణకూ ఇవ్వరాదు ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు ‘లోధా’ సిఫారసులు అమలు చేసే వరకు ఇదే పరిస్థితి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆర్థిక స్వేచ్ఛకు దేశ అత్యున్నత న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది. గతంలో రెండు పెద్ద అకౌంట్ల కార్యకలాపాలను మాత్రమే నిలిపివేయాలన్న సుప్రీం కోర్టు... ఇప్పుడు నేరుగా రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఇచ్చే నిధులకే బ్రేక్ వేసింది. లోధా కమిటీ సిఫారసులు అమలు చేసే వరకు బీసీసీఐ ముందుకు వెళ్లలేని పరిస్థితి సృష్టించింది. రోజులు గడుస్తున్న కొద్దీ మరింత కఠినమైన ఆదేశాలు జారీ చేస్తున్న అత్యున్నత న్యాయ స్థానం ముందు ‘బలమైన’ బోర్డు ఇంకా ఎంత కాలం నిలవగలదో! న్యూఢిల్లీ: కొన్నాళ్ల క్రితం లోధా కమిటీ తమ రెండు అకౌంట్లను నిలిపివేసిన సమయంలో బీసీసీఐ తీవ్రంగా గగ్గోలు పెట్టింది. డబ్బులు లేకపోతే క్రికెట్ ఎలా, కివీస్‌తో సిరీస్ రద్దు చేస్తాం అంటూ బోర్డు బెదిరింపు ధోరణిలో మాట్లాడింది. అరుుతే తాము రాష్ట్ర సంఘాల నిధులను ఆపలేదని చివరకు లోధా కమిటీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు దానిని నిజం చేసింది. లోధా కమిటీ సిఫారసుల అమలు అంగీకరించే వరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు కూడా బీసీసీఐ నిధులు ఇవ్వరాదని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. బోర్డు అకౌంట్ల నుంచి రాష్ట్ర సంఘాలకు డబ్బులు బదిలీ కాకుండా నిలిపివేసింది. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులతో కూడిన బెంచ్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 17న వాదోపవాదనల అనంతరం తమ తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు శుక్రవారం దానిని ప్రకటించింది. మ్యాచ్‌లు నిర్వహించడం కోసం కూడా నిధులు అందించరాదని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. తాము లోధా కమిటీ సిఫారసలు అమలు చేస్తామంటూ రాష్ట్ర సంఘాలు రెండు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు సూచించింది. అప్పటి వరకు నిధుల బదిలీకి అవకాశం ఉండదు. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను నవంబర్ 3లోగా లోధా కమిటీ ముందు హాజరై సిఫారసులు అమలు చేసేందుకు తమకు ఎంత సమయం కావాలో చెబుతూ హామీ పత్రం దాఖలు చేయాలని కూడా సుప్రీం ఆదేశించింది. ఈ అంశంలో డిసెంబర్ 5న తదుపరి విచారణ జరుగుతుంది. ఆ నిధులు వాడరాదు... లోధా సిఫారసుల చర్చలో భాగంగా రాష్ట్ర సంఘాలను తాము నియంత్రించలేమని, వారు ముందుకు రాకపోవడం వల్లే తామూ నిర్ణయం తీసుకోలేకపోతున్నామంటూ బీసీసీఐ వాదనలు వినిపించింది. ఇప్పుడు అదే వాదనపై సుప్రీం దెబ్బ కొట్టింది. బోర్డు నుంచి నిధులు ఆపేయడం ద్వారా నేరుగా ఆయా సంఘాల ఉద్దేశాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. లోధా ప్రతిపాదనలు అమలు చేస్తేనే డబ్బులు వస్తారుు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర క్రికెట్ సంఘాలు కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో నిలిచారుు. ఆయా సంఘాలు తాము సిఫారసులు అమలు చేస్తున్నామంటూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. మరోవైపు త్వరలో మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉన్న 13 సంఘాలకు ఇప్పటికే బోర్డు నిధులు చేరారుు. అరుుతే దీనిపై కూడా సుప్రీం ఆంక్షలు విధించింది. సంస్కరణల అమలుపై హామీ ఇచ్చే వరకు ఆ డబ్బును ఖర్చు చేయరాదని కూడా ఆదేశించింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్ తర్వాత ఇంగ్లండ్ జట్టుతో మన జట్టు మ్యాచ్‌లు ఆడనుంది. మరోవైపు దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ కూడా కొనసాగుతోంది. స్వతంత్ర ఆడిటర్ నియామకం... మరోవైపు బీసీసీఐ వివిధ సంస్థలతో చేసుకునే ఒప్పందాలు, కాంట్రాక్ట్‌ల విషయంలో లోధా కమిటీకి సుప్రీం తగు సూచనలిచ్చింది. బోర్డు చేసుకునే కాంట్రాక్ట్ మొత్తాల విషయంలో ఏదైనా ఒక పరిమితి విధించాలని కోరింది. అంతకుమించి చేసే ఏ ఒప్పందమైనా కమిటీ ద్వారా మాత్రమే ఖరారు కావాలని చెప్పింది. ఈ నెల 25న ఐపీఎల్ ప్రసార హక్కులను బీసీసీఐ కేటారుుంచనుంది. ఈ నేపథ్యంలో ఆ భారీ ఒప్పందం విషయంలో బోర్డు ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరం. బోర్డు అకౌంట్లను పర్యవేక్షించేందుకు కమిటీ స్వతంత్ర ఆడిటర్‌ను నియమించాలని కూడా సుప్రీం ఆదేశించింది. ‘జులై 18నాటి తమ ఉత్తర్వులను అమలు చేసేందుకు ఏమేం చేయాలో సుప్రీం కోర్టు అదంతా చేస్తోంది. దీనిని బీసీసీఐ ఎంత వరకు పాటిస్తుందో చూడాలి. అనురాగ్ ఠాకూర్ వచ్చి చర్చిస్తానంటే మేం అందుకు సిద్ధంగా ఉన్నాం. గతంలోనూ ఆయనను ఆహ్వానించాం’ అని తాజా పరిణామాలపై జస్టిస్ లోధా వ్యాఖ్యానించారు. నాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. సుప్రీం ఉత్తర్వుల వల్ల క్రికెట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఇప్పుడే చెప్పలేను. తీర్పు కాపీ వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తాం. రాష్ట్ర సంఘాలతో ఈ అంశంపై చర్చించడం అన్నింటికంటే ముఖ్యం. సిఫారసుల అమలులో కొన్ని సమస్యలు ఉన్నారుు. వాటిని గతంలోనే కోర్టు ముందు ఉంచాం. -అనురాగ్ ఠాకూర్, బీసీసీఐ అధ్యక్షుడు